
నిజానికి శామ్ బ్యాంక్‌మాన్ ఫ్రైడ్ నడుపుతున్నది ఒక తరహా చీటీ కంపెనీ వంటిదే. ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి వేరే మార్గాలకు ఆ సొమ్మును
మళ్ళించడం దాని సారాంశం.
చైనా ప్రభుత్వం కొంతకాలం క్రితమే క్రిప్టో కరెన్సీని నిషేధించింది. మన భారత ప్రభుత్వం కూడా క్రిప్టో కరెన్సీని నిషేధించే చట్టాన్ని తీసుకురానున్నట్టు
2021లో ప్రకటించింది. కాని ఇంతవరకూ తీసుకురాలేదు. అవినీతిపరుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న మక్కువ సంగతి అందరికీ తెలిసినదే.
ప్రభుత్వం ఏ విధంగానూ తన వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదని చెప్పిన క్రిప్టో వ్యాపారంలో దివాలా ఎత్తినప్పుడు మాత్రం ప్రభుత్వ జోక్యం కోరడం
ఆ సంస్థకు ఏ విధంగా సాధ్యం అవుతుంది? ప్రభుత్వం కూడా ఏ విధంగా జోక్యం చేసుకోగలుగుతుంది ?
ఎఫ్.టి.ఎక్స్ (ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్) నవంబర్ 11న మూతబడింది. ఎఫ్.టి.ఎక్స్ అతి పెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ గా ఉంది. చాలామంది ఈ పరిణామాన్ని 2008 ఆర్థిక సంక్షోభం కాలంలో జరిగిన లెV్‌ామాన్ బ్రదర్స్ (పెట్టుబడుల బ్యాంకింగ్ సంస్థ) పతనంతో సరిపోల్చుతున్నారు. అధికారిక ఆర్థిక వ్యవస్థలో ఆనాడు లెV్‌ామాన్ బ్రదర్స్ సంస్థ పతనానికి ఎంత ప్రాముఖ్యత ఉండిందో, ఇప్పుడు (అనధికారిక) క్రిప్టో కరెన్సీ వ్యవస్థలో అంతటి ప్రాముఖ్యత ఉందని వారు భావిస్తున్నారు. నిజానికి నవంబర్ 11 కన్నా మునుపే క్రిప్టో కరెన్సీ విలువలు చాలా పెద్ద స్థాయిలో పడిపోయాయి. 2021 చివరికి అన్ని రకాల క్రిప్టో కరెన్సీల మొత్తం విలువ రెండు లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. 2022 సెప్టెంబర్ వచ్చేసరికి అది కాస్తా సగానికి సగం పడిపోయింది. ఇప్పుడు తాజాగా ఎఫ్‌టిఎక్స్ పతనం మొత్తం వ్యవస్థని మరింతగా దెబ్బ తీయనుంది.
శామ్ బ్యాంక్‌మాన్ ఫ్రైడ్ అనే ఎంఐటి విద్యార్ధి (మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) 2019లో ఈ ఎఫ్.టి.ఎక్స్ ను స్థాపించాడు. అందులో ఒక తరహా క్రిప్టో కరెన్సీని ఇంకో క్రిప్టో కరెన్సీతో మార్పిడి చేసుకోవడం, క్రిప్టో కరెన్సీని గ్యారంటీ పత్రాలతో మార్పిడి చేసుకోవడం (ఫియట్ మనీ) వంటివి చేపట్టారు. అంతే కాక ఎఫ్.టి.టి అనే తమ స్వంత క్రిప్టో కరెన్సీని జారీ చేయడం, క్రిప్టో కరెన్సీతో ఫ్యూచర్లు, డెరివేటివ్‌ల వంటి స్టాక్ ఆధారిత లావాదేవీలను నిర్వహించడం వంటి కార్యకలాపాలు కూడా చేపట్టారు. ఆ విధంగా చాలా విధాలుగా ఆ సంస్థ బ్యాంక్ మాదిరిగా వ్యవహరించింది. డాలర్లు గాని, యూరోలు గాని అక్కడ జమ చేస్తే భవిష్యత్తులో ఎక్కువ మొత్తాలను చెల్లిస్తామన్న హామీతో లావాదేవీలు చేపట్టారు. దాంతో ఈ సంస్థను స్థాపించిన మూడేళ్ళలోనే ప్రపంచంలో అయిదవ అతి పెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌గా ఎదిగింది. సమకూర్చుకున్న సంపద ప్రకారం రెండవ అతి పెద్ద క్రిప్టో సంస్థగా తయారైంది.
ఇంత అసాధారణ రీతిలో ఎదగడానికి వెనుక ఆ సంస్థ చేసిన అనేక రకాల ప్రయత్నాలు ఉన్నాయి. డెమాక్రటిక్ పార్టీకి అతి పెద్ద మొత్తంలో (ఒక్క జార్జ్ సోరోస్ విరాళమే అంతకన్నా ఎక్కువ) విరాళం ఇచ్చింది. పలు క్రీడా కార్యక్రమాలను స్పాన్సర్ చేసింది. షాకిల్ ఒ నీల్ (ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు), నోమీ ఒసాకా (ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి) లతో కార్యక్రమాలు నిర్వహించింది. ''ఉక్రెయిన్ సహాయ నిధి'' పేరుతో క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలను స్వీకరించింది. ఆ విరాళాలు అనంతర కాలంలో కీవ్ (ఉక్రెయిన్ రాజధాని) లోని నేషనల్ బ్యాంక్‌లో గ్యారంటీల రూపంలోకి మార్చడం జరుగుతుందన్న హామీ ఇచ్చింది.
ఎంత నాటకీయంగా ఎదిగిందో, అంతే నాటకీయంగా ఈ ఎఫ్.టి.ఎక్స్ పతనం చెందింది. శామ్ బ్యాంక్‌మాన్ ఫ్రైడ్ యజమానిగా ఉన్న ఆలమెదా అనే సంస్థ ఎఫ్.టి.ఎక్స్ సంస్థ విడుదల చేసిన ఎఫ్‌టిటి అనే క్రిప్టో కరెన్సీని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసింది. ఈ ఆలమెదా బ్యాలెన్స్ షీట్ వివరాలు బైటకు పొక్కడంతో ఆ ఎఫ్.టి.టి విలువ పెద్దగా పడిపోనున్నది అన్న భయాందోళన మార్కెట్ లో కలిగింది. ఎఫ్.టి.ఎక్స్ కి పోటీదారుగా ఉన్న బైనాన్స్ అనే మరో క్రిప్టో కరెన్సీ నిర్వాహక సంస్థ తనవద్ద ఉన్న ఎఫ్.టి.టి నిల్వలను ఈ భయాందోళనల కారణంగా అమ్మడం మొదలెట్టింది. దాంతో అసలు పతనం మొదలైంది. ఒక బ్యాంక్ విషయంలో ఏ విధంగా పతనం సంభవిస్తుందో, అదే విధంగా ఇక్కడా జరిగింది. పతనం వెనుక కారణం కూడా ఒకేమాదిరిగా ఉంది. ఎఫ్.టి.టి ల విలువ పడిపోకుండా నిలబెట్టాలంటే వాటిని ఎఫ్.టి.ఎక్స్ స్వయంగా కొనుగోలు చేయాల్సి వుంటుంది. అలా కొనుగోలు చేయడానికి తనవద్ద ఉండే రిజర్వు ఆస్తులను అమ్మాల్సి వుంటుంది. ఆ విధమైన రిజర్వు ఆస్తులు తగిన మోతాదులో ఎఫ్.టి.ఎక్స్ వద్ద లేవు. నిజానికి శామ్ బ్యాంక్‌మాన్ ఫ్రైడ్ నడుపుతున్నది ఒక తరహా చీటీ కంపెనీ వంటిదే. ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి వేరే మార్గాలకు ఆ సొమ్మును మళ్ళించడం దాని సారాంశం.
ఎఫ్.టి.ఎక్స్ కు పోటీదారుడైన బైనాన్స్ తొలుత ఎఫ్.టి.ఎక్స్ ను కొనివేయాలనే అనుకుంది. కాని, తర్వాత వెనక్కి తగ్గింది. ఇక ఎఫ్.టి.ఎక్స్ ను పతనం నుండి కాపాడడానికి జోక్యం చేసుకోమని (2008 సంక్షోభంలో అమెరికన్ ప్రభుత్వం ప్రకటించిన బెయిల్ అవుట్ ప్యాకేజి మాదిరిగా) జో బైడెన్ ను కోరడం ఈ సందర్భంలో సాధ్యం కాదు. ఎందుకంటే అసలు క్రిప్టో కరెన్సీ రంగం మీదకు వచ్చిందే ప్రభుత్వం జోక్యం గాని, అదుపు గాని ఆర్థిక లావాదేవీలపై ఉండకూడదనే వాదనతో కదా. దాంతో ఇక ఎఫ్.టి.ఎక్స్ దివాలా ఎత్తిందని ప్రకటించడం వినా వేరే మార్గం లేకపోయింది. శామ్‌బ్యాంక్‌మాన్ ఫ్రైడ్ నవంబర్ 11న చేసిందదే.
లెహ్మాన్ బ్రదర్స్ ఉదంతానికి, ఎఫ్.టి.ఎక్స్ వ్యవహారా నికి ఉన్న పోలిక సరిగ్గా ఇక్కడే ఆగిపోతుంది. గృహ నిర్మాణ రంగంలో వృద్ధి నిరంతరం కొనసాగుతుందన్న అతి అంచనా లు, మరోపక్క గృహ రుణాల పారు బకాయిలను కప్పిపుచ్చే విధంగా సాగిన స్టాక్ లావాదేవీలు అమెరికాలో ''హౌసింగ్ బబుల్'' పెరగడానికి, ఆ తర్వాత అది పేలిపోడానికి కారణమ య్యాయి. ఆ హౌసింగ్ రుణాల స్టాక్ లలో పెట్టుబడులు పెట్టిన లెV్‌ామాన్ బ్రదర్స్ పతనానికి అది దారి తీసింది. అటువంటి స్టాక్ లలో లెహ్మాన్ బ్రదర్స్ సంస్థ ఏ బాధ్యతా లేకుండా అజాగ్రత్తగా పెట్టుబడులు పెట్టిందని అనుకోడానికి లేదు. ఎందుకంటే పారుబకాయిలలో ఏవి తిరిగి వస్తాయో, ఏవి రావో తెలుసుకోవడం కష్టం. అన్నింటినీ కలగలిపి స్టాక్ లు గా మార్కెట్ లో విడుదల చేయడమే దానికి కారణం.
ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనం వ్యవస్థలో తలెత్తిన లోపం అని ఆ తర్వాత ఉదారవాద ఆర్థికవేత్తలు చెప్పబూనుకున్నారు. అంటే భవిష్యత్తులో ఆ విధంగా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించినట్టు అనుకోవాలి. కాని అసలు విషయాన్ని వారు కప్పిపుచ్చడానికే ఆ విధంగా చెప్పారు. నిజానికి నయా ఉదారవాద వ్యవస్థలో పెట్టుబడిదారీ విధానం ఆ తప్పుడు పాలసీని అనుసరించబట్టే ఆర్థిక రంగంలో ఒక ఊపును తీసుకు వచ్చింది (రియల్ ఎస్టేట్ లో ఆస్తుల విలువను కృత్రిమంగా పెంచడం) అంటే లెహ్మాన్ బ్రదర్స్ పతనం నయా ఉదారవాద విధానం అమలులో అంతర్భాగమే.
క్రిప్టో కరెన్సీ వ్యవహారం మాత్రం నయా ఉదారవాద విధాన వ్యూహంలో అంతర్భాగం కాదు. అది ఆ విధానానికి వెలుపల నుంచి వచ్చి తగులుకున్న ఒక వ్యవహారం. అందుచేత ఇప్పుడు క్రిప్టో కరెన్సీ లేకుండా పోతే నయా ఉదారవాద విధానానికి వచ్చే నష్టం ఏమీ లేదు. లెV్‌ామాన్ బ్రదర్స్ పతనం మాదిరిగా ఇది నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులను కుదిపివేయదు. క్రిప్టో కరెన్సీ అనేది ప్రభుత్వం ప్రమేయం లేకుండా మార్కెట్ లోకి వచ్చిన ఒక సరుకు లాంటిది. నిజానికి ప్రభుత్వ జోక్యం ఏమీ లేకుండా ఉండడమే దానికి ఆ ఆకర్షణ తీసుకొచ్చింది. చట్టానికి దొరకకుండా సాగే పలు లావాదేవీలకు ప్రభుత్వ జోక్యం ఒక అవరోధం. ఈ క్రిప్టో వ్యవహారం జోలికి ప్రభుత్వం రాదు. నిజానికి ఆలమెదా అనే ఒక సంస్థ ఉన్నట్టు, దానికి శామ్‌బ్యాంక్‌మాన్ అధిపతిగా ఉన్నట్టు ఎఫ్.టి.టి లను కొనుగోలు చేసిన చాలామందికి తెలియనే తెలియదు. ఎఫ్.టి.ఎక్స్ అకౌంట్లను కూడా చాలాకాలం ఆడిట్ చేయడం జరగలేదు. అందుకే శామ్ బ్యాంక్‌మాన్ ఆటలు అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతూ వచ్చాయి. ఆలమెదా సంస్థ బ్యాలెన్స్ షీట్ వివరాలు బైటకు పొక్కడంతో వ్యవహారం బైటపడింది.
పెట్టుబడిదారీ వ్యవస్థ చట్రానికి వెలుపల, ఆ వ్యవస్థ నియంత్రణ లేకుండా సాగే చీకటి వ్యాపారంలో ఒక అంతర్భాగమే ఈ క్రిప్టో కరెన్సీ వ్యవహారం. ఈ చీకటి వ్యవహారాల నుండి పెట్టుబడిదారులు వ్యక్తిగతంగా చాలా ప్రయోజనాలు పొందుతూ వుంటారు. తమ తమ తప్పుడు వ్యవహారాలకు కావలసిన నిధులను ఈ చీకటి వ్యాపారం నుండే సమకూర్చుతూవుంటారు. అయితే, ఈ చీకటి లావాదేవీలు పెట్టుబడిదారీ విధానంతో విడదీయలేనంతగా పెనవేసుకుపోయిందని భావించకూడదు. ఇటువంటి చీకటి వ్యవహారాలతో ముడిపడి వున్నందువల్లనే పెట్టుబడిదారీ విధానం చెడిపోయిందని, ఇటువంటి వ్యవహారాలు లేకుండా పోతే అంతా సవ్యంగానే నడుస్తుందని అనుకోవడం తప్పు. మార్క్స్ చెప్పినట్టు పెట్టుబడిదారీ విధానమే అక్రమ ప్రాతిపదికన ఏర్పడిన వ్యవస్థ.
ఎఫ్.టి.ఎక్స్ దివాలా ఎత్తినట్టు ప్రకటించాక అమెరికన్ ప్రభుత్వం దానిని ఆదుకోడానికి ఎటువంటి చర్యలనూ ప్రకటించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించదు. గతంలో లెV్‌ామాన్ బ్రదర్స్ పతనం అయినప్పుడు ఒబామా ప్రభుత్వం ఏకంగా 13 లక్షల కోట్ల డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటించింది. ఇప్పుడు ఆ విధంగా జరగలేదు. ప్రభుత్వం ఏ విధంగానూ తన వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదని చెప్పిన క్రిప్టో వ్యాపారంలో దివాలా ఎత్తినప్పుడు మాత్రం ప్రభుత్వ జోక్యం కోరడం ఆ సంస్థకు ఏ విధంగా సాధ్యం అవుతుంది? ప్రభుత్వం కూడా ఏ విధంగా జోక్యం చేసుకోగలుగుతుంది? అధికార పార్టీకి భారీ విరాళాలను ఇచ్చినంతమాత్రాన జోక్యం చేసుకోడం సాధ్యమేనా?
నిజానికి ఇటువంటి మోసపూరిత లావాదేవీలే ఆ చీకటి వ్యాపారం పట్ల ఆకర్షణ... లెహ్మాన్ బ్రదర్స్ పతనం నయా ఉదారవాద విధానం అనుసరించే వ్యూహంలో అంతర్భాగం. అదే ఎఫ్.టి.ఎక్స్ దివాలా తీయడం అక్రమ పద్ధతులలో నడిచే ఒక చీకటి వ్యాపారంలో జరిగిన మోసం. అదే ఆ వ్యాపారం పట్ల ఆకర్షణ కలగడానికి కారణం.
''ఉక్రెయిన్ సహాయ నిధి'' పేర ఎఫ్.టి.ఎక్స్ సేకరించిన నిధులలో వాస్తవంగా ఎంత భాగం ఉక్రెయిన్ కు చేరిందో, ఆ నిధిని స్థాపించిన అసలు లక్ష్యం కోసం ఖర్చు జరిగిందో, లేదో తెలియాలని ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏ విధమైన పారదర్శకతా లేకుండా, ఏ విధమైన జవాబుదారీ తనమూ లేకుండా సాగిన ఈ వ్యవహారం గురించి ముక్కలు ముక్కలుగా అక్కడక్కడా తెలిసిన మేరకు సమాచారం వెబ్ పేజీలలో కనిపిస్తూవుంది. ఇంకా ఇటువంటి ప్రశ్నలు ఇకముందూ రాకమానవు. నిజానికి ఆ ఉక్రెయిన్ ప్రభుత్వం ఎటువంటి శక్తుల ఆధ్వర్యంలో నడుస్తోందో, దానిని సమర్ధించే పశ్చిమ దేశాల మద్దతుదారుల స్వభావం ఏమిటో, ఎఫ్.టి.ఎక్స్ వంటి అక్రమ సంస్థలు ఉక్రెయిన్‌కు సహాయం చేయాలనే పేరుతో నిధులు సేకరించడానికి ఆ పశ్చిమదేశాల ప్రభుత్వాలు ఎందుకు అనుమతించాయో ఊహించుకోవచ్చు.
ఎఫ్.టి.ఎక్స్ పతనం క్రిప్టో కరెన్సీ వ్యవస్థ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసింది. ఎఫ్.టి.ఎక్స్ పతనం వలన చాలామంది నష్టపోయి వుంటారు. కాని అంతమాత్రాన్నే మొత్తం క్రిప్టో కరెన్సీ వ్యవస్థే అంతరించిపోతుందని అనుకోవద్దు. ఈ ఉదంతం తర్వాత ప్రభుత్వాలు ఏ విధమైన పాలసీని క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో చేపడతాయో చూడాల్సివుంది. చైనా ప్రభుత్వం కొంతకాలం క్రితమే క్రిప్టో కరెన్సీని నిషేధించింది. మన భారత ప్రభుత్వం కూడా క్రిప్టో కరెన్సీని నిషేధించే చట్టాన్ని తీసుకురానున్నట్టు 2021లో ప్రకటించింది. కాని ఇంతవరకూ తీసుకురాలేదు. అవినీతిపరుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న మక్కువ సంగతి అందరికీ తెలిసినదే. బ్యాంకు అప్పుల్ని ఎగ్గొట్టిన ప్రైవేటు వ్యక్తులను ఏ విధంగా క్షమించిందో మనం చూశాం. అందుచేత క్రిప్టో కరెన్సీని నిషేధించే చట్టాన్ని తీసుకువస్తుందా అన్నది అనుమానమే. ఆ అనుమానమే గనుక నిజం అయితే అంతకన్నా బాధాకరమైనది ఇంకొకటి ఉండబోదు.
( స్వేచ్ఛానువాదం)
ప్రభాత్ పట్నాయక్