
ఇంటర్నెట్‌డెస్క్ : మీరు ఉద్యోగ బాధ్యతల్లో గంటలతరబడి కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? అయితే పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వ్యాయామం చేయని ఉద్యోగస్తులు 8 నుండి 10 గంటల వరకు కూర్చోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశముందని డాక్టర్లు సూచిస్తున్నారు.
- నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. దీంతో చిన్నపాటి వ్యాయామాలు చేయడానికి సమయం లేక ఆఫీసులకు హడావిడిగా పరుగెడుతుంటారు. కేవలం సమయపాలన గురించే ఉద్యోగస్తులు ఆలోచిస్తున్నారు తప్ప వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. శ్రద్ద పెట్టడం లేదు. దీంతో చిన్న వయసులోనే అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశమందని కొన్ని పరిశోధనల్లో తేలింది. అందుకే వైద్యులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
- ఎక్కువ గంటలు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల అధిక బరువు పెరుగుతారు. బరువును తగ్గించుకోవడానికి చాలామంది జిమ్‌కు వెళుతుంటారు. అలా కాకుండా.. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, గార్డెనింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్, లేదా మీకిష్టమైన గేమ్ ఇలా ఏదైనా ఎంచుకుని వర్కవుట్స్ చేయడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే సమయం ప్రకారం ఆహారం తీసుకోవాలి. మీకు నచ్చిన విధంగా వ్యాయామం చేస్తూ.. సమతుల్యమైన ఆహారం తీసుకుంటే గుండెపోటు వచ్చే అవకాశం తక్కువని వైద్యులు చెబుతున్నారు.
- రోజులో కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించుకోవాలి. అలాగని విపరీతంగా బరువులెత్తే సాహోసోపతమైన వ్యాయామాలు చేసినా గుండె పనితీరుకి చేటు కలిగిస్తుంది. అందుకే తేలికపాటి వ్యాయామాలను చేస్తూ.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
-