Sep 25,2022 07:40

విష్ణుప్రియ కొడుకు శంకర్‌రెడ్డి రాసిన పదో తరగతి ఫలితాలు తెల్లారితే వస్తాయి. కళ్ల ముందున్న కొడుకు భవిష్యత్తు కోసం ఎదురుచూస్తోంది. తన భర్తను రాయలసీమ ఫ్యాక్షన్లో పోగొట్టుకుని ఒక ఆశయం కోసం ఒంటరిగానే కొడుకును చదివించాలని నిర్ణయించుకుంది విష్ణుప్రియ. తన భర్త భరత్‌రెడ్డి వందల ఎకరాల పొలాలు, ఆస్తులు ఫ్యాక్షనిజంలో హారతి కర్పూరంలా కరిగించేశాడు. చివరికి రెండు ఎకరాల పొలం మిగిలింది విష్ణుప్రియకు. తాతల పౌరుషాలు తప్ప తమకి ఏమీ మిగలలేదని, అవసరం వచ్చినప్పుడల్లా కుమారునికి గుర్తు చేస్తూ, వాడి ధ్యాసను చదువు మీదికి మళ్లించింది. ఎలాగైనా ఐ.ఏ.ఎస్‌ చెయ్యాలని ప్రతినిత్యం కొడుకు శంకర్‌రెడ్డికి గుర్తుచేస్తూ, ఆ రెండు ఎకరాల సాగు ఆధారంగా కొడుకును చదివిస్తూ ఉంది విష్ణుప్రియ.
పరీక్షా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విష్ణుప్రియకు ఐదు వందల డెబ్బై మార్కులతో ఆ మండలంలోనే ప్రథమంగా నిలిచి, తల్లి ఆశలకు ప్రాణం పోశాడు శంకర్‌రెడ్డి. విష్ణుప్రియ 'శంకర్‌ ఏ కాలేజీలో చేరుతావు చెప్పు? ఎంత ఖర్చయినా అప్పు తెచ్చి అయినా సరే నిన్ను చదివిస్తాను. నీవు కష్టపడి చదివి, ఐ.ఏ.ఎస్‌ అధికారి అయితే నా కల నెరవేర్చినట్లు అవుతుంది. ఈ ఫ్యాక్షన్‌ గ్రామాల్లో చంపుకోడానికి ఇచ్చినంత స్వేచ్ఛ చదువుకోవడానికి ఎవరిస్తున్నారు? తాతల కథలు చెప్పుకుంటూ నాన్నల పౌరుషాలు నెమరు వేసుకుంటూ కొంప, గోడు వదిలి ఎన్నో కుటుంబాలు జైల్లోనే మగ్గుతున్నాయి. వారి జీవితాల్లో నువ్వు వెలుగు నింపాలన్నదే నా కోరిక' అని శంకర్‌కు హితబోధ చేసింది విష్ణుప్రియ.
'నేను హైదరాబాదులోనే ఇంటర్‌ చదువుతానమ్మా అక్కడ ఇంటర్‌తోపాటు ఐ.ఏ.ఎస్‌ కోచింగ్‌ కూడా ఇస్తారట!' అన్నాడు శంకర్‌ వాళ్ల అమ్మతో. 'చిన్నాన్న సురేంద్రరెడ్డి కనుక్కొని నాకు చెప్పాడు. అక్కడ సీటుకు అప్లై చేస్తాను. తప్పకుండా కష్టపడి చదివి నీ ఆశలు నెరవేరుస్తానమ్మా దిగులు పడకు' తల్లితో అన్నాడు శంకర్‌.
అలాగే అంటూ విష్ణుప్రియ సురేంద్రరెడ్డికి ఫోన్‌ చేసి, వివరంగా విషయాలన్నీ కనుక్కొని, అక్కడ చదివే ఏర్పాటు చేసింది. ఆ రోజు రాత్రి నిద్రపోతున్న కొడుకు ముఖాన్ని తదేకంగా చూస్తూ, భర్త భరత్‌రెడ్డి పదో తరగతి వరకూ చదువుకొని, తండ్రి వారసత్వంగా ఫ్యాక్షనిజం భుజాలపై మోస్తూ, ప్రత్యర్థుల చావు కోసమే నిరంతరం తపిస్తూ వంద మందిని వెంట పెట్టుకొని తిరిగేవాడు. వారి కుటుంబాల్ని తానొక్కడే పోషిస్తూ, ఉన్న పొలాన్నంతా కొద్ది కొద్దిగా అమ్మేసుకుంటూ వచ్చాడు. పులి మీద సవారి లాంటి ఫ్యాక్షనిజం కోరల్లో చిక్కుకుని చివరకు ప్రత్యర్థి చేతుల్లో మరణించాడు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని, తాను, పిల్లవాడు పడ్డ కష్టాలు గుర్తొచ్చి కన్నీళ్లొచ్చాయి విష్ణుప్రియకు. తన కొడుకుని సీమ గొడవలకు దూరంగా ఉంచి, మంచి చదువులు చదివించాలనేది ఆమె కోరిక. వాడిని ప్రయోజకుణ్ణి చేసి, సీమ గ్రామాల్లో మార్పు తేవాలనే ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంది విష్ణుప్రియ.
ఆ రోజు కొడుకుని హైదరాబాద్‌కు పంపేందుకు సిద్ధం చేస్తూ 'శంకర్‌ నా ఆశయాలను బరువైన హృదయంతో మోసుకెళ్తున్నావు. అక్కడ జాగ్రత్త బాబు. ఆశయం పైనే నిత్యం నీ ఆలోచనలు ఉండాలి. భవిష్యత్తు అంతా నీ అభివృద్ధిపైనే ఆధారపడి ఉంది. సీమ గ్రామాల్లో ఆనందపు సిరులు పూయించే బాధ్యత నీదే. నెత్తుటితో తడుస్తున్న గడపలను నిత్య సంతోషాలతో కళకళలాడేలా చేయాల్సిన గురుతర బాధ్యత నీదేనని గుర్తించి, నీ చదువు కొనసాగిస్తావని ఆశిస్తున్నా'నంది.
శంకర్‌ హైదరాబాదులో ఐ.ఏ.ఎస్‌ అకాడమీలోచేరి, తన హృదయ ఫలకంలో రాసుకున్న లక్ష్యాన్ని చేరడానికి కృషి చేసి ఇంటర్‌ ప్రథమస్థానంలో పాసయ్యాడు. తల్లి ఆనందానికి అవధులు లేవు. కొన్ని రోజుల తరువాత మిత్రులతో కలసి ఢిల్లీలో నారాయణ ఐ.ఏ.ఎస్‌ అకాడమీలో చేరి డిగ్రీ పూర్తి చేయాలన్న తన ఆలోచనను తల్లి ముందుంచాడు శంకర్‌. నీకు ఇబ్బంది లేదనుకుంటేనే వెళ్తానమ్మా అన్నాడు. తల్లికి ఢిల్లీ అంటే కాస్త భయం వేసింది. ఖర్చుతో కూడుకున్న పనే కానీ శంకర్‌ ఆశకు తాను ఊతమిస్తే తన ఆశయం నెరవేరుతుంది. పెన్నానది ఎండిపోయి, సీమ బ్రతుకులు ఎడారిలా తయారయ్యాయి. చుక్క నీరు దొరక్క పచ్చని ప్రకృతి ఎండి, చివరికి పశువులకు కూడా మేత దొరకక కబేళాలకు తరలిపోతున్నాయి. నేల నిండా కాలువలు త్రవ్వినా, ఎన్నడూ నిండుగా పారింది లేదు. వచ్చే నీటిని రానివ్వకుండా ప్రభుత్వాల స్వార్ధంతో రాయలసీమ జిల్లాలను ఎండగట్టి, నీరంతా పైకి వదులుతూ రాళ్ల సీమలో నీళ్లు రాళ్లు తడపడం తప్ప, నేలపై పారి పంట పండించింది చాలా అరుదు అని ఆలోచిస్తూ 'ఎన్ని సంవత్సరాలు?' అని అడిగింది విష్ణుప్రియ. 'నాలుగు సంవత్సరాలు పడుతుందమ్మా' అన్నాడు శంకర్‌. తనకున్న రెండెకరాల పొలం తాకట్టు పెట్టడానికి నిర్ణయించుకుని సరే అంది. కొడుకు ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది విష్ణుప్రియ. రెండెకరాల పొలాన్ని అంగడి కొట్టు శివయ్య శెట్టికి తాకట్టు పెట్టి, తనకు కావలసిన డబ్బును తీసుకొని పత్రం రాసి ఇచ్చింది. కొంత డబ్బు కొడుకు చేతిలో పెడుతూ 'శంకర్‌, జాగ్రత్తగా వాడుకో. మళ్లీ అవసరమైతే చెప్పు పంపిస్తా! మన కుటుంబ పరిస్థితులు అర్థంచేసుకొని, అక్కడ నువ్వు మసలుకో. ఎందరో ధనవంతుల పిల్లలు అక్కడ ఉండిఉండవచ్చు. వారి అలవాట్లు, అభిరుచులు ఖరీదై ఉండవచ్చు. కానీ మన స్థోమతను గుర్తించి నడుచుకో. అనవసర ఖర్చులు చేసి, ఇబ్బంది పడవద్దు. నన్ను ఇబ్బంది పెట్టవద్దు' అని కొడుక్కి జాగ్రత్తలు చెప్పి, గుంతకల్లు రైల్వే స్టేషన్లో కుమారుణ్ణి రైలు ఎక్కించి బరువైన హృదయంతో ఇల్లు చేరుకుంది విష్ణుప్రియ.
శంకర్‌ ఢిల్లీకి చేరుకున్నాడు. తల్లికి ఫోన్‌ చేసి చేరుకున్న సంగతి, రెండు రోజుల ప్రయాణంలో విశేషాలు ఆమెతో పంచుకున్నాడు. రేపు ఉదయం కాలేజీకి వెళ్తున్నానని, తల్లిని ధైర్యంగా ఉండమని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. మరుసటి రోజు ఉదయమే లేచి కాలేజీకి సిద్ధమయ్యాడు శంకర్‌. మొదటిరోజే 'తన ఆశయ లక్ష్యాన్ని, అమ్మ ప్రగాఢ కోరికను మిత్రులతో పంచుకున్నాడు. క్లాసులో పాఠాలు శ్రద్ధగా వింటూ, తాను నెమరు వేసుకుంటూ మిత్రులతో చర్చించడం చేస్తూ చదువును కష్టంగా కాక ఇష్టంగా చదువుతూ, ఉత్సాహంగా ఉంటూ ప్రథమ సంవత్సరం పూర్తిచేశాడు.
అక్కడే స్నేహా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. శంకర్‌ తన లక్ష్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. డిగ్రీ పూర్తయ్యాక యుపిఎస్‌సి వారు నిర్వహించిన పరీక్షల్లో పాల్గొని మొదటిసారే పదవ ర్యాంకు తెచ్చుకుని, తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు.
తల్లి విష్ణుప్రియ ఆనందానికి అవధులు లేవు, తన ఆశల స్వప్నం కోటి వెలుగుల దివ్యకాంతి అయ్యింది. శంకర్‌ ఐ.ఏ.ఎస్‌ ట్రైనింగ్‌ ముంబైలో పూర్తి చేసుకుని, తన సొంత జిల్లా అయిన కర్నూలుకు మొదటి పోస్టింగ్‌ తీసుకొని వచ్చాడు. విష్ణుప్రియ సంతోషంతో కొడుకుని అక్కున చేర్చుకుంది. శంకర్‌ 'సంతోషమేనా అమ్మా' అని అడిగాడు. ఫ్యాక్షన్‌ గొడవల్లో మరణించిన వారి కుటుంబాలకు ఏదన్నా చెరు నాన్నా. నీ పరిధి అధికారాలతో ఇక్కడి ప్రజల అభివృద్ధికి కృషి చెరు. బీడు వారిన భూముల్లో పంటలు పండించుకునే సౌకర్యం కల్పించు. ఇక్కడి యువతకు, ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం నీ శక్తి కొలది కృషి చెయ్యి. కరువు ప్రాంతంలో పనులు లేక పంటలు పండక అందరూ వలస వెళ్తున్నారు. ఇక్కడే పరిశ్రమలు నెలకొల్పితే ఉద్యోగాలు వస్తాయి కదా.ఆ ఏర్పాటు చెయ్యి. ఎవ్వరూ పరువు, పౌరుషమంటూ ఫ్యాక్షన్‌ జోలికి పోకుండా కఠిన చర్యలు తీసుకో. నీ పరిస్థితి ఏ పిల్లవాడికి రాకుండా చూడు. కష్టపడి చదివిన నీ చదువుని సార్థకం చేసుకో. నిజాయితీగా నీ వృత్తి ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు' అంది విష్ణుప్రియ ఉద్విగంగా.
శంకర్‌ తల్లితో 'అమ్మ నీ ఆశయమనే గోరుముద్దలు తిని నేను పెరిగాను. నీ కన్నీళ్ల ఆశీర్వాదాలే ఇంత వాడిని చేశాయి. తండ్రి లేని బాధ ఏంటో నాకు తెలుసు. ఉన్న ఆస్తులు పోగొట్టుకొని, ఎంత నరకం అనుభవించామో, ఈ గొడవల్లో ఎంత నష్టపోయామో నాకు తెలుసు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నా శక్తి కొలది నా అధికారాలకు లోబడి నీ ఆశయం నెరవేరుస్తాను' అని తల్లికి ధైర్యం చెప్పాడు.
మొదటి రోజే తన ఆశయసిద్ధి నిర్వహణలో తన గురుతర బాధ్యతలను నిర్వర్తించడానికి పూనుకున్నాడు. సీమలో ప్రతి ఎకరానికీ నీటి సౌకర్యం అందాలంటే చేయవలసిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల వివరాలు అధికారులతో చర్చించి చేయవలసిన పనులను వారికి సూచించాడు. అతి తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలందుకునే స్థాయికి చేరుకున్నాడు. మంచి పంటలు వేసుకునేందుకు రైతులను ప్రోత్సహించి, సకాలంలో విత్తనాలను, ఎరువులను అందేటట్లు చేశాడు. రైతులకు కావలసిన సకల సదుపాయాలు కల్పిస్తూ, తాను నిత్య శ్రామికుడై రైతులకు అండగా ఉన్నాడు. సీమ నుంచి వలసలు ఆపేందుకు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయించి, తన వంతు సహాయం అందిస్తూ, సీమాభివృద్ధికి నిరంతరం చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. తల్లి అభీష్టం మేరకు తాను ప్రేమించిన స్నేహను వివాహమాడాడు. సీమలో పుష్కలంగా పంటలు పండి, ప్రజలకు ఉపాధి దొరికిన నాడు ఆధిపత్య పోరు, ఫ్యాక్షనిజం ఆలోచనలు రావు అని తల్లీ కొడుకులు సంతృప్తి చెందారు. తన ఆశయం, తన తల్లి ఆశయం నెరవేరినందుకు, ఆ అవకాశం ప్రథమంగానే తనజిల్లాకు పోస్టింగ్‌ రావడంతో తన కల సాకారం చెందినందుకు శంకర్‌ చాలా సంతోషపడ్డాడు. తల్లి, భార్య స్నేహతో తృప్తిగా జీవనం సాగించాడు.
 

కొప్పుల ప్రసాద్‌
98850 66235