గడిచిన రెండు రోజులుగా ఆనంద్ ఆఫీసుకు రావడం లేదు.
ఫోన్ చేస్తూంటే స్విచ్చాఫ్ అని వస్తోంది. పోనీ ఇంటికి వెడదామంటే అంత దూరం వెళ్ళడానికి సమయం చిక్కడం లేదు.
కారణం లేకుండా ఏ పనీ చేయడు. రెండు రోజులు మానేశాడంటే వాడికే కష్టం కలిగిందోనని అనిపించింది.
లంచ్ టైం పూర్తయిపోవడంతో తిరిగి ఆఫీసు పనిలో పడ్డాను.
సాయంత్రం బాస్ కేబిన్‌లోకి వెళ్ళాను. బాస్‌కు ఫైల్ ఇస్తూ, 'సార్! ఆనంద్ ఆఫీసుకు రాకపోవడానికి కారణం?' అడిగాను.
'లీవ్ అప్లరు చేయడానికైనా బాస్‌కు కారణం చెబుతాడన్న ఆలోచనతో.
'కుమార్! అతనింట్లో చావు వచ్చిందట. మొన్న నాకు ఫోన్ చేసి బాధలో ఉన్నాను. లీవ్ కావాలన్నాడు. నేను సరే అన్నాను! ఎన్ని రోజులో చెప్పలేదు. బాధలో ఉన్నాడని నేనూ వివరంగా అడగలేదు.' అని చెప్పుకొచ్చాడు బాస్.
'పరామర్శకు వెడితే తెలుస్తుంది కదా సార్!' బాస్‌తో అన్నాను. విషయం, వివరం తెలుసుకోవాలన్న ఆతృతతో.
'నిజమే! కుమార్, కానీ ఎవరినీ ఇంటికి రావద్దని చెప్పాడు. అలా వస్తే తన బాధ పెరుగుతుందని కూడా అన్నాడు. ఇక ఆ మాటతో నేనూ ఊరుకున్నాను. ఎందుకంటే అతను కాదన్నది చేస్తే ఎక్కువ ఫీలైపోతాడు. ఏమంటావ్?' తన సీటులోంచి లేస్తూ నన్నడిగాడు బాస్.
'నిజమే సార్!' బాస్ మాటకు వంత పాడి, బయటకు వచ్చాను.
ఆనంద్ ఇల్లు బాగా దూరమైనప్పటికీ వాడింటికి గతంలో రెండు, మూడుసార్లు వెళ్ళాను. వాడింట్లో ఉండేది ముగ్గురే. ఆనంద్ భార్య సుశీల, తల్లి లక్ష్మి. ఆమె వయసు దాదాపు ఎనభై ఏళ్ళుంటాయి. అయినా ఏ జబ్బూ లేదు. కళ్ళజోడు కూడా లేకుండా పేపర్ చదవగలదు. ఆవిడ పనులన్నీ స్వయంగా చేసుకోగలదు. అతని భార్య కూడా పూర్తి ఆరోగ్యవంతురాలే. అన్ని పనులూ చేస్తుందని, నా చేత ఏ పనీ చేయించదని, సార్ధక నామ ధేయురాలని! ఆనంద్ ఎన్నోసార్లు నాతో అన్నాడు.
మరి వాడింట్లో చావు అంటే? తల పట్టుకున్నాను. ఏమో? బహుశా , వయసు రీత్యా ఆనంద్ తల్లి కాలం చేసి ఉంటారు. జన్మనిచ్చిన అమ్మ చనిపోతే బాధ తట్టుకోవడం కష్టమే. ఈ సమయంలో వాడికి ఓదార్పు అవసరం. బయట వాళ్ళను పరామర్శకు రావద్దన్నాడేమో.
'ఫ్రెండ్‌ని , వాడింటికి వెళ్ళడానికి పర్మిషన్ దేనికి?' మనసులో అనుకున్నాను.
మరునాడు ఆదివారం కలిసొచ్చింది. ఆలస్యం చేయకుండా ఉదయమే ఆనంద్ ఇంటికి బయలుదేరాను.
కొత్తగా కట్టిన కే.బి.సి. అపార్ట్మెంట్స్ అవి.
గ్రౌండ్ ఫ్లోర్‌లో బైక్ పార్క్ చేసి, ఆనంద్ ఉండే థర్డ్ ఫ్లోర్‌కు లిఫ్ట్‌లో వెళ్ళాను.
తలుపులు మూసే ఉండడంతో కాలింగ్ బెల్ నొక్కాను.
సుశీలమ్మ వచ్చి, తలుపు తీసింది.
నన్ను చూడగానే 'ఏం! అన్నయ్యా? ఎలా ఉన్నారు. అందరూ క్షేమమే కదా!' అంటూ పలకరించింది.
'అంతా బావున్నారు చెల్లమ్మా!' అంటూ షూస్ విప్పుకుంటున్నాను.
బయట నా పక్కనే ఉన్న పూలకుండీలో ఉన్న గులాబీ పువ్వుకు నా చేయి అనుకోకుండా తగిలింది.
'అన్నయ్యా! పువ్వు పడిపోతే ఆయన తట్టుకోలేరు. సహజంగా సాయంత్రానికి వాడిపోవాలంతే!'
చెల్లమ్మ అలా అనేసరికి పువ్వును మళ్ళీ తగలకుండా జాగ్రత్తగా లోపలకు అడుగుపెట్టాను.
'బావున్నావా కుమార్?' తులసిమాల కడుతూ, ఆనంద్ అమ్మగారు అడిగారు.
'హమ్మయ్య! అమ్మ క్షేమమే' అని మనసులో అనుకుంటూ ,
'బావున్నాను .పెద్దమ్మా!' నవ్వుతూ బదులిచ్చి 'ఆనంద్ ఎక్కడీ' అడిగాను.
'లోపల మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్నాడు. కొంచెం వాడికి సర్దిచెప్పు కుమార్!' పెద్దమ్మ అంది.
ఆనంద్ ఉన్న గదిని చూపిస్తూ.
'అందుకే వచ్చాను, పెద్దమ్మా!' అంటూ గదిలోకి వెళ్ళాను.
లోతుకు పోయిన కళ్ళు, పీక్కుపోయిన మొహం, మాసిన గెడ్డం, చెదిరి పోయిన జుట్టుతో ఉన్న ఆనంద్‌ను చూడగానే ఆశ్చర్యపోయాను.
'ఆనంద్! ఇలా అయిపోయావే? ఎవరు చనిపోయారు? దూరపు బంధువులా? ఎంత బాధపడినా పోయిన వారు తిరిగిరారు. అది సత్యమని తెలిసి కూడా ఇలా ఎన్ని రోజులు?' కొంచెం ఓదార్పుగా అంటూ వాడి పక్కన కూర్చున్నాను.
'బాధకు సమయంతో పనిలేదు, కుమార్!' అన్నాడు వాడు.
'ఇంతకీ చనిపోయింది ఎవరు?' మళ్ళీ అడిగాను.
'టామీ!' ఠక్కున చెప్పాడు.
'టామీ అంటే కుక్కా?' కన్ఫార్మ్ చేసుకోవడానికి అన్నట్టుగా అడిగాను.
'అవును!' అన్నాడు.
నేను వెంటనే కొంచెం వెక్కిరింపుగా నవ్వుతూ..
'ఇంట్లో సబ్బు అయిపోయిందని, చొక్కా చిరిగిపోయిందని, కుండీలో మొక్కకు పూసిన పువ్వు రాలిపోయిందని కుమిలిపోయి ఈ మధ్య ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారని మొన్న పేపర్లో చదివి ఆశ్చర్యపోయాను! ఇప్పుడు నిన్ను చూసి నమ్మాల్సి వస్తోంది !' వాడి భుజం తడుతూ అన్నాను.
వాడు వెంటనే నాకేసి సీరియస్‌గా చూస్తూ, 'ఇలా వెక్కిరిస్తారనే బాస్‌తో పరామర్శలు వద్దని చెప్పాను. ఏ కుక్క మాత్రం జీవి కాదా? మూగదైనంత మాత్రాన మూలన పడేస్తామా? మొన్నటివరకూ ఈ ఇంట్లో మాతో తిరిగింది. పెట్టింది తింది. విశ్వాసంగా ఉంది. అసూయను జయించలేని మనిషి పోతే ఏడుస్తున్నాం. అభం శుభం తెలియని కుక్క పోతే తేలిగ్గా తీసుకుంటున్నాం. ప్రేమాభిమానాలు మనుష్యుల మధ్యనే ఉండాలా? మూగజీవులు, మనిషికి పనిచేయడానికేనా? ఇంకేమీ కావా?' వాడు ఆవేశంగా అడిగిన ప్రశ్నలకు నేను అప్రతిభుడినై చూశాను.
గుమ్మం దగ్గర చెల్లెమ్మ 'కుండీలో పువ్వును తగలకు అన్నయ్యా!' అని ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమైంది.
కొంతసేపటికి 'కుమార్, ఆవేశంగా మాట్లాడానని ఏమీ అనుకోకు. నేను ఊరెడితే ఇంటి గుమ్మం మీదే ఉండేది. నేను రాగానే తోక ఊపుకుంటూ ఒడిలో వాలిపోయేది. నేను పెడితేనే తినేది. పేరుకు బంటు అయినా ఇంటిలో వ్యక్తిలా కలిసిపోయింది. అభిమానంతో చూసేది. అన్నివేళల్లో ఇంటిని కనిపెట్టుకుని ఉంది. ప్రేమ మూగజీవులకు ఉంటుంది. కానీ అది స్వార్థంతో ఉండదు. అందుకే వాటి భాష, మాట్లాడటం తెలిసిన మనిషికి అర్థం కావడం లేదు! అది అర్థమైంది కాబట్టే బాధ పడుతున్నాను!' అన్నాడు.
'సారీ ఆనంద్!' అన్నాను.
'పర్వాలేదు!' అన్నాడు.
'ఎప్పుడొస్తావ్ ఆఫీసుకు?' అడిగాను.
'త్వరలోనే!' జవాబిచ్చాడు.
'వెళ్ళొస్తాను!' అంటూ లేచాను.
'ఓకే !' అన్నాడు.
నేను లేచి నేరుగా బయటకు వచ్చాను.
బైక్ స్టార్ట్ చేసి, నా ఇంటివైపు కాకుండా, వృద్ధాశ్రమం వైపు పోనిచ్చాను.
అరగంట క్రితం ఆనంద్ నాతో అన్న మాటలు గుర్తొచ్చాయి.
'కుక్క పోయిందని, నేను ఏడుస్తున్నానని నువ్వు నవ్వావు.
అయితే బతికుండీ కూడా అమ్మను బాధ్యతగా చూడకుండా వృద్ధాశ్రమంలో చేర్చిన నిన్ను చూసి నేనెంతగా నవ్వాలి? కుక్క విశ్వాసానికి మరో రూపం. అమ్మ, ప్రేమకు ప్రతి రూపం. అమ్మని, అవనిని కాదనుకుని మనగలమా? మనుగడ సాగించగలమా?' అన్న వాడి మాటలు నా తప్పును తెలియజేశాయి. అమ్మ వైపు నా అడుగులు పడేలా చేశాయి.
కె.వి.లక్ష్మణరావు
9014659041