Mar 28,2023 07:36

        పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష, వెనువెంటనే ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు.. కేంద్ర బిజెపి ముందే రాసి పెట్టుకున్న స్క్రిప్టుగా దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్ధులపై పథకం ప్రకారం ఇ.డి, సిబిఐ, ఎన్‌ఐఎ, ఐటి, ఇత్యాది వ్యవస్థలను ఉసిగొల్పి ఇబ్బందులు పెట్టడం మోడీ ప్రభుత్వానికి నిత్యకృత్యమైంది. ఆ పరంపరలో భాగమే రాహుల్‌ గాంధీ కేసు. నాలుగేళ్లనాడు 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీనుద్దేశించి రాహుల్‌ చేసిన రాజకీయ వ్యాఖ్యలు గుజరాత్‌ లోని కోట్లాది మంది ఒబిసి కులస్తులందరి పరువుకు నష్టం కలిగించిందన్నది అభియోగం. కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ విమర్శ చేస్తే గుజరాత్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఎ పూర్ణేశ్‌ మోడీ సూరత్‌ చీఫ్‌ జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పరువు నష్టం (క్రిమినల్‌) కేసు వేశారు. విచారించిన కోర్టు గురువారం రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బెయిల్‌ మంజూరు చేసి పైకోర్టులో అప్పీల్‌ చేసుకోవడానికి నెల గడువిచ్చింది. సూరత్‌ కోర్టు తీర్పు వెలువడిన ఇరవైనాలుగ్గంటల్లోపే రాజ్యాంగంలోని అధికరణలు, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలు ఉటంకిస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌, రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఒకదాని వెంట మరో సన్నివేశం ఆవిష్కృతమైన తీరు బిజెపి పక్కా స్కెచ్‌ను తెలుపుతూనే ఉంది.
        బిజెపి జమానాలో బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన కరడుగట్టిన ఆర్థిక నేరస్థులైన లలిత్‌ మోడీ, నీరవ్‌ మోడీ వంటి వారి పేర్లను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం రాజకీయ విమర్శ అవుతుంది తప్ప ఒక నిర్దిష్ట కులానికి, ఇంటి పేరు కలిగిన వారికి మాత్రమే వర్తించదు. కానీ సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు విధించింది. ఐపిసి సెక్షన్‌ 499 కింద రెండేళ్ల జైలు పడటం ఇదే తొలిసారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సూరత్‌ మెజిస్ట్రేట్‌ నియామకం, హడావుడిగా సెలవుల్లేకుండా కేసు విచారణ, రెండేళ్ల జైలు శిక్ష విధింపు అసాధారణం. ఈ ప్రహసనాన్ని బట్టే రాజకీయ ప్రేరేపితం అనే భావన కలుగుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం (1951)లోని క్లాజ్‌ 8 ప్రకారం ఏదైనా కేసులో దోషిగా నిర్ధారణై రెండేళ్లకు తగ్గకుండా శిక్ష పడితే అటువంటి వ్యక్తి రాజ్యాంగ పదవులకు అనర్హుడవుతాడు. ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుండదు. శిక్షా కాలమంతా ఎన్నికలకు దూరంగా ఉండాలి. వయనాడ్‌ ఎంపిగా ఉన్న రాహుల్‌గాంధీ భవిష్యత్తులో ఎనిమిదేళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాలి. ఈ పూర్వరంగంలో రాహుల్‌ను రాజకీయంగా సమాధి చేసేందుకు బిజెపి రచించిన పథకమని అర్థమవుతుంది. గతంలోనూ రాహుల్‌ గాంధీని నిలువరించడానికి బిజెపి ప్రయత్నించింది. 'దేశ్‌కా చౌకీదార్‌ చోర్‌ హై' అన్న వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు దాకా వెళ్లి క్షమాపణలు చెప్పించింది. అప్పటి కేసును సూరత్‌ కోర్టు ప్రస్తావిస్తూ రాహుల్‌ ప్రవర్తనలో మార్పు రానందున రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నామన్న భాష్యం విస్తుగొల్పుతుంది.
         లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ధోరణి మరీ అభ్యంతరకరం. కోర్టు తీర్పు వచ్చిందో లేదో ఆగమేఘాలపై రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి పడేశారు. నేర స్వభావాన్ని పరిశీలించలేదు. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోలేదు. ఇవేమీ ఆలోచించలేదంటే ఆ వ్యవస్థపై మోడీ ప్రభుత్వ ఒత్తిడి ఉంది. వ్యవస్థలను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో మోడీ ప్రభుత్వానిది అందె వేసిన చెయ్యి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే పార్టీలను నిరంకుశంగా అణచివేయడం బిజెపికి రివాజైపోయింది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను మోడీ ప్రభుత్వం హరిస్తోంది. పార్లమెంట్‌ను ప్రభుత్వమే అడ్డుకోవడం బిజెపి ప్రజాస్వామ్య హననానికి పరాకాష్ట. అదానీ కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించే పన్నాగం. ఆర్థిక నేరగాడు అదానీతో బిజెపి సంబంధాన్ని పార్లమెంట్‌లో ఎలుగెత్తడం గిట్టకే రాహుల్‌పై అనర్హత వేశారు. ప్రతిపక్షాలను లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం. ప్రజాస్వామ్య పరిక్షణ కోసం అన్ని పార్టీలూ ఉద్యమించాలి.