- కాకినాడ సిటీ ఎమ్మెల్యే అవినీతిలో సిద్ధహస్తులు
- కాకినాడ టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పావని
ప్రజాశక్తి కాకినాడ : రాష్ట్రంలో సీఎం జగన్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అతన్ని త్వరలోనే ఇంటికి పంపించే రోజులు ఉన్నాయని అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే అవినీతి చేయడంలో సిద్ధస్తుడయ్యాడంటూ కాకినాడ టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుంకర పావని పేర్కొన్నారు. రానున్న ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో తమ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలందరికీ సుపరిపాలన అందుతుందని ఆమె చెప్పారు. గురువారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో పావని విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబును జైల్లో పెట్టారని వైసిపి శ్రేణులు శునకానందం పొందుతున్నారన్నారు. కాకినాడ నగరంలో ఎమ్మెల్యే అవినీతిలో బాగా ఆరితేరిపోయారని అతనిని కూడా ఇంటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే తమ పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరిపైన అసెంబ్లీలోనూ, కాకినాడ సభలో పవన్‌ను వ్యక్తిగతంగాను విమర్శించారని చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సభ్య సమాజం సిగ్గుపడేలా వాళ్ల వ్యాఖ్యలు, వ్యవహార శైలి ఉంటుందన్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేని స్థితిలో సీఎం జగన్, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. భువనేశ్వరిపై రోజా అనవసర వ్యాఖ్యలు చేసినా సీఎం జగన్ అదుపులో పెట్టుకోకపోవడం ఆయన వైఫల్యమేనన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి లేని స్థితికి సీఎం జగన్ తీసుకొచ్చారన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టారని ఆయన న్యాయ వ్యవస్థపై న్యాయ పోరాటం చేసి ఏ అవినీతికి పాల్పడకుండా బయటకు వస్తారని చెప్పారు. జగన్ తిరిగి జైలుకెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్రం నుంచి వైసీపీని వదిలించుకుంటే రానున్న కాలంలో రాష్ట్ర భవిష్యత్తు ఎంతో బాగుంటుందని పావని చెప్పారు. 12 వేల రూపాయలు జీతం తీసుకుని చాలీచాలని ఆదాయంతో బతుకుతుంటే వారికి ప్రభుత్వ పథకాలు రద్దు చేయడం పట్ల పావని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే గెలిచిన మూడేళ్లకే అతని అవినీతి పెచ్చు మీరడంతో నగర ప్రజలు ఎప్పుడు వదిలించుకుందామని ఎదురుచూస్తున్నారన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే వచ్చి అతను హడావుడి చేస్తారని చెప్పారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వల్ల అవినీతి, అక్రమాలు నగరంలో బాగా పెరిగిపోయాయి పావని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ మహిళా నేతలు చల్లా పార్వతి, గండేపల్లి దేవి, పాలిక సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.










