ఈ మధ్య కాలంలో తరచూ పాఠశాలకు డుమ్మా కొట్టే పనిలో పడ్డాడు పదేళ్ల తనూజ్. ఏమైందని తల్లి ప్రశ్నిస్తే తలనొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి అంటూ కనిపించని నొప్పులను సాకుగా చెప్పేవాడు. అది నమ్మిన తల్లి వైద్యుడి దగ్గరకు తీసుకుపోయి పరీక్షలు చేయించింది. వైద్యపరీక్షలు చేసిన వైద్యుడు మంచి ఆహారం పెట్టమనే సలహా మాత్రమే ఇచ్చాడు.
ఆ రోజు నుండి తల్లి అన్ని జాగ్రత్తలూ తీసుకొనిద పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటుండేది.
ఓ రోజు పాఠశాలకు డుమ్మా కొట్టాలన్న తలంపుకు వచ్చాడు తనూజ్. కడుపు నొప్పని ఏడుపు అందుకున్నాడు. తల్లికి ఆందోళన ప్రారంభమైంది. వాము నీరు ఇచ్చి సపర్యలు చేసింది. పరుపు వేసి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చింది. కొద్దిసేపు గడిచాక వైద్యుడి దగ్గరకు తీసుకుపోతానని ఓదార్చింది. మూలుగుతూ మంచం పైకి చేరాడు తనుజ్.
పాఠశాలకి వెళ్లే సమయం దాటిపోయింది. తనూజ్ మంచంపై నుండి లేచి వంటగదిలో ఉన్న తల్లి దగ్గరకు వెళ్లాడు. అమ్మా అని పిలిచేసరికి, తగ్గిందా? అంటూ గాబర పడుతూ అడిగింది తల్లి.
కొద్దిగా సర్దుకుంది చెప్పాడు తనూజ్.
హమ్మయ్య అనుకుని పంచదార డబ్బాకు పట్టిన చీమలను దులుపుతుంది. కానీ పాఠశాలకు వెళ్లే సమయం అయ్యాక తనూజ్ ఆరోగ్యం కుదుట పడడంలో ఆంతర్యం అర్థంచేసుకోవడం మొదలుపెట్టింది.
ఏం చేస్తున్నావు? అడిగాడు తనూజ్.
'చీమలు, పిల్లులతో వేగలేకపోతున్నాను. చీమలు పంచదార తింటున్నాయి. పిల్లులు పాలను ఆగం చేస్తున్నాయి' అని చెప్పింది తల్లి.
బాగా ఆలోచించిన తనూజ్ వాటి తిక్క కుదిర్చే ఉపాయం తన దగ్గర ఉందని చెప్పాడు.
తల్లి ఆశ్చర్యపోయింది. 'ఏమిటా ఉపాయం?' అడిగింది.
'నువ్వు నీ పనులు చూసుకో, నేను నా పనితనం చూపిస్తాను' అంటూ భరోసా ఇచ్చినట్టు చెప్పాడు.
'అయితే నువ్వు కాపు ఉండు, నేను మేడ మీదకు పోయి వడియాలు పెట్టి వస్తాను' అంటూ అక్కడ పంచదార డబ్బాను జాగ్రత్త చేసి, వెళ్లింది తల్లి.
రెండు గంటల తరువాత తల్లి మేడ దిగి వచ్చింది. సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నాడు తనూజ్. 'ఎప్పుడూ ఆటలేనా?' అంటూ వంటింట్లోకి వెళ్లింది.
'దొంగపిల్లి మళ్లీ పాలు తాగేసినట్టుంది!' అంటూ పాలు తపేలా మూత తీసి గొల్లుమంది.
ఆ అలికిడికి ఈ లోకంలోకి వచ్చాడు తనూజ్. ఏమైందంటూ తల్లి దగ్గరకు వెళ్లాడు. పిల్లి పాలు తాగిన సంగతి చెప్పింది తల్లి.
'నేను చేసిన పనికి, పిల్లి పాలు తాగకూడదే!' దీర్ఘంగా ఆలోచించి చెప్పాడు తనూజ్.
'ఏమి చేశావేమిటి?' అడిగింది తల్లి.
'పాల పాత్ర మీద ఇందులో విషం గలదు అని రాశాను..!' అంటూ పాల పాత్ర మీద తాను రాసిన రాతలు చూపించాడు. 'అంతేకాదు పంచదార డబ్బా మీద ఇది కారం డబ్బా అని కూడా రాశాను' అని చెప్పాడు. అప్పటికే పంచదార డబ్బాకు చీమలు పట్టి ఉన్నాయి.
కొడుకు తెలివితేటలకు అవాక్కై.. 'వాటికి చదువురాదు గదా?' అని చెప్పింది.
'అవును గదా!' అంటూ నాలుక కరుచుకున్నాడు తనూజ్.
'పంచదార ఎక్కడ ఉన్నా దారులు వెతకడం చీమల సహజ గుణం. పాలు ఎక్కడ ఉన్నా గుట్టు చప్పుడు కాకుండా తాగడం పిల్లి సహజ గుణం. తల్లి ఒడి వాటికి పాఠశాల.. అక్కడే నేర్చుకొని లక్ష్యాన్ని చేరుకుంటాయి. మనలో మరిన్ని తెలివితేటలు పెంపొందించేందుకు పాఠశాలలు ఉన్నా.. వాటిని వినియోగించకోకుండా తెలివితక్కువ తనానికి బానిసలవుతున్నాం. కనిపించని నొప్పులతో కాలక్షేపం చేస్తే.. జంతువులకు ఉన్న తెలివితేటలు కూడా లేకుండాపోతాయి' అంటూ చురక తగిలించింది తల్లి. విషయం గ్రహించిన తనూజ్ ఆ మధ్యాహ్నమే పాఠశాలకు వెళ్తున్నట్టు తల్లితో చెప్పాడు.
బి.వి.పట్నాయక్
83098 72913