Jun 18,2023 07:15

ప్రస్తుతం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. ఏఐ అనేది ఒక కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌. ఒక మనిషి ఎలాగైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడో.. అలాగే, ఏఐ కూడా అచ్చం మనిషిలాగే ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటుంది. సాధారణంగా మనిషి మెదడు న్యూరస్‌తో పనిచేస్తే.. ఏఐ అనేది న్యూరల్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఒక పనిని అనేకసార్లు చేస్తున్న క్రమంలో దాని తప్పులను గుర్తిస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ, తనను తాను అప్‌డేట్‌ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఒక సాధారణ కంప్యూటర్‌కి, ఏఐ కంప్యూటర్‌కి వున్న తేడా ఏంటంటే.. సాధారణ కంప్యూటర్‌ మనం ఇచ్చిన పనిని ఒక కమాండ్‌ ద్వారా చేయగలుగుతుంది. అది ఎప్పటికీ ఒకే విధంగా పనిచేస్తుంది. కానీ, ఏఐ కంప్యూటర్‌ మాత్రం మనం ఇచ్చిన పనిని పర్ఫెక్ట్‌గా చేయడంతో పాటు.. అదే పనిని రిపీటెడ్‌గా చేస్తున్నప్పుడు అంతకు ముందుకన్నా తక్కువ సమయంలో.. ఇంకా పర్‌ఫెక్ట్‌గా చేసేలా తనను తాను అప్‌డేట్‌ చేసుకుంటుంది. ఏవిధంగా చేస్తే ఇంకా మంచిగా చేయొచ్చనేది కూడా కనుగొంటుంది. అంతేకాదు, మనిషి చేసే అన్ని రకాల పనులను ఏఐ ద్వారా కంప్యూటర్‌ చేసే రోజులు వచ్చేశాయి. దీనికి ఉదాహరణ చెప్పాలంటే.. కారు నడపడం మొదలు.. వంటలు చేయడం, చిత్రలేఖనం, ఆపరేషన్లు చేయడం, కంటెంట్‌ రాయడం వరకు అన్ని పనులనూ కంప్యూటర్లే చేసేస్తున్నాయి.
తాజాగా ఈ ఏఐలో కొత్త మార్పులు అనేకం జరిగాయి. ఇది సైన్స్‌ ఫిక్షన్‌ కాదు. ఇప్పటికే ప్రపంచం మొత్తం విస్తరించడం మొదలు పెట్టేసింది. ఇప్పటికే ఏఐతో చాలా హ్యూమన్‌ ఇంట్రాక్షన్స్‌ జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు ఎవరు ఏ భాషలో మాట్లాడినా అర్థమయ్యే విధంగా డెవలప్‌చేసి, డబ్బింగ్‌ ద్వారా మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. ఇదొక ప్రత్యేకమైన మార్పు అనే చెప్పాలి. ఎందుకంటే.. ఒక క్రియేటివ్‌ పర్సన్‌ చేసే పనిని ఇది అవలీలగా చేసేస్తుంది. తద్వారా ఆ వ్యక్తినిని ఏఐ భర్తీ చేస్తున్నది. సాంకేతికాభివృద్ధిలో ఇలాంటి మార్పు ఎప్పుడు వచ్చినా.. మనుషుల స్థానాలను కంప్యూటర్లు భర్తీ చేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా చాలా పనులు ఆటోమేటిక్‌గా అయిపోయాయి.
ఏఐ అనేది ఆర్డినరీ టెక్నాలజీ కాదు. ఇదొక జనరల్‌ పర్పస్‌ టెక్నాలజీ (జీపీటి)గా చెప్పబడుతోంది.

  • జీపీటి అంటే..

సమాజంపై ఒక విస్తృత, లోతైన ప్రభావం చూపే ఒక సాంకేతిక ఆవిష్కరణ. ఇప్పుడు కొందరు ఇన్నోవేటర్స్‌ కొన్ని ముఖ్యమైన చాట్‌జీపీటీ టూల్స్‌ని కనుగొన్నారు. మనం వాడే ప్రతి డిజిటల్‌ వస్తువులో ఇది వుంది. ప్రతి సాఫ్ట్‌వేర్‌లోనూ దీన్ని వాడుతున్నారు. ఇప్పుడు ఆర్ట్స్‌, పెయింటింగ్స్‌ వంటివాటిలో సైతం ఈ కృత్రిమ మేధస్సు బాగా ఉపయోగపడుతోంది. మున్ముందు ఏఐ ఆవిష్కరించే అద్భుతాలు... సమాజంలో మరిన్ని మార్పులకు దారితీస్తుందనేది నిర్వివాదాంశం. ఇదే ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.