Jul 14,2022 06:39

రాజ్యాంగ వ్యవస్థలను, వాటి విలువలను ధ్వంసం చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానిది తిరుగులేని రికార్డు. ఈ విషయమై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళనలను బేఖాతరు చేస్తున్న మోడీ అండ్‌ కో తాజాగా జాతీయ చిహ్నాల ప్రతిష్టను మంటగలపడానికి బరితెగిస్తోంది. పార్లమెంటు నూతన భవనంపై ఏర్పాటు చేసిన నాలుగు సింహాల భారీ జాతీయ చిహ్నం విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనం. విగ్రహ రూపకల్పన నుండి ఆవిష్కరణ వరకు ప్రతి విషయాన్ని మోడీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చింది. పైగా పార్లమెంటు భవనం మీద ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా ప్రధానమంత్రి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మూడు విభాగాలను, అవి నిర్వహించాల్సిన బాధ్యతలను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. దీని ప్రకారం కార్యనిర్వాహక వ్యవస్థ (ప్రభుత్వం)కు ప్రధాని అధిపతి. ఇది కాక శాసన వ్యవస్థ (పార్లమెంటు, రాష్ట్రాల చట్టసభలు) న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. రాష్ట్రపతి ఆదేశాల మేరకు పార్లమెంటు సమావేశమవుతుంది. శాసన వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తూ చట్టాలను రూపొందిస్తుంది. ప్రభుత్వం శాసన వ్యవస్థకు లోబడి, జవాబుదారిగా వ్యవహరించాలి. న్యాయవ్యవస్థ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజ్యాంగం ఇంత స్పష్టంగా చెప్పినా ప్రజాస్వామ్యంలో కేవలం ఒక విభాగానికి అధిపతియైన ప్రధాని, రాష్ట్రపతి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు సమావేశమయ్యే పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన చిహ్నాన్ని ఎలా ఆవిష్కరిస్తారు? ఇది రాజ్యాంగం నిర్దేశించిన ఇతర వ్యవస్థల విధుల్లోకి జోక్యం చేసుకోవడం కాదా? పార్టీలకతీతంగా అందర్నీ భాగస్వాములను చేసి, నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని ఏకపక్షంగా ముగించడం ఏమిటి? ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రస్తుత పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఏర్పాటు చేసిన జాతీయ నేతల చిత్ర పటాలను గతంలో ప్రధానులు ఆవిష్కరించగా లేనిది మోడీ ఆవిష్కరిస్తే తప్పేంటంటూ ఎదురు దాడి! దానికి, దీనికి పోలికేమైనా ఉందా? అసలు నూతన పార్లమెంటు ఇంకా ప్రారంభమే కాలేదు. అటువంటప్పుడు ఆ భవనంపై ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఇంత హడావిడిగా ఆవిష్కరించడం ఎందుకు? ప్రభుత్వాలు ఎటువంటి మత కార్యక్రమాల్లోనూ పాల్గొనడానికి కానీ, నిర్వహించడానికి కానీ వీలు లేదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతుంటే విగ్రహావిష్కరణ పేరుతో పూజలు చేయడమేంటి? ఈ తంతు ద్వారా దేశ ప్రజలకు ప్రధాని ఎటువంటి సందేశం ఇవ్వదల్చుకున్నారు? ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామంటూ చేసిన ప్రమాణం మోడీకి గుర్తుందా?
ఇక ప్రధాని ఆవిష్కరించిన విగ్రహాన్ని చూసి దిగ్భ్రాంతి చెందడం దేశ ప్రజల వంతైంది. ఇప్పటిదాకా ప్రజలు చూస్తున్న నాలుగు సింహాల జాతీయ చిహ్నానికి, ప్రధాని ఆవిష్కరించిన విగ్రహానికి ఎటువంటి పోలిక లేకపోవడమే దీనికి కారణం. క్రీ.పూ 250 ప్రాంతంలో సారనాథ్‌ వద్ద అశోక చక్రవర్తి నిర్మించిన స్థూపంలో ఉండే నాలుగు సింహాల గుర్తును జాతీయ చిహ్నంగా 1950లో ప్రకటించారు. ఈ స్థూపంలోనే ఉన్న చక్రాన్ని జాతీయ పతాకం మధ్యలో చేర్చారు. సారనాధ్‌ స్థూపంలోని సింహాలు ఠీవీగా, శాంతంగా, రాజసంతో ఉంటాయి. మోడీ ఆవిష్కరించిన సింహాలు దానికి పూర్తి భిన్నంగా పెద్దపెద్ద కోరలతో ఆగ్రహంగా, గర్జిస్తూ, దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సారనాథ్‌ లోని విగ్రహాలను చూడగానే ఒక గంభీరమైన భావం కలిగితే, మోడీ సింహాలు ప్రజల్లో భయోత్పాతం కలిగించేలా ఉన్నాయి. వీటిని చూసిన ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ 'జాతీయ చిహ్నం విషయంలో ఈ జోక్యం పూర్తిగా అవాంఛనీయం, అనవసరం. అశోక చక్రం పైన సింహాలు క్రూరంగా, కోపంగా కనిపించాలా?' అని ప్రశ్నించారంటే జాతీయ చిహ్నాన్ని ఏ స్థాయిలో మార్పు చేశారో అర్ధం చేసుకోవచ్చు. మోడీ ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన భారతానికి తగ్గట్టుగానే సింహాలు క్రూరంగా, దాడి చేసే విధంగా ఉన్నాయన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారీ విగ్రహాలను చాలానే కట్టింది. వాటిలోనూ రూపురేఖలు ఇలాగే మారి కనపడుతున్నాయా? లేదు కదా! అంటే మోడీ సింహాలను ఉద్దేశ్యపూర్వకంగానే రూపొందించారని స్పష్టమౌతోంది. ఈ తరహా ఏకపక్ష విధానాలను బిజెపి ప్రభుత్వం తక్షణం విడనాడాలి. ప్రధానిగా చేసిన ప్రమాణం మేరకు రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరించాలి.