- 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మృతి
బమకో : ఉత్తర మాలిలో జరిగిన రెండు ఉగ్రవాద దాడుల్లో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారని మాలి ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలను లక్ష్యంగా చేసుకునే ఈ రెండు దాడులు జరిగాయని గ్రూప్ టు సపోర్ట్ ఇస్లామ్ అండ్ ముస్లిమ్స్ (జిఎస్‌ఐఎం) తెలిపింది. గావో రీజియన్‌లో మాలి సాయుధ బలగాల సైనిక శిబిరాన్ని, ప్రయాణికుల బోటును లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. ''ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో వైమానిక, పదాతి దళాలు సత్వరం స్పందించి దాదాపు 50 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. ప్రయాణికులందరినీ తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది. దాడులు జరిగిన కొద్ది గంటల తర్వాత మాలి తాత్కాలిక అధ్యక్షులు అసిమి గొయిటా మాట్లాడుతూ, గురువారం నుండి మూడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు పాటిస్తున్నట్లు ప్రకటించారు. 2012 నుండి చొరబాట్లు, కమ్యూనిటీల మధ్య హింసాకాండ, తీవ్రవాద కార్యకలాపాలతో మాలి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ హింసలో వేలాదిమంది ప్రజలు మరణించగా, వేలాదిమంది నిర్వాసితులయ్యారు.