Jul 16,2023 09:36

సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు పోటీగా మెటా తన థ్రెడ్స్‌ను తీసుకువచ్చింది. దీన్ని విడుదల చేసిన ఏడు గంటల్లోనే కోటి మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మెటా థ్రెడ్స్‌ యాప్‌ యూరోపియన్‌ యూనియన్‌లోని కొన్ని దేశాల్లో తప్ప ప్రపంచంలోని దాదాపు 100కి పైగా దేశాల్లో గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌లో 500 అక్షరాల వరకు పోస్ట్‌ చేయవచ్చు. ఇది ట్విట్టర్‌ 280 పదాల పరిమితి కంటే ఎక్కువ, ఇందులో ఐదు నిమిషాల వరకు లింక్‌లు, ఫోటోలు, వీడియోలను చేర్చవచ్చు. ట్విట్టర్‌ తరహా ఫీచర్లతో అదనంగా కొన్ని జోడించింది. ఇన్‌స్టాలో అనుసరిస్తున్న ఖాతాలను, కొత్త యాప్‌పైనా అనుసరించే సౌలభ్యం ఉంది. ఇందులో ట్విట్టర్‌లో లేని కొన్ని అదనపు ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. ఈ యాప్‌ వినియోగించాలనుకునే వారు ఇప్పటికే ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా లాగిన్‌ అవ్వొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న అందరూ ఇందులో కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. థ్రెడ్‌ విడుదలైన ఈ వారం రోజుల వ్యవధిలోనే 10 కోట్ల డౌన్‌లోడ్స్‌కు చేరింది.

థ్రెడ్స్‌ యాప్‌ ఫీచర్లు..

థ్రెడ్స్‌ అనేది ఇన్‌స్టాగ్రామ్‌ నుండి వచ్చిన కొత్త యాప్‌. దీని వినియోగదారులకు ఇతర వినియోగదారుల మెసేజ్‌లకు సమాధానం ఇవ్వడం లేదా రీపోస్ట్‌ చేయడం ద్వారా టెక్స్ట్‌, లింక్‌లు, సంభాషణలలో చేరే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ యాప్‌ వినియోగదారులను వారి ప్రస్తుత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో లాగిన్‌ చేయడానికి, వారి ఫాలోవర్స్‌ జాబితాను అనుసరించడానికి అవకాశం కల్పిస్తున్నది. అంటే, మీరు దీని కోసం ప్రత్యేకంగా అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. మెటా అనేది ప్రముఖ బ్రాండ్‌లు, ప్రసిద్ధ సెలబ్రిటీలు, కంటెంట్‌ సృష్టికర్తలతో సహా 200 కోట్ల మంది కంటే ఎక్కువ వినియోగదార్లతో కూడిన ప్రముఖ ఫోటో, వీడియో-షేరింగ్‌ ప్లాట్‌ఫారమ్‌. మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ థ్రెడ్‌లలోని పోస్ట్‌ ప్రకారం.. ఈ యాప్‌ వంద కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులతో పబ్లిక్‌ సంభాషణలు జరిపే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ట్విట్టర్‌కు పోటీ

థ్రెడ్‌ వినియోగ దారులు ఇన్‌స్టాగ్రామ్‌ కంటే పెద్దస్థాయిలో వినియోగదారులతో పరస్పరం అనుసంథానం కాగలరు. వినియోగదారులు ఈ యాప్‌లో ట్విట్టర్‌ లాంటి అనుభవాన్ని పొందుతారు. ఈ యాప్‌లో ట్విట్టర్‌లో ఉన్న ఫీచర్లను పొందుతున్నారు. చాలా కాలంగా ట్విట్టర్‌లో వస్తున్న మార్పుల కారణంగా ఇబ్బందిపడుతున్న ట్విట్టర్‌ వినియోగదారులకు... ఈ థ్రెడ్‌ యాప్‌ ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. దీనికి కారణం. థ్రెడ్‌ కూడా ట్విట్టర్‌ తరహాలోనే... అటువంటి ఫీచర్లే ఉండటంతో దీనివైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందిన యాప్‌లు కోటిమందిని చేరుకోవడానికి పట్టిన సమయం?

2


స్మార్ట్‌ఫోన్‌ విప్లవం తర్వాత, ప్రపంచం సోషల్‌ మీడియా డిజిటల్‌ విప్లవాన్ని చూసింది. టెక్నాలజీ ప్రపంచంలో కొత్తగా సోషల్‌ మీడియా యాప్‌లు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫారమ్‌లు ఒకదాని తర్వాత ఒకటి పరిచయం అవుతున్నాయి. అనేక యాప్‌ల పట్ల వినియోగదారులు ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారు. కొన్ని గంటల్లోనే కోట్ల మంది ప్రజలు వాటిని ఉపయోగిస్తున్నారు. అదే క్రమంలో వచ్చిన మెటా కొత్త మైక్రోబ్లాగింగ్‌ యాప్‌ 'థ్రెడ్స్‌'కు కూడా ఇలాంటి ఆదరణే కనిపిస్తున్నది. థ్రెడ్స్‌ యాప్‌ను ఇప్పటివరకు ఐదు కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో థ్రెడ్స్‌ యాప్‌ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. కోటి డౌన్‌లోడ్‌లకు కేవలం ఏడు గంటలు మాత్రమే పట్టింది. ఒక్కరోజులో ఐదు కోట్ల డౌన్‌లోడ్‌లను పొందింది. కాగా, కోటి డౌన్‌లోడ్‌ల సంఖ్యను చేరడానికి ట్విట్టర్‌కు రెండేళ్లు, ఫేస్‌బుక్‌కు 10 నెలలు పట్టింది. చాట్‌జీపీటీ, టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్స్‌ కన్నా వేగంగా తక్కువ సమయంలోనే థ్రెడ్స్‌ యాప్‌ 800 లక్షలకు పైగా యూజర్లను సొంతం చేసుకుంది.
ఇప్పటికే ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు థ్రెడ్స్‌ యాప్‌ కోసం సులభంగా సైన్‌అప్‌ చేయవచ్చు. థ్రెడ్స్‌ లాంచ్‌ నుంచి యాప్‌తో యూజర్లు ఈజీగా ఎంగేజ్‌ అవ్వవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాప్‌ కనెక్టవిటీని మరింత సులభతరం చేసింది. అయితే, ఈ యాప్‌ ప్రస్తుతం యూరోపియన్‌ యూనియన్‌లో అందుబాటులో లేదు.