Jan 06,2023 07:15

పేదలు సంపన్నుల భూముల జోలికి వెళ్లకుండా, ప్రజా ఉద్యమాలు రాకుండా ఉండడానికే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ముందుకు తెచ్చి పేదలను మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్నాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా పేదలు భూమి కోసం తిరగబడితే తాత్కాలికంగా పేదలకు భూపంపిణీ చేస్తామని చెప్పి ఉద్యమాలను పక్క దారి పట్టిస్తాయి. గతంలో 2007 -08 ఉవ్వెత్తున భూపోరాటాలు జరిగిన సమయంలో రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వ హయంలో జరిగింది అదే. నేడు ధర్మాన నాయకత్వంలో వేసిన అసైన్డ్‌ భూముల కమిటీ కూడా పేదల్ని పక్కదారి పట్టించి పెత్తందార్లు భూములను కొల్లగొట్టడానికే తప్ప మరొకటి కాదు.

             అసైన్డ్‌ భూములపై ప్రక్క రాష్ట్రాల్లో ఎటువంటి విధానాలు అమలవుతున్నాయో అధ్యయనం చేయడానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏడుగురు ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ వేసిన తీరు ఎలా ఉందంటే '' తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ మేత కోసం అన్నాడట వెనకటికి ఎవడో'' అలా ఉంది. స్వాతంత్య్రం అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 57 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు పేదలకిచ్చినట్లు ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. పేదలకిచ్చిన భూముల్లో అందులో దళితుల భూములు ఎక్కువ శాతం అనర్హుల చేతుల్లోకి వెళుతున్నట్లు గమనించిన ఆనాటి సాంఘిక సంక్షేమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్వర్గీయ ఎస్‌.ఆర్‌ శంకరన్‌ ఎలాగైనా పేదలకిచ్చిన భూముల్ని రక్షించాలనే ఉద్దేశ్యంతో 1977లో ఆనాడు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అసైన్డ్‌ భూముల రక్షణ కోసం 9/77 చట్టాన్ని తీసుకువచ్చారు. (పిఓటి యాక్ట్‌ అంటే ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్ట్‌ ) భూ బదలాయింపు నిషేధ చట్టం. ఈ చట్టం ప్రకారం ఏ ప్రభుత్వమైనా.. పేదలకు భూములు ఇస్తే ఆ భూములు అమ్మకూడదు, ఇతరులు కొనకూడదు. ఒకవేళ తెలిసో, తెలియకో లేదా అప్పుల జమ కోసం ఒక పేదవాడు ఆ భూమిని అమ్మినా లేదా పెత్తందార్లు ఆ భూమిని బలవంతంగా గానీ డబ్బు ఆశ చూపి గానీ లేదా రాజకీయ పలుకుబడి కల్గిన వారు బినామీ పేర్లతో ఉదా: దళిత రామయ్య పేరుతో భూమికి పట్టా తీసుకొని ఆ భూమిని అక్రమంగా అనుభవిస్తున్నా ఆ భూమి కల్గిన దళితుడు తిరిగి నా భూమిని నాకే కావాలని అర్జీ పెడితే అసైన్డ్‌ చట్టం ప్రకారం తిరిగి ఆ భూమి ఆ దళితుడికి ఇవ్వాలి. ఒకవేళ అక్రమంగా, దౌర్జన్యంగా అనర్హులు ఆ భూమిని అనుభవిస్తే అసైన్డ్‌ చట్టం సెక్షన్‌ 6 ప్రకారం ఆరు నెలలు జైలు శిక్షా, రెండు వేలు జరిమానా విధించాలని అసైన్డ్‌ చట్టం చెబుతోంది. అంతేకాకుండా ఈ భూములు రిజిస్ట్రేషన్‌ చేయరాదు. ఐదు ఎకరాలు మెట్ట, రెండున్నర ఎకరాల మాగాణి పైబడిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు అసైన్డ్‌ భూములు పొందడానికి అనర్హులని చట్టం స్పష్టంగా పేర్కొన్నది.
                చట్టం ఇంత పకడ్బందీగా ఉన్నా అనర్హులు, పలుకుబడి కల్గిన వారు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున అసైన్డ్‌ భూములను అనుభవిస్తున్నట్లు తేలింది. ఈ అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములను, పేదలకు భూ పంపిణీ కోసం ఉమ్మడి రాష్ట్రంలో భూమి అందుబాటులో ఉందా? లేదా? అని అధ్యయనం చేయడానికే 2005లో వామపక్ష పార్టీల ఒత్తిడితో ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కోనేరు రంగారావు నేతృత్వంలో ఐఎఎస్‌ అధికారులు, మేధావులతో భూ కమిటీ వేసింది. ఈ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి 104 సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సుల్లో 92 సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అందులో ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 25లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు కమిటీ చెప్పింది. ఆ అసైన్డ్‌మెంట్‌ భూములు తిరిగి ఆ పేదలకే ఇవ్వాలని సిఫార్సు చేస్తే 2006లో అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సందర్భంలోనే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 'మా నాన్న తెలిసో, తెలియకో 300 ఎకరాల అసైన్డ్‌ భూములను ఇడుపులపాయలో కొన్నారు. కాబట్టి ఈ భూమిని వెంటనే పేదలకే తిరిగి ఇస్తానని' నిండు సభలో చెప్పారు. అంతేగాకుండా రానున్న ఆరు నెలల లోపు ఈ రాష్ట్రంలో తెలిసో, తెలియకో ఎవరైనా అక్రమంగా అనుభవిస్తుంటే తిరిగి పేదలకిస్తే ఎవ్వరిపైనా ఎటువంటి కేసులు గాని, చర్యలు గాని ఉండవని హామీ ఇచ్చారు. ఈ స్ఫూర్తితో కొంతమంది అక్కడక్కడ తిరిగి పేదలకు ఇచ్చినట్లు కూడా ఆ నాడు వార్తలు వచ్చాయి. అదే అసైన్డ్‌ చట్టం నేటికీ అమలు జరుగుతుంది. ఈ స్ఫూర్తితోనా? లేదా రాజకీయ కక్ష సాధింపుతోనా? ఏమో తెలియదు గాని అమరావతి రాజధాని ప్రాంతంలో సుమారుగా రెండు వేల ఎకరాలు అసైన్డ్‌ భూమి అన్యాక్రాంతమైంది. తిరిగి ఆ భూమిని ఆ దళితులకు ఇస్తామని 2020లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైందో? తెలియదు. అసైన్డ్‌మెంట్‌ చట్టం ఇంత పకడ్బందీగా ఉన్నా పేదల చేతుల్లో సారెడు భూమి లేకుండా పోతుంది. అయినా రాష్ట్రంలో పెద్దఎత్తున నేటికి అసైన్డ్‌ భూములు అనర్హుల చేతుల్లో ఉన్నాయి. ఆ భూములకు పెద్దఎత్తున విలువ పెరిగిన తర్వాత ఆ భూములను ఎలాగైనా కాజేయాలని చూస్తున్నారు. దీనికి అసైన్డ్‌ చట్టం అడ్డు వస్తుంది. కాబట్టి దీని అడ్డు తొలగించడానికి దీనిని పీక నొక్కడానికే ధర్మాన నాయకత్వంలో కమిటీ వేశారు. ఈ కమిటీ వల్ల అనర్హులకు భూములు కట్టబెట్టడానికి తప్ప దళితులకు ఒనగూడే ప్రయోజనం ఏమి లేదు.
స్వాతంత్య్రం ముందు, తర్వాత వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు ''దున్నే వానికే భూమి'' అనే నినాదంతో అనేక భూ పోరాటాలు చేశాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, బెంగాల్‌లో తెబాగ పోరాటం, కేరళలో ఉన్న ప్రావాయులర్‌ పోరాటం, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసులు భూమి కోసం చేసిన పోరాటాలు చెప్పుకోదగ్గవి. వేలాది మంది రక్త తర్పణంతో దేశంలో పాలిస్తున్న ప్రభుత్వాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా పేదలకు భూపంపిణీ కోసం కొన్ని చట్టాలు చేశారు. అందులో 1950, 56 కౌల్దారి హక్కుల చట్టం, 1973 భూ సీలింగ్‌ చట్టం, 1977లో అసైన్డ్‌ చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలన్నీ నేటికి అమలులోనే ఉన్నాయి. చట్టాలు ఉన్న వారికి చుట్టాలన్నట్లు.. ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదలకు సంపూర్ణ భూ పంపిణీ నేటికి జరగలేదు. కాబట్టే 40శాతం భూమి కేవలం 5% మంది సంపన్నుల చేతుల్లో ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఏ చట్టమూ భూస్వాముల జోలికి వెళ్లలేకపోయింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా నేటికి భూసమస్య పరిష్కారం కాలేదు. రాష్ట్రంలో 60% మంది చేతిలో సారెడు భూమి లేక రెక్కలనమ్ముకొని జీవిస్తున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 8 దశాబ్ధాలు కావస్తున్నా...పొట్ట కూటికోసం పేదలు వెంపర్లాడక తప్పడం లేదు. అందుకే ప్రసిద్ధ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్థ్యసేన్‌ చెప్పినట్లు ఎక్కడ భూ సమస్య పరిష్కారం కాదో అక్కడంతా పేదరికం, దారిద్య్రం, ఆకలి చావులు కొనసాగుతూనే ఉంటాయి. వ్యవసాయ రంగమే ప్రధాన వనరుగా ఉన్న మనలాంటి దేశంలో భూసమస్య పరిష్కారం కానిదే పేదల కొనుగోలు శక్తి పెరగదు. అంతిమంగా పారిశ్రామిక అభివృద్ధి జరగక నిరుద్యోగ సమస్య కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. నేటికి ఇది అక్షర సత్యంగానే ఉంది.
          పేదలు సంపన్నుల భూముల జోలికి వెళ్లకుండా, ప్రజా ఉద్యమాలు రాకుండా ఉండడానికే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ముందుకు తెచ్చి పేదలను మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్నాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా పేదలు భూమి కోసం తిరగబడితే తాత్కాలికంగా పేదలకు భూపంపిణీ చేస్తామని చెప్పి ఉద్యమాలను పక్క దారి పట్టిస్తాయి. గతంలో 2007 -08 ఉవ్వెత్తున భూపోరాటాలు జరిగిన సమయంలో రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వ హయంలో జరిగింది అదే. నేడు ధర్మాన నాయకత్వంలో వేసిన అసైన్డ్‌ భూముల కమిటీ కూడా పేదల్ని పక్కదారి పట్టించి పెత్తందార్లు భూములను కొల్లగొట్టడానికే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే గడిచిన 7 దశాబ్ధాలుగా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 25లక్షల ఎకరాల భూమి అనర్హుల చేతుల్లోకి వెళ్ళినట్లు కోనేరు రంగారావు భూ కమిటీ చెప్పింది. ఇది కాక రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం వచ్చిన తర్వాత 1973 భూసీలింగ్‌ చట్టాన్ని అమలు చేస్తే మరో 12 లక్షల ఎకరాలు మిగులుగా తేలుతుంది ..ఇది కాక మరో 40లక్షల ఎకరాలు వివిధ రకాల ప్రభుత్వ భూములున్నట్లు కమిటీ తేల్చింది. వీటిన్నింటిని సమీకరించి ఈ రాష్ట్రంలో భూమిలేని ప్రతి కుటుంబానికి భూ పంపిణీ చేయొచ్చని కోనేరు రంగారావు భూ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ సిఫార్సులను అమలు చేస్తామని ఆనాటి ప్రభుత్వం అంగీకరించింది. అందులో భాగంగానే ఆరు విడతల్లో సుమారు 8 లక్షల ఎకరాలు భూపంపిణీ చేసినట్లు చెప్పారు. కానీ కోనేరు రంగారావుతో పాటు సిఫార్సులు కూడా కోనేటిలో కలిసిపోయాయి.
           నేటి ప్రభుత్వం కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను బూజు దులిపి బయటికి తీసి అమలు చేయాల్సింది పోయి ధర్మాన కమిటీని ముందుకు తెచ్చారు. ఈ కమిటీ అన్ని భూములను పక్కకు పెట్టి కేవలం అసైన్డ్‌ భూములనే అధ్యయనం చేయాలని ప్రభుత్వం చెప్పడం వెనుక ఉన్న రహస్యమేమిటి? ఇతర రాష్ట్రాలు తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు వెళ్లి ఏమి అధ్యయనం చేస్తుంది. వీటన్నింటికీ సవాలక్ష అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటికి సమాధానం ఒక్కటే. ఈ రాష్ట్రంలో నీటి వనరులు పెరగడం, వివిధ రకాల ప్రాజెక్టులు వచ్చి భూముల విలువ పెరిగిన తర్వాత దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల చేతిలో ఉన్న అసైన్డ్‌ భూములలో ఎక్కువ శాతం పెద్దల చేతుల్లోకి వెళ్లి పోయాయి. పేదలను అదిరించి, బెదిరించి వంద, రెండు వందలు ఇచ్చి పేదల భూములను పెద్దలు అక్రమంగా, దౌర్జన్యంగా అనుభవిస్తున్నారు. నేడు రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో యంత్రాలు ప్రవేశించడం, ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు రావడం, చదువుకున్న యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో గత్యంతరం లేని పేదలు ముఖ్యంగా యువతలో మా భూములు మాకు కావాలన్న కాంక్ష పెరిగింది. వీరి కోరిక ప్రకారం 1977 అసైన్డ్‌ చట్టం ప్రకారం పెద్దల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములు తిరిగి పేదలకు ఇవ్వాలి. అంతే కాదు అక్రమంగా అనుభవిస్తున్న వారి పై కేసులు బనాయించి, ఆరు నెలలు జైలు శిక్ష విధించాలని అసైన్డ్‌ చట్టం చెబుతుంది. అందుకే యధాప్రకారంగా అసైన్డ్‌ చట్టం అమలు చేస్తే అక్రమంగా అనుభవిస్తున్న వారి భూములన్నీ వెనక్కి వెళ్లి పోతాయని, ఎలాగైనా పేదల భూములను పెద్దలకు కట్టబెట్టడానికి, అసైన్డ్‌ చట్టం పీక నొక్కడానికే ధర్మాన నాయకత్వంలో కమిటీ తప్ప మరొకటి కాదు. దీనికి పై ఎత్తులు వేసిన వైసిపి ప్రభుత్వం ముల్లును ముల్లుతోనే తీయాలనే చందంగా దళితులు, గిరిజనుల పేరుతో గెలిచిన దళిత, గిరిజన శాసనసభ్యులను కమిటీలో పెట్టి వారితోనే ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నది.
ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అసైన్డ్‌ భూములు అనర్హులు, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లి పోయాయి. కమిటీలో నాయకత్వం వహిస్తున్న ధర్మాన ప్రసాదరావే వందలాది ఎకరాలు ఆక్రమించుకున్నట్లు ప్రభుత్వం నియమించిన సిట్‌ కమిటీయే చెప్పింది. అదే విధంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి, మురికిపాడు గ్రామాల్లో సుమారు 500 ఎకరాలు ముఖ్య మంత్రి బంధువులు అక్రమంగా కొనుగోలు చేసి మైనింగ్‌ తవ్వుతున్నారు. ఈ భూములపై గౌరవ హైకోర్టు కూడా అధికారులకు నోటీసులిచ్చింది. ఏలూరు జిల్లా దోశపాడు లో సుమారు 224 ఎకరాల అసైన్డ్‌ భూమిని ప్రధాన పార్టీల నాయకులు ఆక్రమించి చేపల చెరువులు తవ్వుకొని అక్రమంగా అనుభవిస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రంలో లక్షలాది ఎకరాల అసైన్డ్‌ భూమిని పెద్దలు, అక్రమంగా కొనుగోలు చేయడం, ఆక్రమించుకోవడం జరిగింది.ఈ భూములన్నీ సొమ్ము చేసుకోవాలంటే 9/77 చట్టం ఆటంకంగా ఉంది. కాబట్టి పేదల పేరు చెప్పి వారికి మేలు జరిగేలా ఈ చట్టంలో మార్పులు తేవాలని చెప్పడం పచ్చి అబద్ధం, మోసం. పేదలకు మేలు జరగాలంటే కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములను తిరిగి పేదలకు ఇవ్వాలి. 1973 భూ సీలింగ్‌ చట్టం ప్రకారం భూ వర్గీకరణ చేసి మిగులు భూములను పేదలకు పంచాలి. అప్పుడే ధర్మాన ప్రసాదరావు చెప్పినట్లు ప్రజలకు మేలు జరిగి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.

-రచయిత - వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫోన్‌: 94900 98980
వి వెంకటేశ్వర్లు

వి వెంకటేశ్వర్లు