Aug 14,2022 12:30

'ఏం సారూ! మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఇక్కడకు రోజూ వచ్చి, కాసేపు కూర్చుని పోతున్నారు, మీకు అంత నచ్చిందా ఈ స్మశానం?' అంటూ ప్రశ్నించాడు మహాప్రస్థానం సూపర్వైజర్‌ శంకరం.
'మహాప్రస్థానం' జీవితంలో ఎవరైనా చేరుకోవాల్సిన ఆఖరి మజలీ అదే అని తెలిసినా, ఎవరూ బతికుండగా ఇక్కడికి రావడానికి ఇష్టపడరు. ఒకవేళ రావాల్సి వచ్చినా అయిష్టతతో ఏదో మొక్కుబడిగా వస్తారు తప్ప, ఎవరూ అక్కడ కూర్చుని కాలక్షేపం చేద్దామనుకోరు.
కానీ రాఘవయ్యకు మాత్రం ఎందుకో అక్కడ కాసేపు కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది పేరుకే మహాప్రస్థానం కానీ, చూడటానికి అందమైన పార్కుని తలపిస్తూ, చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. మహాప్రస్థానం మధ్యలో హరిశ్చంద్ర వాటిక పేరుతో పార్థీవదేహాలకు అంతిమ సంస్కారాలు, అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. పార్థీవ దేహాలన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యేంత వరకు, అయినవాళ్లు అక్కడే కూర్చుని చూడటానికి వాటిక చుట్టూ సిమెంట్‌ బెంచీలు ఏర్పాటు చేశారు.
'ఎవరైనా, చివరకు ఇక్కడే కదా శాశ్వతంగా నిద్రపోవాల్సింది? అందుకనే మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటున్నాను' అని సమాధానం ఇచ్చాడు రాఘవయ్య.
రాఘవయ్య కూర్చున్న సిమెంట్‌ బెంచి మీదే, కొద్దిగా దూరంగా కూర్చుంటూ 'నిజమే అనుకోండి సార్‌, కానీ ఇక్కడకు వచ్చేవాళ్లు ఎవరూ పట్టుమని పది నిమిషాలు కూడా ఉండరు సార్‌. అయినవాళ్ల శవాలకు కొరివి పెట్టి ఎప్పుడెప్పుడు పారిపోదామా అని చూస్తుంటారు. అలాంటిది మీరు... ఇంతకీ నా పేరు మీకు చెప్పలేదు, నా పేరు శంకరం ఇక్కడ సూపర్వైజర్ని' అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు శంకరం.
నిజమే, శంకరం అన్న మాటల్లో ఒక అక్షరం కూడా అబద్ధం లేదు. చితి మీద మండుతున్న శవాలు కాలి బూడిదయ్యేదాకా వేచి ఉండటానికీ ఓపిక లేక చాలామంది, కపాలమోక్షం జరిగిందని కాటికాపరి అరవగానే ఎవరి దారి వాళ్లు చూసుకోవటం చూస్తుంటే మానవ సంబంధాలు ఎంత బలహీనంగా ఉన్నాయో కదా అనిపిస్తూ ఉంటుంది.
'అంతిమ సంస్కారాలు చేయటానికి మీరు ఎంత తీసుకుంటారు?' అంటూ శంకరం వంక చూస్తూ అడిగాను.
ఆర్డినరీ ప్యాకేజీ ఎంతో చెప్పమంటారా? లేక డీలక్స్‌ ప్యాకేజీ చెప్పమంటారా? లేక కేవలం శవాన్ని కాల్చడానికి మాత్రమే ఎంతో చెప్పమంటారా?
'అప్పటిదాకా తనకు వచ్చిన సందేహంతో రాఘవయ్య అనుమానంగా చూసిన శంకరం, తన వృత్తికి సంబంధించిన విషయం వచ్చేసరికి ఉత్సాహంగా తెచ్చుకుని మరీ అడిగాడు.
'చావులోనూ ఇన్ని రకాల ప్యాకేజీలు ఉన్నాయా? ఆర్డినరీ ప్యాకేజీ అంటే ఏమేం చేస్తారు?..' ఆశ్చర్యంగా శంకరాన్ని అడిగాడు రాఘవయ్య.
'ఆర్డినరీ ప్యాకేజీ మాట్లాడుకుంటే, చనిపోయిన మనిషికి పాడె కట్టడానికి కావాల్సిన సామాగ్రి, శవాన్ని ఊరేగించడానికి పూలతో అలంకరించిన వ్యాను, శవాన్ని కాల్చడానికి కావాల్సిన కట్టెలు, కిరసనాయిలు, కాటికాపరి, చిన్న దినం, పెద్ద దినం రోజు పిండాలు పెట్టడానికి కావాల్సిన సామాగ్రి, పూజారి అన్నీ మేమే సమకూరుస్తాము' అంటూ వివరంగా చెప్పాడు శంకరం.
'మరి పాడె మోయటానికి ఓ నలుగురు మనుషులు కావాల్సొస్తే..?' రాఘవయ్య తన సందేహం నివృత్తి కాలేదు అన్నట్లు శంకరాన్ని మళ్లీ అడిగాడు.
'ఆర్డినరీ ప్యాకేజీలో వాళ్లు రారు సార్‌? అప్పుడు మీరు డీలక్స్‌ ప్యాకేజీ తీసుకోవాలి. డీలక్స్‌ ప్యాకేజీలో ఇంతకు ముందు చెప్పినవే కాకుండా, పాడె మోయటానికి ఐదారుగురు మనుషులు, గులాములు చల్లడానికి ఇంకో ఇద్దరు, ఊరేగింపు సాగేంతవరకూ డప్పులు మోగించే వాళ్లు, దారి పొడుగునా టపాకాయలు కాల్చడానికి మనుషులని ఏర్పాటు చేస్తాము' అంటూ మరింత వివరంగా చెప్పాడు శంకరం.
ఒక కాకి చచ్చిపోతే పది కాకులు దాని చుట్టూ చేరి కన్నీరు కారుస్తాయి. కానీ ఈ మనుషులకు మాత్రం ఒక మనిషి చచ్చిపోతే కనీసం స్మశానం దాకా వచ్చి కడసారి వీడ్కోలు పలుకుదాం అనే కనీస సంస్కారం కూడా లేకపోగా, అలా రావడానికి కూడా ఖరీదు కట్టడం చూస్తుంటే 'మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే' అన్న కారల్‌ మార్క్స్‌ మాటలు నిజమే అనిపిస్తుంది.
'ఇంతకీ ప్యాకేజీ రేట్లు ఎంతో?' అంటూ రాఘవయ్య అడిగేలోపే శంకరం 'ఆర్డినరీ ప్యాకేజీ అయితే రెండున్నర వేలు, డీలక్స్‌ ప్యాకేజీ అయితే పదివేలు, ఒకవేళ ఇంత డబ్బు పెట్టలేమంటే వెయ్యి రూపాయలతో శవాన్ని బూడిద చేసి, ఆస్తికలు మీకు అప్పగిస్తాం సార్‌' చిన్నపిల్లవాడు పాఠం అప్పజెప్పినట్లు గబగబా చెప్పేశాడు.
జేబులోంచి పదివేల కట్ట బయటికి తీసి శంకరం చేతులు పెట్టి, 'ఓ డీలక్స్‌ ప్యాకేజీ బుక్‌ చేయండి' అన్నాడు రాఘవయ్య.
అంత హఠాత్తుగా చేతిలో పదివేలు పెట్టేసరికి, కాస్త ఆశ్చర్యంతో, 'శవాన్ని ఎప్పుడు తీసుకొస్తారు సార్‌?' అంటూ అడిగాడు శంకరం, చచ్చిన వాళ్ల వివరాలు రాసుకోడానికి తన చేతిలో ఉన్న పుస్తకాన్ని తెరుస్తూ..
'మనిషి ఇంకా చావలేదు, చచ్చిన తర్వాత మీకు కబురు పెడతారు' అన్నాడు నింపాదిగా రాఘవయ్య.
'మనిషి ఇంకా చావలేదా? మరింత ఆశ్చర్యంతో తెల్ల మొఖం వేస్తూ అడిగాడు శంకరం.
'అవును ఇంకా చావలేదు, ఏం మీ దగ్గర అడ్వాన్స్‌ బుకింగ్లు ఉండవా?' శంకరం ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే మరో ప్రశ్న సంధించాడు రాఘవయ్య.
ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉన్న శంకరం ఆశ్చర్యం నుంచి తేరుకున్నవాడిలా, 'అడ్వాన్స్‌ బుకింగ్లు ఉంటాయనుకోండి, కానీ ఇంతవరకూ ఎవరూ ఇలా బుక్‌ చేసుకున్న వాళ్లు లేరు' అంటూ వినపడీ వినపడనట్లు నసిగాడు.
'మరింకేం రాసుకోండి..' అన్నాడు రాఘవయ్య కాస్తంత చిరు కోపం ప్రదర్శిస్తూ డబ్బులు ఇచ్చాం కదా అన్న ధీమాతో.
వివరాలు రాసుకోవడానికి సమాయత్తమైన వాడిలా జేబులో నుండి పెన్ను తీసి, 'చెప్పండి సార్‌, చావబోయే మనిషి పేరు, వివరాలు ఏమిటి?' అంటూ అడిగాడు శంకరం.
'చావబోయే మనిషికి వివరాలు ఏమిటి? మీ పిచ్చిగాని,' అంటూ నవ్వుతూ చూశాడు శంకరం వంక.
'ఏదో ఒక పేరు, ఊరు ఉండాలి కదా సార్‌, రాసుకోవడానికి' కాస్త చిరాగ్గా అన్నాడు శంకరం.
'సరే రాసుకోండి, కె.రాఘవయ్య, తండ్రి పేరు కె.బాపయ్య, వయస్సు: 72, చిరునామా:అమ్మానాన్నల అనాధాశ్రమం..' అంటూ టకటకా చెప్పుకుపోతున్న రాఘవయ్య మాటల ప్రవాహానికి అడ్డుపడుతూ..
అనాధాశ్రమం అనే మాట వినగానే, 'ఇంతకీ, ఈయన మీకు ఏమవుతారు సార్‌?' అంటూ అనుమానంగా ప్రశ్నించాడు శంకరం పుస్తకంలో నుంచి తలెత్తకుండానే.
'అది ఎవరో కాదు..! నేనే' అంటూ జవాబు ఇచ్చాడు రాఘవయ్య.
ఆ జవాబుకు అదిరిపడ్డ శంకరం, 'మీరా? మీకు మీరే కైలాసయాత్రకు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవటం ఏమిటి సార్‌?' అంటూ రాఘవయ్య వంక అనుమానంగా చూశాడు.
ఆ చూపులు చూస్తుంటే రాఘవయ్యకు ఏమన్నా పిచ్చి పట్టిందా అన్నట్లు ఉన్నాయి.
'ఏం? నా చావుకి నేను ఏర్పాట్లు చేసుకోకూడదా? రైలు ప్రయాణంలో ఎవరి టిక్కెట్టు వాళ్లే కొనుక్కుంటున్నప్పుడు, మన చివరి ప్రయాణానికి మనమే ఏర్పాటు చేసుకోవటంలో తప్పులేదు కదా' మళ్లీ ప్రశ్నించాడు రాఘవయ్య.
శంకరానికి ఏం జవాబు చెప్పాలో అర్థంకాక మాటలు రాని సజీవ శిలలా మారిపోయాడు.

                                                                         ***

'ఎంత చెప్పినా వినకుండా, చివరిచూపు కూడా చూడనివ్వకుండా అత్తయ్య గారి శవాన్ని హాస్పిటల్‌ నుండి నేరుగా స్మశానానికి తీసుకెళ్లి, అంత్యక్రియలు పూర్తి చేసుకొచ్చారు మీ అన్నదమ్ములిద్దరూ, కనీసం ఆవిడ గారు పోయిందని న్యూస్‌ పేపర్లో ప్రకటనన్నా ఇవ్వండి మన బంధువులందరికీ తెలుస్తుంది' నిష్టూరంగా అంది వసుంధర.
వసుంధర రాఘవయ్య పెద్దకొడుకు ఆనంద్‌ భార్య. రాఘవయ్య భార్య అనసూయ గత కొంతకాలంగా అంతు తెలియని రోగంతో హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతూ మరణించడంతో, కొడుకులిద్దరూ ఆమె శవాన్ని ఇంటికి కూడా తీసుకురాకుండా నేరుగా స్మశానానికి తీసుకెళ్లి చివరాఖరి కార్యక్రమాలన్నీ ముగించుకొచ్చారు.
అదేమని రాఘవయ్య నిలదీస్తే, ఆమెకు కరోనా సోకిందని డాక్టర్లు చెప్పటంతో ఆ పని చేయాల్సి వచ్చిందని తండ్రికి అబద్ధం చెప్పారు.
అసలే భార్య పోయిన దుఃఖంతో ఉన్న రాఘవయ్య, వాళ్లిచ్చిన సమాధానంతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా మిగిలిపోయాడు.
'నీకేం అక్కయ్యా నువ్వు ఎన్నైనా చెబుతావు, సంపాదించే వాళ్లకే కదా తెలిసేది ఆ కష్టం ఏదో, ఇప్పుడు వేలకు వేలు పోసి ప్రకటనలు ఇవ్వటానికి ఆవిడ ఏమైనా ఊళ్లు ఏలేరా? లేక ఉద్యోగాలు వెలగబెట్టారా?' చిన్న కోడలు అపర్ణ తన తోడికోడలి ఆలోచనలు తప్పు అన్నట్టు సన్నాయి నొక్కులు నొక్కింది.
'అవును వదినా! అపర్ణ చెప్పింది నిజమే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, డబ్బులు దండగ తప్ప, ఆవిడ హాస్పిటల్‌ ఖర్చులే ఏడు ఎనిమిది లక్షలు అయ్యాయని తెలుసు కదా?' అంటూ భార్యకు వత్తాసు పలికాడు రాఘవయ్య చిన్న కొడుకు సంతోష్‌.
'హాస్పిటల్‌ ఖర్చు మొత్తం, మావయ్య గారే తన పెన్షన్‌ డబ్బు నుంచి తీసిచ్చారు కదా! అదేదో మీ జేబుల్లోంచి ఖర్చుపెట్టినట్టు బాధపడిపోతున్నారు' అంటూ చిరు కోపం ప్రదర్శించింది వసుంధర.
'నాన్నగారు డబ్బు అయితే మాత్రం ఏమిటి? అదీ మాదే కదా? ఉంది కదా అని ఖర్చు పెట్టుకుంటూపోతే కొండలు కూడా కరిగిపోతాయి వసుంధరా?' అంటూ భార్యను సున్నితంగా మందలించాడు ఆనంద్‌.
'పోనీ కనీసం మీ అమ్మగారి పెద్ద దినం అన్నా చేసేది ఉందా? లేదా?' అంటూ భర్తను నిలదీసింది వసుంధర.
'ఇప్పుడు పెద్ద దినం అంటే రెండు మూడు లక్షలైనా ఖర్చవుతుంది. ఆ ఖర్చంతా ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారు?' సమాధానం చెప్పమన్నట్లు భార్య వంక చూశాడు ఆనంద్‌.
'అవును వదినా, నాన్నగారు దాచుకున్న పెన్షన్‌ డబ్బులు మొత్తం హాస్పిటల్‌ ఖర్చులకే అయిపోయాయి. ఇప్పుడు అంత ఖర్చు ఎవరు భరిస్తారు?' అన్నకు వత్తాసు పలికాడు సంతోష్‌.
'ఎవరో ఎందుకు పెట్టుకుంటారయ్యా ఖర్చులు? కొడుకులు మీరిద్దరూ ఉన్నారుగా, మీరే పెట్టుకోవాలి? మీ అమ్మగారు బతికుండగానే, ఆవిడకి సంబంధించిన ఆస్తులు, నగలు అన్నీ చెరిసగం పంచుకున్నారు కదా?' నిష్కర్షగా జవాబిచ్చింది వసుంధర.
'మీ దగ్గర ఉంటే ఆ ఖర్చేదో మీరే పెట్టుకోండి అక్కయ్యా. మా దగ్గర మాత్రం చిల్లిగవ్వ లేదు. మొన్ననే కదా ఇల్లు కట్టుకున్నాం!' మొగుడెక్కడ మాట జారుతాడో అన్నట్లు ముందుగానే మొగుడి నోటికి కళ్లెం వేసింది అపర్ణ.
'మా దగ్గర మాత్రం ఎక్కడున్నాయిరా డబ్బులు? కిందటి ఏడాదే కదా మా పెద్దమ్మాయి పెళ్లి చేసింది' తనూ చేతులెత్తేశాడు ఆనంద్‌.
'మరి ఎందుకు వదినా మనెవ్వరి దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ అనవసరపు ఖర్చులు' వసుంధరకు నచ్చజెప్పబోయాడు సంతోష్‌.
'కనీసం పెద్ద దినానికి నలుగురికి భోజనాలు పెట్టకపోతే మన నోట్లో ఊస్తారయ్యా ఊర్లో వాళ్లంతా' జరగబోయేది ఊహించుకుని బాధపడుతూ అన్నది వసుంధర.
'అసలు మన ఊర్లో ఉంటేనే కదా వదినా?' అసలు విషయం బయటపెట్టాడు సంతోష్‌.
'అంటే?..' అర్థం కానట్లు మొఖం పెట్టి అడిగింది వసుంధర.
'ఏముంది అక్కయ్యా, ఆఫీసుకు సెలవలు లేవని చెప్పి, ఇక్కడ నుంచి ఉడాయించేస్తాం, ఆ తిప్పలేవో మావయ్య గారే పడతారు' మొగుడి ఆలోచనలలో అంతరార్థం విడమర్చి చెప్పింది అపర్ణ.
'వీళ్లు చెప్పిందే కరెక్ట్‌ వసుంధరా. నువ్వు మరో ఆలోచన పెట్టుకోకు, మన దగ్గర మాత్రం డబ్బులు ఏమాత్రం ఉన్నాయో నీకు తెలుసు కదా?' భార్యను మెల్లగా అనునయించాడు ఆనంద్‌.
చేస్తోంది తప్పని తెలిసినా, ఏమీ చేయలేని తన ఆసక్తతకు బాధపడుతూ, 'మీరు ఎన్నైనా చెప్పండి, మనం చేస్తోంది మాత్రం క్షమించరాని నేరం, ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే ఆయన మనల్ని అసహ్యించుకోరా' అంటూ కళ్ల నీళ్లు పెట్టుకుంది వసుంధర.
'నాన్నగారికి ఎలా తెలుస్తుంది వదినా, మనలో ఎవరో ఒకరు చెబితే కదా?' ధీమాగా పలికాడు సంతోష్‌.
'అవునవును..' అంటూ తమ్ముడిని సమర్థించాడు ఆనంద్‌.
కానీ ఆ నలుగురికీ తెలియని విషయం ఏమిటంటే, వాళ్ల సంభాషణ మొత్తం తలుపు పక్క నిలబడి రాఘవయ్య వింటున్నాడని.

                                                                        ***

'ఇప్పుడు చెప్పు నా అంత్యక్రియలకు నేనే ఏర్పాట్లు చేసుకోవడం తప్పా?' అంటూ శంకరం వంక చూశాడు రాఘవయ్య.
రాఘవయ్య కథంతా విన్న శంకరం, 'మిమ్మల్ని అనాధ ఆశ్రమంలో విడిచిపోవటానికి మీ పిల్లలకు మనసు ఎలా ఒప్పుకుంది?' అంటూ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు.
'వాళ్లు నన్ను విడిచిపోలేదు, నేనే వాళ్లని విడిచి వచ్చేసి అనాధాశ్రమంలో చేరాను. కట్టుకున్న దానికి కనీసం అంతిమ సంస్కారాలు కూడా చేయలేకపోయిన నా అసమర్ధత మీద నాకే అసహ్యం వేసి..' చెబుతున్న వాడల్లా తలదించుకుని ఏడవసాగాడు.
'ఊరుకోండి సార్‌, ఏడవకండి, ఇందులో మీ తప్పేముంది? మీ పిల్లలు కదా ఇదంతా చేసింది' అంటూ ఓదార్చబోయాడు శంకరం.
'వాళ్లలా తయారవ్వడానికి నా అసమర్ధతే కారణమేమో, రత్నాల్లాంటి ఇద్దరు బిడ్డలని కన్నానని మురిసిపోయాను గాని, ఇంత దుర్మార్గంగా వాళ్లు వ్యవహరిస్తారని ఊహించలేకపోయాను' ఏడుపు ఆపకుండానే బాధపడసాగాడు రాఘవయ్య.
'మనం బిడ్డలని కనగలం గాని, వాళ్ల బుద్ధుల్ని కనలేం కదా సార్‌' ఊరుకోండి అంటూ రాఘవయ్య కళ్లు తుడిచాడు శంకరం.
'నా భార్యకు వాళ్లు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా, నా ఆస్తి వాళ్లకు దక్కకుండా, ఆస్తి మొత్తాన్ని అనాధాశ్రమానికి రాసేశాను. నాలాగే అక్కడ బాధపడుతున్న వాళ్లకు అండగా నిలబడుతున్నా' కళ్లు తుడుచుకుంటూ చెప్పాడు రాఘవయ్య.
'ఇంత మంచిపని చేసిన మీరు అసమర్ధులు ఎలా అవుతారు సార్‌? సమాజానికి మార్గదర్శకులు అవుతారు కానీ' రాఘవయ్య వంక ఆరాధన భావంతో చూశాడు శంకరం.
'నేనే కాదు, కన్నబిడ్డల ఆదరణ కోల్పోయిన నాలాంటి వాళ్లు ఎవరూ నా భార్య శవంలాగా, ఏ సంస్కారం జరుగకుండా మహాప్రస్థానానికి తరలిపోకూడదు. అందుకే మీకు అడ్వాన్స్‌ చెల్లించాను, నేను బతికున్నంత వరకూ ఈ మహాప్రస్థానంలో ఏ తల్లి, తండ్రి అనాధ శవాలలా ఆవిరైపోకూడదు. మీరు వాటికి జరిపించాల్సిన కార్యక్రమాలన్నీ పద్ధతిగా జరిపించండి, నెలనెలా మీకు అడ్వాన్స్‌ చెల్లిస్తాను' తను వచ్చిన పని పూర్తయినట్లు పైకి లేచాడు రాఘవయ్య.
'సార్‌ మీ ఫోన్‌ నెంబర్‌ కాస్త ఇస్తారా?' అడిగాడు శంకరం.
దేనికన్నట్లు అనుమానంగా చూశాడు రాఘవయ్య.
శంకరానికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక నీళ్లు నమలసాగాడు.
శంకరం అంతరంగం అర్థమైనవాడిలా, 'ఈ దీపం అంత తొందరగా ఆరిపోదులే శంకరం' అంటూ మహాప్రస్థానం గేటు వైపుకు అడుగులేశాడు రాఘవయ్య.
రాఘవయ్య వెళుతున్న వైపే చూస్తూ 'నిజంగానే మీలాంటి దీపాలు, ఎన్నటికీ ఆరిపోకూడదు సార్‌' అని మనసులో అనుకున్నాడు శంకరం.

ఈదర శ్రీనివాసరెడ్డి
78931 11985