ఇప్పుడు అమెరికా తన ఆర్థిక వ్యవస్థను చైనా, తదితర దేశాల నుండి వచ్చిపడే దిగుమతుల నుండి రక్షించుకోవాలని చూస్తోంది. ఇప్పటిదాకా, ఈ దిగుమతుల వెనక ప్రధాన పాత్ర అమెరికన్ పెట్టుబడిదే. ఐనప్పటికీ, అవి అదే మాదిరిగా కొనసాగితే అమెరికాలోని పరిశ్రమలు మూతబడక తప్పదు. మొదట్లో చైనాలో చేపట్టిన ''ఆర్థిక సంస్కరణలను'' చాలా గొప్పగా శ్లాఘించిన అమెరికా ఇప్పుడు చైనా ''తోక కత్తిరించాలని'' మాట్లాడుతోంది.
ఈ మార్పు వెనుక నయా ఉదారవాద వ్యవస్థ కూరుకుపోయిన సంక్షోభం పాత్ర ఉంది. అందులోంచి బైటపడడానికి మళ్ళీ సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి. అదొక్కటే దాని ముందున్న దారి. కాని, చైనా, ఆ దేశం ప్రేరణతో మరికొన్ని దేశాలు ఆ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయి. అమెరికా, చైనాల నడుమ వైరుధ్యం పెద్దదవడానికి వెనుక ఇదే కారణం.
పశ్చిమ దేశాలలోని కమ్యూనిస్టేతర వామపక్షాలు అమెరికాకు, చైనాకు నడుమ నెలకొన్న శతృత్వాన్ని రెండు సామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుధ్యంగా పరిగణిస్తున్నాయి. ఆ విధంగా పరిగణించడం ద్వారా అవి తమ సైద్ధాంతిక దృక్కోణాన్ని మూడు విధాలుగా సమర్ధించుకుంటున్నాయి. మొదటిది: అమెరికాకు, చైనాకు నడుమ వైరుధ్యం ఎందుకు పెరుగుతోందో వివరించగలుగుతున్నాయి. రెండవది: అందుకోసం అవి లెనినిస్టు అవగాహనను లెనినిస్టు సిద్ధాంత చట్రంలో ఉపయోగిస్తున్నాయి. మూడవది: చైనా ఒక ఎదుగుతున్న సామ్రాజ్యవాద దేశంగా విమర్శించడం ద్వారా చైనాలో ఒక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం జరుగుతోందన్న తమ అతి-వామపక్ష (అల్ట్రా-లెఫ్ట్) విమర్శను సమర్ధించుకుంటున్నాయి.
ఈ తరహా విమర్శ ద్వారా ఆ వామపక్ష శక్తులు తెలిసో, తెలియకో చైనాకు వ్యతిరేకంగా అమెరికన్ సామ్రాజ్యవాదం సాగిస్తున్న కుట్రలకు తోడ్పడుతున్నాయి. అమెరికా, చైనాలు రెండూ సామ్రాజ్యవాద దేశాలే గనుక వాటిలో ఒకదానికి వ్యతిరేకంగా రెండో దేశాన్ని బలపరచడంలో అర్ధం లేదన్న నిర్ధారణకు వారి వాదనలు దారి తీస్తాయి. ఇంకాస్త దారి తప్పితే ఆ రెండు దేశాల్లోనూ తక్కువ ప్రమాదకారిగా ఉన్న అమెరికాను సమర్ధించి చైనాను వ్యతిరేకించడానికి కూడా దారి తీయవచ్చు. ఏ విధంగా చూసినా ఆ వైఖరి చైనా విషయంలో అమెరికా అవలంబిస్తున్న దూకుడును వ్యతిరేకించాల్సింది పోయి, గందరగోళ పరుస్తున్నది. ఇప్పుడు ఈ రెండు దేశాలూ అనేక వర్తమాన పరిణామాలపై పరస్పరం తలపడుతున్నాయి. ఆ సందర్భాలలో అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వైఖరి తీసుకునే బదులు మౌనం వహించడానికి దారి తీస్తుంది.
పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద శక్తులను మామూలుగా వ్యతిరేకించే వామపక్షాలు (పశ్చిమ దేశాల లోనివి) సైతం ఆ సామ్రాజ్యవాదం తీసుకుంటున్న చర్యలను సమర్ధిస్తున్న సందర్భాలు ఉన్నాయి. స్లోబోడెన్ మిలోసెవిచ్ సెర్బియాను పరిపాలిస్తున్నప్పుడు ఆ దేశంపై బాంబుల దాడికి సామ్రాజ్యవాదులు పూనుకున్నప్పుడు ఆ విధంగానే సమర్థించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉక్రెయిన్‌కు నాటో దేశాల మద్దతును సమర్ధిస్తున్నారు. దిగ్భ్రమ గొలిపే విధంగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదుల మద్దతుతో కొనసాగిస్తున్న మానవ హననాన్ని వాళ్ళు వ్యతిరేకించడంలేదు. చైనా విషయంలో సామ్రాజ్యవాదులు అనుసరిస్తున్న దూకుడు విషయంలో పశ్చిమ దేశాల వామపక్ష శక్తుల వైఖరి పెద్దగా భిన్నంగా లేకపోవడం కూడా ఈ ధోరణిలో అంతర్భాగమే.
సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో శ్రామికవర్గపు ధోరణులకు, వారి ప్రయోజనాలకు అక్కడి వామపక్ష శక్తులు సామ్రాజ్యవాదం విషయంలో అనుసరిస్తున్న వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడి కార్మికవర్గం ఉక్రెయిన్‌లో నాటో కొనసాగిస్తున్న పరోక్ష యుద్ధాన్ని చాలా గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఉక్రెయిన్‌లో ఉపయోగించడానికి ఉద్దేశించిన ఆయుధాలను ఓడలకు ఎక్కించడానికి యూరోపియన్ కార్మికులు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత అంత ఆశ్చర్యం కలిగించేది కాదు. ఎందుకంటే, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగి అక్కడి కార్మికుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆ యుద్ధాన్ని అక్కడి వామపక్షాలు వ్యతిరేకించకపోవడంతో ఆ కార్మికులు చాలామంది ఇప్పుడు మితవాద ప్రతిపక్ష పార్టీల వైపు సానుకూలతను ప్రదర్శిస్తు న్నారు. ఈ మితవాద పార్టీలు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమే మీ కాదు. కాని అవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని విమర్శిస్తూంటాయి (ఇటలీలో మెలనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాదిరిగా చేశాడు. అధికారం లోకి రాగానే సామ్రాజ్య వాదాన్ని పూర్తిగా బలపరుస్తున్నాడు.). ఈ పరిస్థితులలో పశ్చిమ దేశాల్లో వామపక్ష శక్తులు సామ్రాజ్య వాదం పట్ల మెతకగా వ్యవహరించడం వలన అక్కడి రాజకీయ బలాబలాలు మితవాదం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి.
చైనా ఒక పెట్టుబడిదారీ దేశం అని, అందుచేతనే ప్రపంచవ్యాప్తంగా తన సామ్రాజ్యవాద కార్యకలాపాలను విస్తరించే క్రమంలో అమెరికాతో వైరం పాటిస్తోందని భావిస్తున్నవారు ''పెట్టుబడిదారీ'' అంతా ''చెడ్డది'' అని, ''సోషలిస్టు'' అంతా ''మంచిది'' అని కలగాపులగం చేస్తున్నారు. ''నా దృష్టిలో సోషలిజం అనేది ఏ విధంగా ఉంటుందో (అది ఒక ఆదర్శప్రాయమైన దృష్టి) ఇప్పుడు కొన్ని విషయాలలో చైనాలో అందుకు భిన్నంగా జరుగుతోంది గనుక చైనా సోషలిస్టు దేశం కాజాలదు. కనుక చైనా పెట్టుబడిదారీ దేశమే'' అనే విధంగా వారి అభిప్రాయం ఉంటుంది. ''పెట్టుబడిదారీ'', ''సోషలిస్టు'' అనే పదాలకు నిర్దిష్టమైన అర్ధాలు ఉన్నాయి. నిర్దిష్టమైన గతిసూత్రాలతో అవి ముడిపడి వున్నాయి. కొన్ని మౌలిక ఆస్తి సంబంధాలలో అవి వేళ్ళూనుకుని ఉన్నాయి. చైనాలో పెట్టుబడిదారీ రంగం గణనీయంగా ఉందన్నమాట నిజం. అంటే అక్కడ కొన్ని పెట్టుబడిదారీ ఆస్తి సంబంధాలు ఉన్నాయి. ఐతే చైనా ఆర్థిక వ్యవస్థలో అత్యధిక భాగం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అదంతా కేంద్రీకృతంగా నిర్దేశించబడుతోంది. అందుచేత ''సద్యోజనిత'' (స్పాంటేనియస్) స్వభావంతో స్వయంచలితంగా ఉండే పెట్టుబడిదారీ ధోరణిలోకి అది జారిపోకుండా ఉంచుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థలో, అక్కడి సమాజంలో జరుగుతున్న వాటిలో చాలా అంశాలను ఎవరైనా విమర్శించవచ్చు. కాని అది మొత్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అని నిర్ధారించి, అందుచేతనే సామ్రాజ్యవాదులతో సరిసమానంగా తానూ అదే తరహాలో వ్యవహరిస్తోందని చెప్పడం సత్యదూరం ఔతుంది. అది విశ్లేషణ పరంగా పొరపాటు మాత్రమే కాదు. ఆచరణలో అటువంటి అవగాహన అటు సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో, ఇటు మూడవ ప్రపంచ దేశాలలో ఉన్న కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నమైన దిశలో కార్యాచరణకు దారి తీస్తుంది.
ఐతే ఇక్కడ ఒక ప్రశ్న వెంటనే ఉత్పన్నమౌతుంది. అమెరికా-చైనాల నడుమ వైరుధ్యం రెండు సామ్రాజ్యవాద దేశాల నడుమ ఉండే వైరుధ్యం కాకపోతే, ఇటీవల కాలంలో అది అంత ప్రముఖంగా ఎందుకు ముందుకొచ్చింది? దీనిని తెలుసుకోవాలంటే మనం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెనువెంటనే ఉన్న కాలానికి వెళ్ళాలి. ఆ యుద్ధంలో పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా బలహీనపడింది. తన ఉనికే కొనసాగదేమో అన్నంత వాతావరణం ఏర్పడింది. సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లోని కార్మికవర్గం యుద్ధానికి ముందున్న భారీ స్థాయి నిరుద్యోగాన్ని గాని, దారిద్య్రాన్ని గాని భరించడానికి ఇప్పుడు సిద్ధంగా లేదు. మరోపక్క సోషలిజం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పురోగమించింది. వలస, అర్థవలస పాలనకు వ్యతిరేకంగా మూడో ప్రపంచదేశాల్లో విముక్తి పోరాటాలు తారా స్థాయికి చేరాయి. తన మనుగడను నిలుపుకోవడం కోసం పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా రాయితీలు ఇవ్వక తప్పలేదు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ప్రభుత్వ సంక్షేమ చర్యలు, మార్కెట్‌లో కొనుగోలు శక్తిని నిలబెట్టడం కోసం ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం, అన్నింటికీ మించి వలస దేశాల రాజకీయ స్వాతంత్య్రాన్ని అంగీకరించడం జరిగాయి.
రాజకీయంగా వలస విధానం అంతం అయిందంటే దానర్ధం ఆర్థికంగా వలసాధిపత్యం ముగిసిందని కాదు. అంతవరకూ సంపన్న పెట్టుబడిదారీ దేశాల పెత్తనం కింద ఉన్న మూడో ప్రపంచ దేశాల వనరుల మీద అదుపు కొత్తగా స్వతంత్రం పొందిన దేశాలకు దక్కిందని అనుకోరాదు. నిజానికి అటువంటి పెత్తనం కోసం పోరాడిన ఆర్బెంజ్, మొస్సాదె, అలెండీ, చెడ్డీ జగన్, లుముంబా తదితర నేతల నాయకత్వాలలోని ప్రభుత్వాలను కూలదోసేవరకూ సామ్రాజ్యవాదం చాలాకాలం పాటు తీవ్ర స్థాయిలో పోరాడుతూనే వుంది. ఐనా, కొత్తగా స్వతంత్రం పొందిన దేశాల ఆధీనంలోకి ఆ యా దేశాల వనరుల మీద ఆధిపత్యం పోకుండా నిలవరించలేకపోయింది.
పెట్టుబడి కేంద్రీకరణ ఉన్నత స్థాయికి చేరి, అంతర్జాతీయ పెట్టుబడి, ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి రూపం తీసుకోవడంతో పరిస్థితి మళ్ళీ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా మారింది. దానికి సోవియట్ యూనియన్ పతనం తోడైంది. ఈ సోవియట్ పతనం సైతం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పాత్ర లేకుండా జరిగినది కాదు. ప్రపంచీకరణ ఉచ్చులోకి దేశాలను లాగి, ప్రపంచవ్యాప్త ద్రవ్య పెట్టుబడి ప్రవాహాల వేగానికి అవి లోబడేలా చేసింది సామ్రాజ్యవాదం. నయా ఉదారవాద విధానాలను గనుక ఆ దేశాలు అమలు చేయకపోతే ఆ అంతర్జాతీయ పెట్టుబడులు వెనక్కి పోతాయని బెదిరించి ఆ విధానాలు అమలు జరిగేట్టు చేసింది. దాని ఫలితంగా ఆ యా దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభుత్వ నియంత్రణ కింద నడిచే పరిస్థితి లేకుండా పోయింది. మూడవ ప్రపంచ దేశాల వనరుల్లో చాలా భాగం మళ్ళీ సామ్రాజ్యవాదుల ఆధీనంలోకి వచ్చి చేరింది. ఆ మూడో ప్రపంచ దేశాలలో భూమిని ఏ విధంగా వినియోగించాలన్నది సైతం సామ్రాజ్యవాదమే నిర్దేశిస్తున్నది.
సామ్రాజ్యవాద పెత్తనం మళ్ళీ బలపడిన నేపథ్యంలో మనం అమెరికా-చైనాల నడుమ వైరుధ్యాన్ని చూడాలి. ఉక్రెయిన్ యుద్ధంతో సహా అనేక వర్తమాన పరిణామాలను కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. సామ్రాజ్యవాదం తిరిగి బలపడిన తీరులో రెండు ధోరణులు కనపడతాయి: మొదటిది: చైనా తదితర దేశాల నుండి వచ్చే సరుకులకు సంపన్న దేశాలలో ప్రవేశానికి అవకాశం కల్పించడం, సంపన్న దేశాల నుండి చైనా వంటి దేశాలకు పరిశ్రమలను తరలించడం. ప్రపంచ డిమాండ్‌ను అందుకోడానికి వీలుగా ఆ దేశాలలో చౌకగా లభించే కార్మిక శ్రమశక్తిని వాడుకోవడం దీని ఉద్దేశ్యం. దీని ఫలితంగా చైనా తదితర దేశాల ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంది (ఏ దేశాలలోకి సంపన్న దేశాల పరిశ్రమలను తరలించారో, ఏ దేశాల నుండి సంపన్న దేశాలు సరుకుల ప్రవేశానికి అనుమతించాయో ఆ దేశాలలో మాత్రమే). చైనాలో ఆర్థిక పురోగతి ఏ స్థాయికి చేరిందంటే ఆఖరికి అమెరికా కూడా చైనా తనకు ప్రమాదకారిగా తయారు కాగలదని భావించసాగింది. రెండవ ధోరణి: అమెరికాలో ''హౌసింగ్'' బుడగ పేలిపోయి, దాని పర్యవసానాలు అంటువ్యాధి మాదిరిగా మొత్తం నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థనే చుట్టుముట్టి సంక్షోభంలోకి నెట్టింది.
ఈ రెండు కారణాల రీత్యా, ఇప్పుడు అమెరికా తన ఆర్థిక వ్యవస్థను చైనా, తదితర దేశాల నుండి వచ్చిపడే దిగుమతుల నుండి రక్షించుకోవాలని చూస్తోంది. ఇప్పటిదాకా, ఈ దిగుమతుల వెనక ప్రధాన పాత్ర అమెరికన్ పెట్టుబడిదే. ఐనప్పటికీ, అవి అదే మాదిరిగా కొనసాగితే అమెరికాలోని పరిశ్రమలు మూతబడక తప్పదు. మొదట్లో చైనాలో చేపట్టిన ''ఆర్థిక సంస్కరణలను'' చాలా గొప్పగా శ్లాఘించిన అమెరికా ఇప్పుడు చైనా ''తోక కత్తిరించాలని'' మాట్లాడుతోంది. ఈ మార్పు వెనుక నయా ఉదారవాద వ్యవస్థ కూరుకుపోయిన సంక్షోభం పాత్ర ఉంది. అందులోంచి బైటపడడానికి మళ్ళీ సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి. అదొక్కటే దాని ముందున్న దారి. కాని, చైనా, ఆ దేశం ప్రేరణతో మరికొన్ని దేశాలు ఆ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయి. అమెరికా, చైనా ల నడుమ వైరుధ్యం పెద్దదవడానికి వెనుక ఇదే కారణం.
పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం ముదురుతున్న కొద్దీ, మూడవ ప్రపంచ దేశాలను అణచివేయడం కూడా పెరుగుతుంది. సామ్రాజ్యవాద ఒత్తిళ్ళకు తలొగ్గి ఈ దేశాలు అమలు చేస్తున్న ''పొదుపు చర్యల'' ఫలితంగా తాము చెల్లించవలసిన విదేశీ రుణ వాయిదాలను చెల్లించలేని స్థితిలో మూడవ ప్రపంచ దేశాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాటికి చైనా సహాయం అందిస్తోంది. ఆ తోడ్పాటు అందుకుంటున్న మూడవ ప్రపంచ దేశాలు సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ప్రతిఘటిస్తున్నాయి. దాంతో అమెరికా-చైనా వైరుధ్యం మరింత తీవ్రం కానుంది. దాంతోపాటు చైనా వ్యతిరేక ప్రచారమూ పశ్చిమ సంపన్న దేశాలలో మరింత ఎక్కువ కానుంది.
( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్ పట్నాయక్