
పౌరుల బాధ్యత, పారదర్శకతలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించబడిన యాప్... ఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులు, కార్యకర్తలు, ప్రభుత్వ ఫీల్డ్ అధికారులతో చర్చించకుండానే అమలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఎన్‌ఆర్‌ఇజిఎ వాస్తవ పని తీరు పట్ల ఎన్‌ఎంఎంఎస్ చాలా గుడ్డిగా వ్యవహరిస్తున్నది. భాగస్వాములతో ఎలాంటి చర్చలు చేయకుండా సంస్కరణలను ప్రవేశపెట్టే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అలవాటు... ఎన్‌ఆర్‌ఇజిఎ లో పొందుపరిచిన పారదర్శకత, పౌర భాగస్వామ్య సూత్రాలకు అనుగుణంగా లేదు. ఎన్‌ఎంఎంఎస్ అమలులో ఏర్పడుతున్న అనేక సమస్యల వల్ల ఎన్‌ఆర్‌ఇజిఎ కింద పని చేయడం కార్మికులకు కష్టంగా తయారైంది. ఫలితంగా కార్మికులు పని చేసే హక్కును కోల్పోతున్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పని చేస్తున్న కార్మికుల హాజరును ఈ జనవరి 1 నుండి డిజిటల్ పద్ధతిలో నమోదు చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించింది. పౌర బాధ్యత, పారదర్శకత పేరుతో 2021 మే లోనే ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్టు) నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్‌ఎంఎంఎస్) యాప్ ద్వారా హాజరు నమోదును ప్రారంభించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్‌ఆర్‌ఇజిఎ) అమలులో పర్యవేక్షణ బాధ్యతను మెరుగుపరిచే, పారదర్శకతను పెంచే లక్ష్యంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ యాప్‌ను ప్రారంభించింది. ఉపాధి పని ప్రదేశాలను పర్యవేక్షించడానికి పంచాయతీ స్థాయిలో ఎంపిక చేయబడి, శిక్షణ పొందిన స్థానిక మహిళలతో పాటు ఎన్‌ఆర్‌ఇజిఎ మేట్లు ఈ హాజరు నమోదు ప్రక్రియను అమలు చేయాలి. ప్రతీ కార్మికుడి హాజరుతో పాటు పని చేస్తున్న ఫోటో, పనికి హాజరైన వాస్తవ సమయాన్ని తీసుకోవడం ఈ యాప్ లక్ష్యం. దీనికి సంబంధించి అనేక రాష్ట్రాల ఉపాధి హామీ కార్మికులు, మేట్లు, ఇతర కార్యకర్తలతో మాట్లాడాం.
స్థిరమైన పని సమయాలున్న కార్మికుల హాజరును పర్యవేక్షించేందుకు ఈ యాప్ ఉపయోపడుతుంది. అయితే అనేక రాష్ట్రాల్లో ఉపాధి హామీ పనుల వేతనాలను ప్రతి రోజు చేసిన పని ఆధారంగా లెక్క కడతారు. కార్మికులు స్థిరమైన పని గంటలకు కట్టుబడి ఉండనవసరం లేదు. ఈ వెసులుబాటు వల్లే ఉపాధి హామీ పథకం పనికి డిమాండ్ బాగా వుంటోంది. కానీ ఈ యాప్ ద్వారా హాజరు నమోదు చేయడంవల్ల...కార్మికులు రోజంతా పని ప్రదేశంలో అనివార్యంగా ఉండాల్సి వస్తున్నది. ఇది ఉపాధి కూలీల ఇబ్బందులకు కారణమవుతుంది.
రాజస్థాన్‌కు చెందిన ప్రియాదేవి తన ఉపాధి హామీ పనిని ఉదయం 9 గంటల కల్లా పూర్తిచేసి, తన తోటలో పండించిన ఉత్పత్తులను స్థానిక మార్కెట్లో అమ్ముతుంది. ఎన్‌ఎంఎంఎస్ యాప్ ప్రవేశపెట్టడం వల్ల ఆమె పని ప్రదేశంలో రోజంతా ఉండాల్సి వస్తుంది. లేదా తన హాజరు నమోదు కోసం పని ప్రదేశాలకు రెండుసార్లు వెళ్ళాల్సి వస్తుంది. ఆ సమయంలో బేరాలను కోల్పోవాల్సి వస్తుందని బాధను వ్యక్తం చేసింది. తాను చెయ్యాల్సిన ఇంటి పనులన్నీ తన కూతురు మీద పడడంతో ఆమె తరచుగా పాఠశాలకు డుమ్మా కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధి హామీ కూలీ ఒకామె తెలిపింది.
ఎన్‌ఆర్‌ఇజిఎ కింద పని చేసే మహిళా కూలీల సంఖ్య చాలా ఎక్కువగా (2021-2022 ఆర్థిక సంవత్సరంలో 54.7 శాతం) ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పని పరిస్థితులను మార్చడంలో ఈ పథకం చాలా కీలకంగా ఉంటోంది. సాంప్రదాయంగా వస్తున్న కుటుంబ భారాన్ని మహిళలే మోస్తుండడంతో, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ యాప్ మహిళా కూలీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ఉపాధి హామీ హాజరు నమోదు ప్రక్రియ ఈ ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా జరుగుతుండడంతో కూలీల పరిస్థితి సందిగ్ధావస్థలో పడి, ఉపాధి హామీ పనిని వదులుకునే పరిస్థితికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది ఉపాధి హామీ మహిళా కూలీలు తమ మానసిక స్థితిని మా ముందు వ్యక్తం చేశారు. ప్రియాదేవి లాంటి కూలీ, తన పూర్తి రోజును ఉపాధి హామీ పనికి కేటాయించాలి. లేదా పూర్తిగా మార్కెట్లోనైనా ఉండిపోవాలి.
ఇతర సవాళ్ళు...
ఈ ఎన్‌ఎంఎంఎస్ యాప్ అమలులో కొన్ని ఇతర సవాళ్ళు కూడా ఉన్నాయి. పని సమయానికి సంబంధించిన పర్యవేక్షణలో ఒక స్థిరమైన నెట్‌వర్క్ అందుబాటులో ఉండాలి. దురదృష్టవశాత్తు అనేక గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌లో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ కారణంగా కూలీలు తమ హాజరును సరిగా నమోదు చేసుకోలేకపోవడంతో వారు తమ దినసరి వేతనాలను కోల్పోతున్నారు. ఈ నెట్‌వర్క్ అందుబాటులో లేని కారణంగానే కేరళ, జార్ఖండ్ రాష్ట్రాల కార్మికులు తమ హాజరును నమోదు చేసుకోవడంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడుకు చెందిన ఉపాధి హామీ కూలీలు ఈ యాప్ ద్వారా తమ హాజరును నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ఇటీవల 'న్యూస్ క్లిక్' నివేదిక కూడా బయటపెట్టింది.
ఈ యాప్ ఎన్‌ఆర్‌ఇజిఎ మేట్ల మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చేసిన పనిని కొలిచి, కూలీల హాజరు నమోదు చేసే విధంగా పంచాయతీ స్థాయిలో స్థానిక మహిళలను సంసిద్ధం చేసే బాధ్యత మేట్లకు ఉంటుంది. కానీ ఇప్పుడు మేట్ బాధ్యతలు స్వీకరించాలంటే ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త నిబంధన, వేల మంది మహిళలు మేట్లు కావడానికి ఆటంకంగా తయారైంది. ఈ కారణంగానే తాము మేట్లు కావడానికి అవసరమైన అర్హత పొందలేకపోతున్నామని జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మహిళలు తెలిపారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వున్న పురుషులకు మేట్లుగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ ఎన్‌ఎంఎంఎస్ యాప్ ను ఉపయోగించడంలో తమకు సరైన శిక్షణ ఇవ్వలేదని ఎంపికైన అనేక మంది మేట్లు చెప్పారు. కార్మికుల హాజరు నమోదులో ఏర్పాడే దోషాల కారణంగా, వారి వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం అవుతుంది.
అమలులో దోషాలు
ఈ ఎన్‌ఎంఎంఎస్ యాప్‌ను పైలట్ ప్రాజెక్టుగా గత సంవత్సరం ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ యాప్ అమలులో చాలా దోషాలున్నాయని అధికారులు, కార్యకర్తలు అనుభవపూర్వకంగా ధ్రువీకరించారు. కానీ గుర్తించిన దోషాలకు సంబంధించిన సమాచారం గానీ, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలుగానీ అందుబాటులో లేవు. సమాచార హక్కు దరఖాస్తులు కూడా ఎటువంటి సంతృప్తికరమైన పరిష్కారాలను చూపలేదు. ఈ యాప్ అమలులో దోషాలు కొనసాగుతున్నప్పటికీ, 2022 మే 13న ఎన్‌ఆర్‌ఇజిఎ పని ప్రదేశాల్లో (20 మంది కంటే ఎక్కువ కార్మికులు ఉన్నచోట) ఎన్‌ఎంఎంఎస్ యాప్ తప్పనిసరిగా అమలు చేయాలనీ, ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప మాన్యువల్ హాజరుకు ఎలాంటి అవకాశం లేదని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ జారీ అయిన వారం రోజుల లోపు అనేక మంది, పైలట్ ప్రాజెక్టులో ఏర్పడిన దోషాల గురించి ఫిర్యాదులు సమర్పించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఇంతవరకు ఎలాంటి పరిష్కారాల్ని చూపలేదు. ఎలాంటి హామీలు ఇవ్వలేదు.
భౌతిక రికార్డులేవీ ?
అమలులో ఉన్న సమస్యలకు మించి...ఈ యాప్ లక్ష్యం, దాని సమర్థత అస్పష్టంగా ఉంది. చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పథకాల పర్యవేక్షణకు హామీ ఇవ్వడం, పారదర్శకతను పెంచడం ద్వారా పౌరుల బాధ్యతను పెంచే లక్ష్యంతో ఈ యాప్ ఏర్పడిందని చెప్తున్నారు. కానీ వాస్తవంలో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. కార్మికులు సంతకాలు చేసిన హాజరు రికార్డులు లేకుంటే...వారు చేసిన పనికిగాని, పనికి హాజరైన రుజువులుగాని కార్మికుల దగ్గర ఉండవు. ఎన్‌ఆర్‌ఇజిఎ ప్రాజెక్ట్‌లో పని చేసినవారి హాజరు రికార్డులు ఎన్‌ఆర్‌ఇజిఎ వెబ్‌సైట్ లో కూడా లేవని జార్ఖండ్‌లోని సింఫ్‌ు భూమ్ జిల్లాకు చెందిన కార్మికులు చెప్పారు. కార్మికులు పనికి హాజరైనట్టు రుజువుగా ఉపయోగించే భౌతిక రికార్డులు అందుబాటులో లేకపోవడంతో రెండు పూర్తి వారాలు చేసిన పనికి వారు వేతనాలు కోల్పోతారు.
ఎన్‌ఆర్‌ఇజిఎ లో పెరిగిపోతున్న అవినీతి ఒక సమస్యగా మారుతున్నది. నకిలీ హాజరు రికార్డుల ద్వారా నిధులు కైంకర్యం అవుతున్నాయి. వాస్తవ సమయం, హాజరుపై దృష్టి పెట్టడం ద్వారా అవినీతిని పరిష్కరించవచ్చు. అయితే ఈ అవినీతి పైన, దాన్ని పరిష్కరించే ఎన్‌ఎంఎంఎస్ విధానం పైన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ స్పష్టత ఇవ్వలేదు. పారదర్శకత లేదా వేగవంతమైన చెల్లింపుల ప్రక్రియల విషయంలో ఎన్‌ఎంఎంఎస్ యాప్ పని తీరును అంచనా వేయడానికి ఎలాంటి కొలమానాలు లేవు.
సామాజిక తనిఖీలు బలోపేతం చెయ్యాలి
ఈ యాప్‌పై దృష్టి కేంద్రీకరించడం లేదా ఇతర సంక్లిష్టమైన సాంకేతిక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి బదులుగా సామాజిక తనిఖీలు బలోపేతం చెయ్యాలని మేం బలంగా నమ్ముతున్నాం. సామాజిక తనిఖీలు పౌరులు కేంద్రంగా జరుగుతాయి. అక్కడ పౌరులకు ప్రత్యక్ష పాత్ర ఉంటుంది. తమ పంచాయతీ పరిధిలో ఎన్‌ఆర్‌ఇజిఎ ఎలా పనిచేస్తున్నదో వారే చెబుతారు. గతంలో తనిఖీలు బాగా జరిగేవి. అయితే, సామాజిక తనిఖీ యూనిట్లు, గ్రామసభలు లాంటి పౌర కేంద్రీకృత సంస్థలను బలోపేతం చేయడానికి బదులు కార్మికులకు అందుబాటులో లేని, వారికి అర్థంకాని సాంకేతిక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దృష్టి పెడుతున్నట్టు కనపడుతుంది.
పౌరుల బాధ్యత, పారదర్శకతలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించబడిన యాప్...ఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులు, కార్యకర్తలు, ప్రభుత్వ ఫీల్డ్ అధికారులతో చర్చించకుండానే అమలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఎన్‌ఆర్‌ఇజిఎ వాస్తవ పని తీరు పట్ల ఎన్‌ఎంఎంఎస్ చాలా గుడ్డిగా వ్యవహరిస్తున్నది. భాగస్వాములతో ఎలాంటి చర్చలు చేయకుండా సంస్కరణలను ప్రవేశపెట్టే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అలవాటు...ఎన్‌ఆర్‌ఇజిఎ లో పొందుపరిచిన పారదర్శకత, పౌర భాగస్వామ్య సూత్రాలకు అనుగుణంగా లేదు. ఎన్‌ఎంఎంఎస్ అమలులో ఏర్పడుతున్న అనేక సమస్యల వల్ల ఎన్‌ఆర్‌ఇజిఎ కింద పని చేయడం కార్మికులకు కష్టంగా తయారైంది. ఫలితంగా కార్మికులు పని చేసే హక్కును కోల్పోతున్నారు.
(''ద హిందూ'' సౌజన్యంతో)
చక్రధర్ బుద్ధ
లావణ్యా తమంగ్