
అల్లూరి సీతారామరాజు జిల్లా (రంపచోడవరం నియోజక వర్గం), ఏలూరు జిల్లా (పోలవరం నియోజకవర్గం) 6 మండలాల్లో జూలైలో వచ్చే వరదకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, 2022 వరద నష్టపరిహారం ఇవ్వాలని 8 మండలాల్లో 2013 చట్టం సమగ్రంగా అమలు జరపాలని తదితర డిమాండ్ల సాధనకోసం రాష్ట్ర రాజధానికి చేపడుతున్న ఈ మహా పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించాలని పోలవరం నిర్వాసితులు కోరుతున్నారు. ఈ యాత్రలో ప్రజలు పాల్గొని పోలవరం నిర్వాసితులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ నెల 20న అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం (భద్రాచలం సమీపంలోని) నెల్లిపాక నుండి పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితుల మహాపాదయాత్ర ప్రారంభమౌవుతుంది.
గోదావరి బిడ్డల ఘోష
గత సంవత్సరం జూలై 11న రెండు జిల్లాల్లోని 6 మండలాలకు (కూనవరం, ఎటపాక, వి.ఆర్.పురం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు) గోదావరి, శబరి వరదల తాకిడి ప్రారంభమైంది. ఒక్క రోజులోనే ఈ మండలాల్లోని 193 గ్రామాలకు వరద ప్రాకిపోయింది. మొత్తం ఈ ప్రాంతమంతా జల ప్రళయంగా మారిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ''అపర నీరోలు''లాగా నిర్వాసితులను ఆదుకోకుండా అమానుష వైఖరిని ప్రదర్శించారు. 100 రోజులు పాటు ఈ జల ప్రళయం 193 గ్రామాలను అతలాకుతలం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని తగు సహాయం అందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి రూ.2000/-లు చొప్పున మాత్రం ఇచ్చి చేతులు దులుపుకొంది. 100 రోజుల కాలంలో 4 దఫాలుగా వరద వచ్చి, వెళ్ళిన ఏ సందర్భంలోను ఈ ప్రభుత్వాలు స్పందించలేదు. మహా విపత్తుగా గుర్తించలేదు. ఈ గ్రామాల ఆదివాసీలు, ప్రజలు సర్వం కోల్పోయారు. పశువుల్ని, పంటల్ని నష్టపోయారు. వృత్తులు, చిరు వ్యాపారాలు దెబ్బతిని పోయాయి.వేసిన పంట వరదలో సర్వం కొట్టుకుపోయింది. తల దాచుకోవడానికి చిన్న పట్టా అయినా ఇవ్వమని వరద బాధితులు అభ్యర్థించినా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చొంది. వేల కుటుంబాలు అడవుల్లో, కొండ గుట్టలపై వర్షంలో, వరదలో, ఎండలో నానా అగచాట్లు పడ్డారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత తమ ఊళ్ల వైపు వచ్చి, అప్పో సొప్పో చేసి మరల జీవనాన్ని ప్రారంభించారు. సిపిఎం వీరికి కొండంత అండగా నిలబడింది. వరదలో నాటు పడవలపై నాయకులు విస్తృతంగా పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు, భరోసా కల్పించారు. వరద తగ్గిన అనంతరం ఈ ఆరు మండలాల్లో భోజన శాలలు ఏర్పాటు చేసి వరద బాధితులకు ఆహారం అందించారు. బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. మెడికల్ క్యాంపులు పెట్టి అంటు వ్యాధులు రాకుండా ఆదుకున్నారు. వరద భాధిత, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఆందోళనలు నిర్వహించారు. పాలక పార్టీ వైసిపి, ప్రధాన ప్రతి పక్షం టిడిపి వరద భాధితులకు, నిర్వాసితులకు ఏ సహాయం చేయలేదు.
పోలవరం నిర్వాసితులు - రాజకీయ పార్టీలు
ఉమ్మడి రాష్ట్రాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణం పై ఉన్న శ్రద్ధ లక్షలాది మందిగా ఉన్న నిర్వాసితులపై ఏ కోశాన చూపించలేదు. '' వారం వారం పోలవరం'' పేరుతో ప్రతీ సోమవారం హెలికాప్టర్ పై చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సందర్శించేవారు. అక్కడ కొండ పై దిగి ప్రాజెక్ట్ అధికారులతో, కాంట్రాక్ట్ కంపెనీలతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించేవారు. మరల హెలికాప్టర్ పై ఆకాశ మార్గాన అమరావతి వెళ్ళిపోయేవారు. ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞాపనలు ఇచ్చుకునేదానికి వీలు లేకుండా సిపిఎం, గిరిజన సంఘాల నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసి ముఖ్యమంత్రి వెళ్ళేదాకా పోలీసు స్టేషన్‌లో ఉంచేవారు. పోలవరం, దేవిపట్నం మండల గ్రామాలను అత్యంత నిరంకుశంగా, అమానుషంగా పోలీసు చర్యలతో ఖాళీ చేయించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌మోహన్ రెడ్డి నిర్వాసితుల సమస్యలు పట్టించుకోకుండా ప్రాజెక్ట్ నిర్మాణం గురించే సమీక్షలు జరుపుతున్నారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి నిర్వాసితుల గురించి స్పష్టంగా చెప్పలేదు . గత సంవత్సరం వరదల్లో ఒకేఒక్క సారి వరద ప్రాంత పర్యటన పేర చింతూరు మండలం చట్టి వద్దకు హెలికాప్టర్‌లో వచ్చి వెళ్ళారు. వరద బాధితుల గురించి కాని, నిర్వాసితుల గురించి మాట్లాడలేదు. '' డబ్బులు ముద్రించే కేంద్రం డబ్బులు ఇస్తే అప్పుడు మీకు డబ్బులు ఇస్తాను'' అని చెప్పి వెళ్ళిపోయారు. వైసిపికి చెందిన శాసన సభ సభ్యులు నాగులపల్లి ధనలక్ష్మీ (రంపచోడవరం), తెల్లం బాలరాజు (పోలవరం) వరదల సమయంలో, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారు. వారి సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.
ముఖ్యమంత్రులు చంద్రన్న, జగనన్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల నీరో చక్రవర్తిని తలపించారు. ప్రాజెక్ట్ ఎత్తు, తగ్గులు గురించి, డయా ఫ్రం వాల్, కాఫర్ డ్యాం, స్పిల్ వే ల గురించి తరచు వాదోపవాదాలు చేశారు. చేస్తున్నారు. ఒకరి ప్రభుత్వం పై మరొకరు తీవ్ర అవినీతి ఆరోపణలు, కాంట్రాక్ట్ కంపెనీల గురించి సవాళ్ళు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. కాని పోలవరం ప్రాజెక్ట్ కోసం అత్యున్నత త్యాగం చేస్తున్న నిర్వాసితులకు మాత్రం ఎవరు ఏమి చేశారో ఎప్పుడూ వారు మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో 1,06,600 కుటుంబాలు నీట మునుగుతాయి అని ప్రకటించింది. కాని ఇంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితుల, పునరావాసానికి గాను ఖర్చు చేసినది కేవలం రూ.7వేల కోట్లు లోపే . ఈ ప్రాజెక్ట్‌లో పునరావాసం, పరిహారానికి గాను నిర్వాసితులకు సుమారు 33వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఖర్చు చేసింది నాలుగోవంతు కూడా లేదు. నిర్వాసితుల పట్ల నేర పూరిత, బాధ్యతారహిత వైఖరి బిజెపిది.
ఆంధ్రప్రదేశ్ పునరీవ్యవస్థీకరణ చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చారు. అంటే ప్రాజెక్ట్ నిర్మాణానికి, పునరావాసానికి మొత్తం వ్యయం కేంద్రమే ఖర్చు చేయాలి. కాని ప్రధాన మంత్రి మోడీ ఎప్పుడూ పోలవరం ప్రాజెక్టు గురించి గాని, నిర్వాసితుల గురించి గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్లమెంటులో బిజెపికి చెందిన కేంద్ర మంత్రులు నిర్వాసితుల పునరావాసం అసలు తమకు సంబంధం లేదని అడ్డగోలుగా ప్రకటించారు. అప్పుడు కూడా ప్రధాన మంత్రి స్పందించలేదు.
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ చట్టాలన్నింటిని తుంగలో తొక్కారు.
పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతమంతా రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లో ఉంది. ఈ ప్రాంతంలో 1/70 చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం, పెసా చట్టం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో జాతీయ ప్రాజెక్ట్‌గా ఉంది. 2013 భూసేకరణ చట్టం సమగ్రంగా అమలు చేయాల్సి ఉంది. ఈ చట్టాలను అన్నింటిని బిజెపి, వైసిపి, టిడిపి ప్రభుత్వాలు పూర్తిగా తుంగలో తొక్కాయి. భారత రాజ్యాంగానికే తూట్లు పొడిచాయి. 3 లక్షల నిర్వాసితులను దగా చేశాయి, చేస్తున్నాయి. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలలో ఈ మూడు రాజకీయ పక్షాలు ఒక్కటి కూడా అమలు జరపలేదు.
సిపిఎం, వామపక్షాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలపైన, చట్టాలలో పొందు పరిచిన హక్కుల పైన నిరంతరం ఆందోళనలు సాగిస్తున్నాయి, ఉద్యమాలు చేస్తున్నాయి.
మహాపాదయాత్రకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి.
గత సంవత్సరం వరదలు సమయంలో వచ్చిన మహావిపత్తు పునరావృతం కాకుండా రెండు జిల్లాల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా (రంపచోడవరం నియోజక వర్గం), ఏలూరు జిల్లా (పోలవరం నియోజకవర్గం) 6 మండలాల్లో జూలైలో వచ్చే వరదకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, 2022 వరద నష్టపరిహారం ఇవ్వాలని 8 మండలాల్లో 2013 చట్టం సమగ్రంగా అమలు జరపాలని తదితర డిమాండ్ల సాధనకోసం రాష్ట్ర రాజధానికి చేపడుతున్న ఈ మహా పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించాలని పోలవరం నిర్వాసితులు కోరుతున్నారు. ఈ యాత్రలో ప్రజలు పాల్గొని పోలవరం నిర్వాసితులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పద పద పద పాదయాత్రై మన అడుగేద్దాం !
పద పద పద మన దొకటే మాటై
పద పద పద పోరాట బాటై
పద పద పద మన దొకటే మాటై
పద పద పద పోరు బాటై మనం గెలిచితీరాలె
పునరావాసం తేలినాకే పోలవరం
అంత వరకు ఎవర్ని కదలనీయం
మాయా మాటలతో బురుడీ కొట్టించలేరు
ఎర్రజెండా మా అండై నడుస్తోంది
పద పద పద పాదయాత్రై మన అడుగేద్దాం
(దేవేంద్ర 'మహా పాదయాత్ర' మార్చింగ్ సాంగ్ నుంచి)
(వ్యాస రచయిత
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
మంతెన సీతారాం