రామాపురం అనే ఊరిలో రంగా అనే యువకుడు తన తల్లిదండ్రులతో నివసించేవాడు. ఆ గ్రామం అంతా ప్రశాంతంగా పాడిపంటలతో పచ్చగా ఉండేది. ఒకరోజు ఆ ఊరికి ఒక మాంత్రికుడు వచ్చాడు. అందరి ఇంటికీ వెళ్లి డబ్బులు ఇవ్వకపోతే మీకు అది చేస్తాను లేక ఇది చేస్తాను అని భయపెట్టేవాడు. అందరి ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకున్నాడు.
ఆ గ్రామంలో ఒక్క ఇల్లు మాత్రం మిగిలింది. అది ఎవరిదో కాదు పిల్లికి కూడా బిచ్చం పెట్టని కోటయ్య ఇల్లు.
మాంత్రికుడు పిసినారి కోటయ్య ఇంటికి వెళ్ళాడు. కానీ కోటయ్య డబ్బులు ఇవ్వలేదు.
మాంత్రికుడికి కోపం వచ్చింది. డబ్బులు ఇస్తావా లేక నీ జుట్టు అంతా ఊడిపోయేలాగా మంత్రం పెడతాను అన్నాడు.
కానీ కోటయ్య 'నా నెత్తిన ముందే జుట్టు లేదు.. నాది బట్టతల. నువ్వు ఊడిపోయేలా మంత్రం వేసేదేంటి?' అన్నాడు.
'నువ్వు లావుగా ఉన్నావు. నిన్ను పేపర్ అంత పల్చగా చేస్తాను. అప్పుడు నువ్వు గాలికి కొట్టుకొనిపోతావు' అన్నాడు మాంత్రికుడు.
కోటయ్య 'హ్హహ్హహ్హ' అని నవ్వుతూ.. 'ఏంటి నన్ను సన్నగా చేస్తావా చెయ్యి నేను లావుగా ఉంటే కూర్చుంటే లేవలేక పోతున్నా లేస్తే కూర్చోలేకపోతున్నా!' అన్నాడు కోటయ్య. అప్పుడు మాంత్రికుడికి మళ్లీ కోపం వచ్చింది.
కోటయ్యను పేపర్ అంత పల్చగా చేశాడు.
అదే రోజు గాలి వాన వచ్చింది. తెలివైన కోటయ్య ఇంట్లోకి వెళ్లి తలుపులు కిటికీలు వేసుకున్నాడు.
అప్పుడే కోటయ్య భార్య రమా పుట్టింటి నుంచి వచ్చింది. తలుపు తట్టింది. కోటయ్య తలుపు తీశాడు. గాలికి కొట్టుకుపోయాడు. గాలి వాన తగ్గినాక సర్పంచ్ దగ్గరకి వెళ్లి, జరిగిందంతా చెప్పింది రమ.
అప్పుడు సర్పంచ్ రమతో 'ఆ మాంత్రికుడు మా ఇంటికి కూడా వచ్చాడు. నేను డబ్బులు ఇవ్వలేదు. సన్నగా ఉన్న నన్ను లావుగా చేశాడు ఆ దరిద్రపు మాంత్రికుడు!' అంటూ సర్పంచ్ కూడా రమతో కలిసి ఏడ్చాడు.
........
ఆ ఇదంతా రంగాకి వచ్చిన కల. నిద్రలో లావుపాటి సర్పంచిని చూసి పెద్దగా నవ్వాడు.
ఆ నవ్వుకి రంగ వాళ్ళ అమ్మ ఉలిక్కిపడి లేచింది. రంగాని నిద్రలేపింది 'ఎందుకు నిద్రలో నవ్వుతున్నావు?' అనడిగింది.
అప్పుడు రంగా వాళ్ళ అమ్మకి తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. రంగా వాళ్ళ అమ్మ కూడా కూడా పకపకా నవ్వేసింది.
- చింత గుంట్ల గీతిక
8వ తరగతి
ప్రీ హైస్కూల్, జాళ్ళ పాలెం,
కొండెపి, ప్రకాశం జిల్లా