Aug 31,2023 06:10

ఆకాశ మైదానంలో
కారు మబ్బుల క్రీడాకారుల
ఉరుకులు పరుగులు లేవు...!
భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిన
నగరంలా నిర్మానుష్యంగా వుంది గగనం..!!

వాతావరణంలో మార్పులు వస్తున్నాయని
ఎదురు చూసిన అన్నదాతలకు
నిట్టూర్పుల మబ్బులే కనిపించాయి..!

ఈ ఖరీఫ్‌లో పంట కాలువలకొచ్చిన
అరకొర నీటితో వరి నాట్లను
రైతులు ఉత్సాహంగా ప్రారంభించారు..!

పగలూ రాత్రీ అన్నదాతలు
నింగి వంక చూస్తున్నారు గాని..
నల్ల మబ్బుల జాడ వారికి దొరకటం లేదు..!

పొరుగు రాష్ట్రాలలో సైతం
భారీ వర్షాలు కురవక పోవటంతో
పలు ప్రాజెక్టులలో జలకన్యలు
ఆనంద నృత్యాలు చేయడం లేదు..!?
అన్ని కాలువలలో జలాలు తగ్గు ముఖం పట్టాయి..!

వరి పొలాల్లోకి నీరు పారుదల లేక
పుడమి తల్లి మట్టి గుండె పగులు బారుతోంది..!
పచ్చ పచ్చని పైరు రంగు మారుతోంది...!!!

నేల తల్లిని నమ్ముకున్న రైతులు కుమిలిపోయె..!
శూన్యంలో మబ్బులు కానరావు
ఎందుకో.. ఈ సారి మేఘాలు అన్నదాతలకు
ముఖం చాటేశాయి .. అవకాశ రాజకీయ నేతల్లా..!?
- జి.సూర్యనారాయణ,
దివిసీమ.