Jul 30,2023 13:21

ప్రజాశక్తి-వి.కోట (చిత్తూరు) : మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టి, స్త్రీ జాతి స్వతంత్రాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో చేపట్టిన మహిళల పోరుయాత్ర జాతకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి విజయవంతం చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పిలుపునిచ్చారు. హింసపై మహిళల పోరు యాత్ర జాతాను ఆదివారం వి.కోట అంబేద్కర్‌ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ... హింస లేని సమాజం కోసం జరుగుతున్న రాష్ట్ర యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రస్తుత సమాజంలో స్త్రీ జాతికి స్వతంత్రం ఎక్కడ వచ్చిందని ప్రశ్నించారు. మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినతరం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. మహిళలను నడిరోడ్డుపై నగంగా ఊరేగిస్తున్నా , నడిరోడ్డుపై వారిపై దాడులకు పాల్పడుతున్నా, స్పందించని సమాజాన్ని చూసి ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారనీ.. పాలకుల్లో మాత్రం చలనం రాకపోవడం విచారకరమన్నారు. స్త్రీలకు కల్పించిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకునేవిధంగా పాలకులపై ఒత్తిడి తీసుకురావాలని అన్ని ప్రజా సంఘాలు , రాజకీయ పక్షాలను పిలిపించారు. స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుపరచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వీటితోపాటు అత్యాచారాలకు పాల్పడే నిందితులను పాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారించి కఠినశిక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు. స్త్రీల పట్ల హింస, అశ్లీలత అసమానతులను ప్రేరేపించే చలనచిత్రాలను, టీవీ సీరియల్‌ తో పాటు ఇంటర్నెట్లపై నిషేధం విధించాలన్నారు. మద్యం, మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించాలన్నారు. మహిళలకు విద్య ఉపాధి అవకాశాలు మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మహిళల పట్ల హింసను అరికట్టే లక్ష్యంతో చేపట్టిన యాత్రను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఐద్వ రాష్ట్ర కోశాధికారి సావిత్రి , ఐద్వాజిల్లా కన్వీనర్‌ భువనేశ్వరి, వ్యవసాయ కార్మిక సంఘం నేత ఓబుల్‌ రాజు , మైనార్టీ సెల్‌ ఇనయతుల్లాఖాన్‌, ఐద్వా మండల సెక్రెటరీ అనిత, అంగన్వాడీ లీడర్‌ శ్యామల, ఐద్వా జిల్లా కో కన్వీనర్‌ జీవిత, ఆశా లీడర్‌ సుబ్బలక్ష్మి , హమాలీస్‌ నేత అరుణ్‌ , వీఆర్‌ఏ సంఘం నేత వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.