Jan 15,2023 07:42

జగదీప్‌ ధన్‌కర్‌ న్యాయవ్యవస్థపై మరో పిడుగు వేశారు. రాష్ట్రాల్లోని చట్టసభల సభాపతుల సమావేశం ప్రారంభోపన్యాసంలో మరోసారి సుప్రీం కోర్టుపై విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి రాజ్యాంగ మౌలిక స్వభావానికి సంబంధించిన కేసు తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడారు. పార్లమెంటు రాజ్యాంగ సవరణలు చేసినా అవి రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధంగా వుంటే చెల్లవని చెప్పిన కేశవానంద భారతి (1973) తీర్పును వ్యతిరేకించారు. కొన్ని రిజర్వేషన్‌ సవరణలను, జ్యుడిషియల్‌ కమిషన్‌ (ఎన్‌ జాక్‌) బిల్లును సుప్రీం కోర్టు ఈ కారణంతోనే కొట్టేసింది. జ్యుడిషియల్‌ కమిషన్‌ సవరణ చట్టం బదులు కేంద్రం నియామకాల కమిషన్‌ చట్టం తెచ్చింది. ఇది విచారణలో వుంది. ఇలాంటి తరుణంలో జగదీప్‌ ధన్‌కర్‌ ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయడం యాదృచ్ఛికం కాదు.

దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం లౌకికతత్వం, సమాఖ్య తత్వం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, స్వతంత్ర న్యాయవ్యవస్థ వంటివి రాజ్యాంగ మౌలిక లక్షణాలు. రాజ్యాంగంలో ఉన్న హక్కులు, స్వేచ్ఛలు విస్తరించడం తప్ప విఘాతం కలిగించకూడదనేది మరో సూత్రం. వీటన్నిటికి అడుగడుగునా దెబ్బతీస్తున్న మోడీ ప్రభుత్వానికి ఈ తీర్పు కంటకంగా వుండటంలో ఆశ్చర్యం లేదు. అయితే ఆ మాటలు రాజ్యాంగ పదవుల్లో వున్న వారి ద్వారా, సభాపతుల ద్వారా చెప్పించడం ఒక వ్యూహం.

త్యున్నత న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ నిరంతరం మాట్లాడే తీరు అత్యంత అభ్యంతరకరంగానూ ఆందోళనకరంగానూ తయారైంది. స్వతహాగా సీనియర్‌ న్యాయవాది అయిన ఆయన ఇవేవీ అమాయకంగానో వ్యక్తిగతంగానో మాట్లాడటం లేదు. దేశంలో రాజ్యాంగం రీత్యా ద్వితీయ స్థాయిలో వున్న ధన్‌కర్‌ రాజకీయ కోణం పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా వుండి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ప్రబల శత్రువుగా వ్యవహరించినప్పుడే స్పష్టమైంది. కాకుంటే మమత కూడా తక్కువ తినలేదు గనక పరస్పర ఘర్షణ కింద నడిచిపోయింది. ఇందుకు మెచ్చిన ప్రధాని తనను ఏకంగా ఉపరాష్ట్రపతిని చేశారు. ఇందుకు తగినట్టే ధన్‌కర్‌ రాజ్యసభ చైర్మన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రసంగంలోనే సుప్రీం కోర్టు తీరుపై ధ్వజమెత్తారు. నేషనల్‌ జ్యుడిషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ (ఎన్‌ జాక్‌) ఏర్పాటు చేస్తూ ఉభయ సభలు చట్టం చేస్తే సుప్రీంకోర్టు ఎలా కొట్టివేస్తుందని...ఆ స్థానంలో జడ్జిలతో కూడిన కొలీజియం న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సులు చేయడం ఏ విధంగా సమంజసమని తీవ్రంగా విమర్శించారు. ఈ విధంగా పార్లమెంటు శాసనాన్ని ఆపేసేట్టయితే ఇది ప్రజాస్వామ్య దేశమెలా అవుతుందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు ముందు, తర్వాత కూడా న్యాయశాఖామంత్రి కిరణ్‌ రిజిజు కొలీజియం వ్యవస్థపై దాడిచేస్తూనే వున్నారు. ఆఖరుకు సుప్రీం కోర్టు చిన్నా చితకా కేసులు, బెయిలు కేసులు విచారణ చేస్తూ సమయం వృథా చేయడం వల్లనే కేసులు పేరుకుపోతున్నాయని ఆరోపించారు. ఇందుకు సమాధానంగా సిజెఐ చంద్రచూడ్‌ మాకు ఏ కేసు ఎక్కువా కాదు, తక్కువా కాదు అని తేల్చిచెప్పారు. ప్రజల ప్రాథమిక హక్కులను, స్వేచ్ఛను కాపాడ్డం కంటే తమకు గొప్ప బాధ్యతలేవీ వుండబోవని స్పష్టం చేశారు. కొలీజియం సిఫార్సులపై ఎడతెగని జాప్యం (సిట్టింగ్‌ ఓవర్‌) సమాచారమైనా ఇవ్వకపోవడం ఏమిటని మరో కేసులో సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కొలీజియం సిఫార్సులు ఆపడమే గాక కేంద్రం తనుగా పదిమందికి పైన పేర్లను జడ్జిల నియామకం కోసం సిఫార్సు చేసిందని వెల్లడించింది. వీటిపై వ్యాఖ్యానానికి నిరాకరించింది. మరోవైపున కేంద్ర న్యాయవాది కొలీజియం పంపిన పేర్లను తప్పక పరిశీలించి సత్వర నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడమే గాక కొంతవరకూ గట్టిగా వ్యవహరించడం వల్లనే ఈ మాత్రం దిగివచ్చారని పరిశీలకులు, న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు.
 

                                                                  రాజ్యాంగ మౌలిక స్వభావం

అయితే ఏదో మెరుగవుతుందనే అంచనాలు వమ్ము చేస్తూ జగదీప్‌ ధన్‌కర్‌ న్యాయవ్యవస్థపై మరో పిడుగు వేశారు. రాష్ట్రాల్లోని చట్టసభల సభాపతుల సమావేశం ప్రారంభోపన్యాసంలో మరోసారి సుప్రీం కోర్టుపై విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి రాజ్యాంగ మౌలిక స్వభావానికి సంబంధించిన కేసు తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడారు. పార్లమెంటు రాజ్యాంగ సవరణలు చేసినా అవి రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధంగా వుంటే చెల్లవని చెప్పిన కేశవానంద భారతి (1973) తీర్పును వ్యతిరేకించారు. కొన్ని రిజర్వేషన్‌ సవరణలను, జ్యుడిషియల్‌ కమిషన్‌ (ఎన్‌ జాక్‌) బిల్లును సుప్రీం కోర్టు ఈ కారణంతోనే కొట్టేసింది. జ్యుడిషియల్‌ కమిషన్‌ సవరణ చట్టం బదులు కేంద్రం నియామకాల కమిషన్‌ చట్టం తెచ్చింది. ఇది విచారణలో వుంది. ఇలాంటి తరుణంలో జగదీప్‌ ధన్‌కర్‌ ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయడం యాదృచ్ఛికం కాదు. దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం లౌకికతత్వం, సమాఖ్య తత్వం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, స్వతంత్ర న్యాయవ్యవస్థ వంటివి రాజ్యాంగ మౌలిక లక్షణాలు. రాజ్యాంగంలో ఉన్న హక్కులు, స్వేచ్ఛలు విస్తరించడం తప్ప విఘాతం కలిగించకూడదనేది మరో సూత్రం. వీటన్నిటికి అడుగడుగునా దెబ్బతీస్తున్న మోడీ ప్రభుత్వానికి ఈ తీర్పు కంటకంగా వుండటంలో ఆశ్చర్యం లేదు. అయితే ఆ మాటలు రాజ్యాంగ పదవుల్లో వున్న వారి ద్వారా, సభాపతుల ద్వారా చెప్పించడం ఒక వ్యూహం.
           చట్టసభలు, కార్యనిర్వాహకవర్గం, న్యాయవ్యవస్థ మూడు అంగాలు. వీటిలో దేనికది స్వతంత్ర ప్రతిపత్తి కలిగివుంటుంది. అదే సమయంలో ఎవరైనా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయవలసి వుంటుంది. 368వ అధికరణం రాజ్యాంగ సవరణ హక్కు పార్లమెంటుకు ఇస్తుంది. కొన్నిటికి రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. కొన్నిటికి పార్లమెంటు ఉభయసభలు చేస్తే చాలు. ఏది ఏమైనా రాజ్యాంగ పరిధిలో సవరణలుండాలి. 1973లో కేశవానంద భారతి తీర్పు వచ్చినా 1975లో రాజ్యాంగం ద్వారానే ఇందిరాగాంధీ ఎమర్జన్సీ విధించారని మర్చిపోరాదు. ఆ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ పేరిట దాన్ని పూర్తిగా మార్చి ఏకపక్ష రాజ్యానికి బాట వేసుకున్నారు. 1977లో దేశ ప్రజలు ఇందిరాగాంధీని ఓడించిన తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం వాటిని మళ్లీ మార్చి ఎమర్జన్సీ విధించే అవకాశాన్ని లేకుండా చేసింది. రాజ్యాంగంలోనే 13వ అధికరణం పౌరుల హక్కులను హరించే సవరణలు చెల్లబోవని చెబుతున్నది. కనుక కేశవానంద భారతి కేసు తీర్పు కన్నా ముందే 13వ అధికరణం కూడా రాజ్యాంగ సవరణపై పరిమితులు విధిస్తున్నది. ఇక స్వతంత్ర న్యాయవ్యవస్థ అనేది కూడా రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ఒకటి. ఎప్పటికప్పుడు సుప్రీం కోర్టు కేంద్ర రాష్ట్రాల చర్యలు రాజ్యంగ బద్దమా కాదా అనే పరిశీలన చేసి తీర్పులిస్తున్నాయి. అయోధ్య రామజన్మభూమి వివాదం వంటి వాటిపై వేగంగా తీర్పులు వచ్చాయి. కొన్ని రకాల రిజర్వేషన్లు, కేంద్రం వేసిన పన్నులు, రాష్ట్రాల హక్కులు, 370 రద్దు, మత మార్పిళ్లు, ఎన్నికల బాండ్లు, నదీజలాలు, శబరిమలై, కార్మిక చట్టాల సవరణ, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, జడ్జిల నియామక వ్యవస్థ తదితర అనేక కీలక కేసులు విచారణలోనే వున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విభజన కేసు తీసుకుంటే రాజ్యాంగ పరంగా రాజధాని నిర్ణయం మార్పు వంటి శాసనాలు చేసే అధికారం రాష్ట్రానిదా కేంద్రానిదా ఏవరికీ లేదా, అదైనా ఎన్నిసార్లయినా మార్చుకుంటూ పోవచ్చా వంటి అంశాలను సుప్రీం కోర్టు తేల్చవలసి వుంటుంది. రాజ్యాంగ మౌలిక స్వభావం వీటికి కొలబద్దగా వుంటుంది. అందువల్ల కేశవానంద భారతి కేసు తీర్పును ఉపరాష్ట్రపతి తప్పు పట్టడం అర్థరహితం, అనుమతించరానిది. కానీ చట్టసభల సదస్సు చివరలో ఆమోదించిన తీర్మానంలోనూ అలాంటి అభిప్రాయం వెలిబుచ్చారు. మూడు వ్యవస్థలు దేని పరిధికి అవి పరిమితం కావాలని చెప్పడం సాంకేతికంగా సరైందే గాని ఆ విధంగానైనా న్యాయపరమైన రాజ్యాంగ పరమైన అంశాలు సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తాయి. తమ తీర్పులు చట్టాలకు ప్రాతిపదికగా వుంటాయని న్యాయస్థానం ప్రకటించింది.
 

                                                                          గతంలోనే స్పష్టత

రాజ్యాంగంలోని 141వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అన్ని కోర్టులకూ ఆఖరుకు దానికి కూడా వర్తిస్తాయి. ఎన్‌జాక్‌ పై కేసు విచారణ సందర్భంగా, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌. ఒకా తో కూడిన ధర్మాసనం ఆ మాటే చెప్పింది. ఆ చట్టం కొట్టివేస్తూ గతంలో ఇచ్చిన కొలీజియం తీర్పు అమలులో వుంటుందనీ, ఒకవేళ దాని స్థానంలో మరో కొత్త శాసనం తెచ్చినా అది కూడా సుప్రీం సమీక్షకు లోబడే వుంటుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ విషయం మీ ప్రభుత్వానికి తెలియజేయండని అటార్నీ జనరల్‌ను ఆదేశించారు. అయితే పార్లమెంటు చేసిన చట్టం కూడా సుప్రీం సమీక్షకు లోబడి వుంటుందనే వాదన సరికాదని, ఒక వ్యవస్థపై మరొకటి పైచేయి అనడం చెల్లదని ఆయన వ్యాఖ్యానించారు. పైగా కేశవానంద భారతి కేసు తీర్పుతో తనకు ఆమోదం లేదన్నారు. రాజ్యాంగం లోని 368వ అధికరణం పార్లమెంటుకు సవరణ హక్కు ఇస్తున్నా అది పరిమితులు లేనిది కాదనీ సుప్రీం సమీక్షకు లోబడే వుంటుందని ఇప్పటివరకూ వున్న అభిప్రాయాన్ని తోసిపుచ్చుతున్నారన్నమాట. ఇది కేవలం పరస్పర తనిఖీ కోసం, నియంత్రణ కోసం చేసుకున్న ఏర్పాటు (చెక్స్‌ అండ్‌ బాలెన్సెస్‌) తప్ప ఒక వ్యవస్థ అధికారాలు లాక్కోవడం కోసం కాదని కూడా కేశవానందభారతి కేసు తీర్పు పేర్కొంటున్నది. దీనివల్ల సుప్రీం కోర్టుదే చివరి మాట అవుతుందనుకోవడానికి ఆధారమేమీ లేదని కూడా స్పష్టం చేసింది. ఇదేదో చట్టసభల అధికారంతో తలపడటానికి గాక, వున్న రాజ్యాంగాధికారాలను సవ్యంగా వినియోగించుకోవడంలో సహకరించుకోవడానికేనని 1952 లోనే సిజెఐ పతంజలి శాస్త్రి స్పష్టత ఇచ్చివున్నారు. 2015లో ఎన్‌జాక్‌పై తీర్పులో సిజెఐ జె.ఎస్‌.ఖేకర్‌ పునరుద్ఘాటించారు. ముందే చెప్పుకున్నట్టు ఎమర్జన్సీలో 42వ రాజ్యాంగ సవరణ దుర్వినియోగాన్ని అందుకే సరిచేయవలసి వచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగ సవరణ అధికారం మౌలిక స్వభావానికి లోబడి వుందో లేదో సమీక్షించవలసిన బాధ్యత అందుకే వస్తుందన్నారు. కనుక న్యాయమూర్తుల నియామక ప్రక్రియను ఇప్పటికే కేంద్రం ఎలా ప్రభావితం చేస్తున్నదో తనకు నచ్చనివారిని తొక్కిపట్టడానికీ, కావాలనుకున్న వారిని రుద్దడానికి నానా వ్యూహాలు అనుసరిస్తున్నదో సుప్రీం కోర్టు సాక్షిగానే వెల్లడైంది. అది చాలక ఇప్పుడు నేరుగా ఉపరాష్ట్రపతి కూడా దాడికి దిగడం దారుణం, అప్రజాస్వామికం. ఇటీవలి కాలంలో జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ రంజన్‌ గొగోరు వంటి వారు నేరుగా ప్రధానిని పొగిడి తరించడం, పదవీ విరమణ తర్వాత కొత్త పదవులు తెచ్చుకోవడం చూస్తున్నాం. సుప్రీంకోర్టు అధికార న్యాయస్థానంగా మారిపోయిందనే విమర్శలూ విన్నాం. దాన్ని కొంతైనా చక్కదిద్దడానికి స్వతంత్రతతో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం మొదలవగానే ఏలిన వారు కన్నెర్ర చేస్తున్నారు. అన్ని ప్రతిపక్షాలు దీన్ని ఖండించడం హర్షణీయం. వివిధ వ్యవస్థల మధ్య సమతుల్యత, రాజ్యాంగ బద్దత వుండాలే గానీ మేము చేసిందే చట్టం అంటే కుదరదు. లౌకికతత్వంపైన, భావప్రకటనా స్వేచ్ఛపైన ప్రాథమిక హక్కులపైనా ఆఖరుకు రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా దాడులు పెరిగిపోతున్న నేటి తరుణంలో ఇది మరీ ముప్పు. వ్యవస్థలకూ వ్యక్తులకూ కూడా సమస్త అధికారాలు రాజ్యాంగం నుంచే వస్తాయి. ఆ స్ఫూర్తికి అనుగుణంగా చట్టాలు వున్నాయా లేదా చూసే బాధ్యత, అధికారం సుప్రీంకోర్టుదే తప్ప రాష్ట్ర మంత్రులు, ప్రధాన మంత్రులది కాదు.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి