Sep 24,2023 08:48

'లేలేత నవ్వులా.. పింగాణీ బొమ్మలా..!' అన్నాడు కవి. అంటే పింగాణీ అంత సున్నితంగా.. సుందరంగా ఉంటుందనీ.. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మనం వాడే వస్తువుల్లో పింగాణీ వస్తువులు ఎన్నో. వీటిల్లో నిత్యజీవితంలో అవసరమయ్యేవి కొన్నయితే.. ఇంటికి అందాన్ని చిందించేవి కొన్ని. వాష్‌బేసిన్‌, బాత్‌రూమ్‌ కమోడ్‌, పూల కుండీలు (కూజా), డిన్నర్‌ సెట్స్‌, టైల్స్‌ ఇలా అందరి ఇళ్లల్లో నిత్యం కనిపించేవి.. వినియోగించేవి. నిగనిగలాడుతూ మెరుపులీనే ఎన్నో రకాల సైజుల్లో, అందమైన అలంకారాలు తీర్చిదిద్దుకున్న వస్తువులు చూడగానే కనువిందు చేస్తుంటాయి. అంతేకాదు.. ఇంటికి అతిథులు వస్తే వెంటనే పింగాణీ కప్పులు తీసి టీ, కాఫీ పోసి ఇస్తాం. హుందాగా ఉంటుందని అందమైన డిజైన్‌ ఉన్న పింగాణీ ప్లేట్లల్లో టిఫిన్‌, భోజనం పెడతాం. అసలు పచ్చళ్లు పెట్టుకునేదీ పింగాణీ జాడీల్లోనే. అంతేకాదు వీటిల్లో మొక్కలు కూడా పెంచవచ్చు. వీటికోసం ప్రత్యేకమైన డిజైన్స్‌తో కుండీలూ వచ్చాయి. వీటిని ఇంట్లో అమర్చుకుంటే అందానికి అందం.. ఆకర్షణకు ఆకర్షణ. ఇంతలా మనసు దోచే పింగాణీ ప్రాధాన్యత.. చరిత్ర.. ప్రత్యేకత తెలుసుకుందాం.

1


గట్టిగా ఉన్న తెల్లటి పాత్రలను కాల్చటం ద్వారా మెరిసే వాటిని పింగాణీ పాత్రలు అంటారు. ఇవి మామూలు మట్టి పాత్రల కంటే భిన్నంగానూ, గట్టిగానూ, నగిషీగానూ ఉంటాయి. వీటిని ఏదైనా వస్తువుతో తాకిస్తే చక్కని సంగీతాన్ని ధ్వనిస్తాయి. వీటిని తెల్లమట్టి, కయోలిన్‌ అనే ముడి పదార్థాలతో చేస్తారు. మొట్టమొదట సుమారు 2000 వేల సంవత్సరాల క్రితం ఈ వస్తువులు చైనాలో వృత్తి పనివారు ఉత్పత్తి చేశారు. అక్కడ గోలింగ్‌ పర్వతాల్లో పింగాణీకి పనికొచ్చే ఒకరకమైన తెల్లటి బంకమన్ను (కయోలిన్‌) లభిస్తుంది. దీనికి మామూలు బంకమన్ను, ఎముకల బూడిద, క్వార్ట్‌జ్‌ వంటి వాటిని కలిపి తయారుచేసిన మిశ్రమంతో కావాల్సిన ఆకృతుల్లో తయారుచేస్తారు. ఇలా తయారుచేసిన వాటిని 1200-1300 డిగ్రీల సెంటీగ్రేడ్‌ దగ్గర కొలిమిలో కాలుస్తారు. ఇలా మొదట పూలు, ఇతర అలంకరణ పాత్రలు తయారుచేశారు. ఇంత వేడిలో కాల్చడం వల్ల గాజు తరహాలో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీనిపై పెయింట్‌తో రకరకాల కళాకృతులు వేస్తారు. ఇవి అన్నిరకాల వాతావరణ పరిస్థితులు, రసాయనాల ప్రభావాన్ని తట్టుకుంటాయి. ఈ కయోలిన్‌ మట్టిలో గ్లేజ్‌లు, పెయింట్‌ రెండింటినీ బాగా కలిపి భారీ గృహ అలంకరణ వస్తువులు తయారుచేశారు. మింగ్‌ వంశీకులు చైనాను 1368-1644 కాలంలో పాలించారు. వారి హయాంలో తయారైన పింగాణీ వస్తువులు అత్యంత నాణ్యమైనవి, కళాత్మకమైనవి అని ప్రతీతి. ఇవి ప్రసిద్ధి చెందడంతో ఇతర తూర్పు ఆసియా దేశాలకు, తర్వాత యూరప్‌కు ఎగుమతి అయ్యాయి. క్రమంగా ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఈ పింగాణీ వస్తువులు ఎగుమతి అయ్యాయి. వీటి తయారీ ప్రక్రియ మట్టి పాత్రలు, రాతి పాత్రల కంటే కష్టంగా ఉంటుంది. అందుకే ఎక్కువ డిమాండ్‌ కూడా పలుకుతాయి.

2

రకరకాల వస్తువులు..

ఈ బంకమన్ను (కయోలిన్‌) ముడి పదార్థంలో ఫెల్డ్‌స్పార్‌, బాల్‌ క్లే, గాజు, ఎముక బూడిద, స్టీటైట్‌, క్వార్ట్‌జ్‌, పెటుంట్సే, అలబాస్టర్‌ వంటి ముడి పదార్థాలు కలిపి టైల్స్‌, బాత్‌టబ్స్‌, వాష్‌బేసిన్స్‌, బొమ్మలు, శిల్పాలు, పాత్రలు తయారుచేస్తారు. ఇంతకుముందు కాలంలో మనం పింగాణీ పాత్రలు అంటే కేవలం జాడీలే. వీటిల్లో ఊరగాయలు, పచ్చళ్లు నిల్వ చేసుకొనేవారు. ఇప్పుడు ఉదయాన్నే లేవగానే టీ, కాఫీలు తాగడానికి ఎక్కువగా ఈ కప్పులనే వాడుతున్నాం. ఆరోగ్యం దృష్ట్యా టిఫిన్లు, భోజనం చేసేందుకు పింగాణీ ప్లేట్స్‌ వాడకం సర్వసాధారణమైంది. పింగాణీతో తయారుచేసిన పూల కూజాలు, ఏనుగులు, పక్షుల బొమ్మలు, ఇతరత్రా వస్తువులు పెద్ద పెద్ద హోటళ్లల్లో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది ఏమైనా ఇంటి అందాన్ని పెంచడంతో పాటు పర్యావరణహితంగానూ ఇవి ఉంటాయి. ఇప్పుడిప్పుడు విరగని పింగాణీ వస్తువులు వస్తున్నాయి. వాటిని అందంగా అమర్చుకోవడానికి తీసుకొంటే ఎంతో బాగుంటాయి. గృహోపకరణ వస్తువుల్లోనూ ఈ పింగాణీ లేయర్స్‌ వాడుతున్నారు.
ఏళ్ల క్రితం హోటళ్లలో ఈ పింగాణీ కప్పుల్లోనే టీ పోసి ఇచ్చేవారు. కానీ వీటి ప్లేస్‌లోకి పేపర్‌ కప్పులు వచ్చాయి. వీటికి వాడే గమ్‌ వల్ల అనారోగ్య సమస్యలొస్తున్నాయి. కొంతమంది పర్యావరణ ప్రియులు మట్టి, పింగాణీ కప్పులు వాడుతూ జనాన్ని చైతన్యపరుస్తున్నారు. హైదరాబాద్‌లో పాలమూరు జిల్లాలో ఉన్న జిల్లా మ్యూజియంలో ఉంచిన పింగాణీ పాత్రలు క్రీ.శ 6,7 శతాబ్దాలలో చైనాలో తయారైనవిగా చరిత్ర చెబుతోంది. చైనాలోని మింగు రాజుల కాలంలో పింగాణీపై వేసిన రంగులు పర్షియా, సిరియా కుమ్మరుల నుంచి చైనీయులు నేర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎంతో చూడముచ్చటగా ఉన్నాయంటే వర్ణించేందుకు మాటలు చాలవు.

ఊరగాయల నిల్వకు..

ఏడాదికోసారి పట్టుకునే ఊరగాయ పచ్చళ్లలో ఉప్పు, కారం, నూనె అధికంగా కలుపుతాం. దాంతో అధిక ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. ఇతర వస్తువులతో చర్య జరుపుతాయి. స్టీల్‌ వంటి పాత్రల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ఆ పాత్రలు నలుపుదేరి, రంధ్రాలు పడతాయి. పచ్చడి కూడా చెడిపోతుంది. ప్లాస్టిక్‌ డబ్బాల్లో నిల్వ ఉంచితే.. ప్లాస్టిక్‌ పదార్థంతో చర్య జరిపి, అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ పింగాణీ జాడీలు ఓ రకమైన మట్టితో చేస్తారు కాబట్టి చర్య అనేది జరపవు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి అనువుగా ఉంటాయి. ఈ కారణం చేతనే ఊరగాయ పచ్చళ్ళను గాజు, పింగాణీ జాడీల్లో నిల్వ ఉంచుతారు.

4

ఎక్కువకాలం మన్నాలంటే..

  •  వేడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచకూడదు. రసాయనాల గాఢత తక్కువగా ఉండే సబ్బుతోనే పాత్రలను శుభ్రపరచాలి. దీనికి ఉపయోగించే పీచు కూడా మెత్తనిది వాడాలి.
  •  ప్లేట్లు, కప్పులు, పాత్రలు ఏవైనా వస్తువుల మీద మరకలు, వాసన పోవాలంటే కడిగిన తర్వాత గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచి, తీయాలి.
  • ఈ పాత్రలను శుభ్రపరిచేటప్పుడు కింద రబ్బర్‌ లేదా ఫోమ్‌ షీట్‌ని సింక్‌లో పరచాలి. జారి కిందపడినా పగలకుండా ఉంటాయి.
  •  పాత్రల మధ్య టిష్యూపేపర్‌ గానీ, నూలువస్త్రం గానీ ఉంచితే ఒకదానికొకటి ఒరుసుకొని పగలకుండా ఉంటాయి.
  • ఒవెన్‌లో పొరపాటున కూడా వీటిని పెట్టకూడదు. వీటి మీద ఉండే పెయింటింగ్‌ పోవడంతో పాటు, కాలిపోయే ప్రమాదం కూడా ఉంది.
  • ఏ పింగాణీ వస్తువులనైనా జాగ్రత్తగా వాడుకోవల్సిందే. చేయి జారితే ఎంత అందంగా ఉంటాయో.. అంతలోనే పుట్టుక్కుమని పగిలిపోతుంటాయి. జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం ఎన్ని ఏళ్లయినా రంగు పోకుండా, వన్నె తగ్గకుండా వన్నెలూరుతూ అందరినీ ఆకర్షిస్తుంటాయి.

పురాతన పాత్ర ఏ కోటి..!

3

ఈ పురాతన పింగాణీ పాత్రను గత నెల ఆగస్టులో ఇంగ్లండ్‌లోని డోర్‌చెస్టర్‌కు చెందిన 'డ్యూక్స్‌ ఆక్షనీర్స్‌' వేలంశాల వేలం వేసింది. అక్కడ నిర్వాహకులు ఈ పాత్రకు మహా అయితే రూ.10,565 పలకవచ్చని అనుకున్నారు. దాంతో వేలం పాటను రూ.3,169 నుంచి మొదలుపెట్టారు. వేలంలో వివిధ దేశాల బిడ్డర్లు పాల్గొనడం చూసి ఆశ్చర్యపోయారు. నిపుణులైన బిడ్డర్లు కొందరు ఇది చైనాను పాలించిన మింగ్‌ వంశీకుల నాటి వస్తువని గుర్తించడంతో.. భారీ స్థాయిలో వేలంపాటను పెంచుకుంటూ పోయారు. చివరకు ఇంగ్లండ్‌కు చెందిన ఒక పురావస్తు సేకర్త దీనిని రూ.1.09 కోట్లకు పాడుకుని, సొంతం చేసుకున్నారు.

3

కొనే ముందు..

వీటిని కొనే ముందు చిన్న జాగ్రత్తలు పాటిస్తే మంచిది. పింగాణీ పాత్రలను బ్లూ పాటరీతో తయారయ్యే వస్తువులను అధికంగా అచ్చులు ఉపయోగించి, తయారుచేస్తుంటారు. జాయింట్ల వద్ద హోల్స్‌, పగుళ్లు ఏర్పడని పాత్రలను ఎంపిక చేసుకుంటే మంచిది. రంగులు వేసి ఉన్న పింగాణీ పాత్రలను కొనేటప్పుడు వాటిపై వేసి ఉన్న పెయింటింగ్‌ పాత్రకు అందాన్నిచ్చే విధంగా ఉందోలేదో చూసుకోవాలి. బ్లూ పాటరీ పాత్రలను ఆకర్షణ కోసం అందరూ కొంటుంటారు. ఈ పాత్రలను కొనేటప్పుడు రంగుగానీ గ్లేజ్‌ కానీ పెచ్చులుగా ఊడకుండా పూతను సరిగ్గా గమనించి తీసుకోవాలి. పలురకాల సైజుల్లో నీలి రంగు, ఎరుపు రంగులతో పాటు బేస్‌ మెటల్‌గా తయారుచేసే పింగాణీ పాత్రలను ఎంచుకోవచ్చు. వీటిల్లో మీకు నచ్చిన పూలతో అలకరించుకుని డైనింగ్‌ టేబుల్‌, టీపాయి మీద అలంకరిస్తే ప్రత్యేక అందాన్నిస్తాయి.

పద్మావతి
94905 59477