
తెలుగు రాష్ట్రాల పట్ల అందులోనూ ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. విభజనతో అన్ని విధాల నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి బదులుగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రెండు రోజుల్లో చేసిన రెండు ప్రకటనలు రాష్ట్రానికి తీవ్ర హాని కలిగించేవే. రాష్ట్ర ప్రజానీకం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి తీరుతామంటూ సోమవారం పార్లమెంటులో చెప్పిన కేంద్రం 24 గంటలు గడవకముందే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ మరో ప్రకటనను మంగళవారం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు ఈ మేరకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో అసత్యాలను అలవోకగా వల్లె వేశారు. ఎనిమిది సంవత్సరాలుగా పునర్‌వ్యవస్థీకరణ చట్టం లోని హామీల అమలు కోసం ప్రజానీకం పోరాడుతుంటే ఆ చట్టంలోని చాలా హామీలను ఇప్పటికే అమలు చేశామని కేంద్ర మంత్రి చెప్పడం రాష్ట్ర ప్రజలను నిలువునా దగా చేయడమే! ప్రత్యేక హోదాకు తమకు ఎటువంటి సంబంధం లేదని, హోదా గురించి తాము ఎటువంటి సిఫార్సులు చేయలేదని సాక్షాత్తు ఆర్థికసంఘ సభ్యులే నెత్తినోరు కొట్టుకుని చెబుతుంటే అదే ఆర్థికసంఘ సిఫార్సులను సాకుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది. అయినా వైసిపి, టిడిపిలు కనీసం పెదవి విప్పకపోవడం దారుణం. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రకటించిన ప్యాకేజిని పాచిపోయిన లడ్డుగా అభివర్ణించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు మౌనముద్ర దాల్చారు. వైసిపి, టిడిపి, జనసేనల ఈ లొంగుబాటు దేనికి సంకేతం? బిజెపికి అడుగడుగునా మడుగులొత్తే వైఖరితో రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యం?
ప్రత్యేక హోదాను ముగిసిన అధ్యాయంగా కేంద్ర మంత్రి పేర్కొనడం ఏకపక్షమే! ఎవరు ముగించారో...ఎప్పుడు ముగించారో కూడా ఆయన చెప్పి ఉండాల్సింది. నిజానికి రాష్ట్ర ప్రజలెవ్వరూ ఆ భావనలో లేరు. విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలంటూ ఊరించిన టిడిపి-బిజెపి కూటమికి ప్రజానీకం రాష్ట్రంలో అధికారం కట్టబెట్టింది. అర్ధరాత్రి ప్రకటించిన ప్యాకేజికి అంతే హడావిడిగా చంద్రబాబు తలూపడంతో భగ్గుమన్న రాష్ట్ర ప్రజానీకం ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆరునూరైనా హోదా తెస్తానన్న వైసిపికి ఓట్ల వర్షం కురిపించారు. ఆ ఓటమి నుండి గుణపాఠం ఏమాత్రం నేర్చుకోని చంద్రబాబు ఇప్పటికీ బిజెపికి వంత పాడుతూనే ఉన్నారు. మరోవైపు ఎన్నికల్లో గెలవగానే కేంద్రంలో బిజెపికి వచ్చిన సీట్ల సంఖ్యను చూపిస్తూ వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాడి కిందపడేశారు! 'అడుగుతూనే ఉంటా....' అంటూ కొండంత రాగం తీసిన ఆయన రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుని, రాష్ట్రానికి ద్రోహం చేసిన... చేస్తున్న వారివైపే నిలిచారు. తాను కూడా తక్కువ తిన్నదేమి లేదంటూ చంద్రబాబు కూడా ఆ గొడుగే పట్టారు. ఫలితంగా రాష్ట్రంలో ఒక్క ఎంఎల్‌ఏ సీటు కూడా గెలవలేని బిజెపి రాష్ట్రపతి ఎన్నికల్లో నూరు శాతం ఓట్లను పొందింది! ఆ ఎన్నికల ఫలితాలు కూడా రాకముందే రెండు ప్రాంతీయ పార్టీలు భంగపాటును ఎదుర్కోవాల్సి రావడం ఎంత సిగ్గుచేటు? ప్రజాతీర్పును తుంగలో తొక్కుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేసిన ఆ పార్టీలు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతాయి?
కారణాలు ఎవైనా వైసిపి, టిడిపి, జనసేనలు మాట తప్పాయి. కాడి పడేశాయి. కానీ, రాష్ట్ర ప్రజానీకం ఆ పని ఎప్పుడూ చేయలేదు. నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటంలో వామపక్షాలు ప్రజలతో కలిసి నడుస్తున్నాయి. కేంద్ర దుర్మార్గ వైఖరిని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ వారిని చైతన్య పరుస్తున్నాయి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 520 రోజులకు పైగా జరుగుతున్న పోరాటమే దీనికి నిదర్శనం. ప్రత్యేక హోదా... విశాఖ ఉక్కు ఈ రెండూ ఆంధ్ర ప్రదేశ్‌కు రెండు కళ్లు లాంటివి. వాటిని పొడిచి, భవిష్యత్తును అంధకారం చేయడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలను ఈ రాష్ట్ర ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ముందుకు సాగనీయరు. ఆ పోరాటానికి మద్దతు ఇవ్వడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం.