Oct 11,2022 07:07

ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఒకటైన టెలికాం రంగాన్ని ఈ తప్పుడు దారిలో నడిపించేందుకు ఎవరు ప్రయత్నించినా అది ఆ రంగానికి అశనిపాతమే అవుతుంది. భారత వినియోగదారులు, నియంత్రణ సంస్థలు రూపొందించుకున్న నెట్‌ న్యూట్రాలిటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న ప్రస్తుత స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌కు ఇది పెద్ద వెనుకడుగు అవుతుంది. ఇలాంటి తిరోగమన విధానాలను మళ్లీ ప్రవేశ పెట్టడం ద్వారా నెట్‌ న్యూట్రాలిటి నుంచి భారత్‌ను దూరం చేయడానికి కారణమేంటి? కేవలం నిఘాపై ఉన్న వ్యామోహం. ప్రయివేటు గుత్తాధిపత్య కంపెనీలపై ఉన్న అలవిమాలిన ప్రేమే కారణం.

         ప్రజల నుంచి అభిప్రాయాలను ఆహ్వానిస్తూ 'భారత టెలి కమ్యూనికేషన్‌ బిల్లు-2022' ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఇదే సమయంలో ఐదేళ్లుగా రూపొందిస్తూ వచ్చిన వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు (పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు)ను బుట్టలో పడేసింది. గోప్యతను ప్రజల ప్రాథమిక హక్కుగా నిర్ధారిస్తూ పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పౌరులందరికీ వ్యక్తిగత గోప్యత హక్కులను కల్పించాలనేది డేటా ప్రొటెక్షన్‌ బిల్లు ఉద్దేశ్యం. అయితే పౌరులకున్న డేటా హక్కులు ఏమిటనేది కూడా నిర్వచించాల్సి వుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా పౌరులు ఏం చేయాలి? ఏం చూడాలి లేదా ఏం వినాలి? అనే వాటిపై క్రమేపీ తన పెత్తనాన్ని పెంచుకుంటూ పోతోంది. ప్రతిపాదిత టెలికాం బిల్లు పౌరులపైనా, సర్వీసు ప్రొవైడర్లపైనా ప్రభుత్వ అధికారాలను విస్తృతం చేయనుంది. అంతే కాకుండా భారత టెలికాం నియంత్రణ అధీకృత సంస్థ (ట్రారు), టెలికాం వివాదాల పరిష్కార, అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (టిడి శాట్‌) పాత్రను కూడా ఇది గణనీయంగా తగ్గించనుంది. భారత టెలిగ్రాఫ్‌ చట్టం-1885 స్థానంలో తేనున్న ఈ బిల్లు...పౌరులపై కేంద్ర ప్రభుత్వ అధికారాలను విస్తృతం చేసేటువంటి మోడీ ప్రభుత్వ కేంద్రీకరణ ధోరణిని కూడా కొనసాగించనుంది. అయితే, దేశ వ్యాప్తంగా అన్నదాతల ఆందోళనలకు దారితీసిన వ్యవసాయ బిల్లుల తరహాలో పార్లమెంటు ద్వారా ఈ బిల్లును బలవంతంగా రుద్దేయకపోవడం ఒక ఊరట.
           పౌరులపై పోలీసింగ్‌ అధికారాలను విస్తరింపజేసుకోవడం, సామూహిక నిఘా వ్యవస్థను సృష్టించడమే మోడీ ప్రభుత్వ ఉద్దేశం. తమ వద్ద ఉన్న వినియోగదారుల సమాచారాన్ని అంతంటినీ ప్రభుత్వంతో పంచుకోవాల్సిందేనన్న ఒత్తిడి సర్వీస్‌ ప్రొవైడర్లు అందరిపైనా ఈ బిల్లు ద్వారా పెరగనుంది. సిగల్‌, టెలిగ్రామ్‌ వంటి ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ (సమాచారం ఉత్పత్తి అయిన స్థానం నుంచి అది చేరాల్సిన గమ్యస్థానం వరకూ మధ్యలో ఎవ్వరూ చొరబడకుండా ఉండే రక్షణ) సదుపాయాలను ఇప్పటిలాగా వినియోగించుకునేందుకు వీల్లేకుండా నిబంధనలను తెచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు వీలు కల్పించనుంది. ఇటువంటి యాప్‌లు సైతం తప్పనిసరిగా ఓవర్‌ ద టాప్‌ (ఒ.టి.టి) సర్వీసుల మాదిరి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వుంటుంది. ఇంటర్నెట్‌ను ఉపయోగించి కొత్త సేవలు, ఆవిష్కరణలు అభివృద్ధి చేయడం చాలా కష్టతరంగా మారేటువంటి విపరీత పర్యవసనాలను కూడా ఈ బిల్లు వల్ల ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న గుత్త పెట్టుబడిదారీ సంస్థలు మరింత వేళ్లూనుకొని బలపడేందుకు దోహదం చేయనుంది. అంతేగాకుండా, ఇంటర్నెట్‌ కమర్షియల్‌ సేవలను కేవలం బడా కంపెనీలకు మాత్రమే పరిమితం చేసే ప్రమాదముంది.
           ఇంటర్నెట్‌ ఆధారిత ఈ తరహా సేవలన్నిటినీ అనుమతులు తప్పనిసరి అయిన ఓవర్‌ ద టాప్‌ (ఒ.టి.టి) సేవలుగా ముసాయిదా బిల్లు కొత్తగా నిర్వచిస్తోంది. పోనీ ఈ బిల్లు ద్వారా టెలికాం నియంత్రణ అధీకృత సంస్థ అయిన ట్రారుకి ఏమైనా ఒనగూర్చేది ఉందా అనంటే అది కూడా చూద్దాం. టెలికాం సేవలను నియంత్రించేందుకు, సంబంధిత విధానాలను రూపొందించేందుకు స్వతంత్రంగా పనిచేసేలా ఏర్పాటు చేసిన సంస్థ ట్రారు. కానీ జరుగుతున్నదేమిటి? కేవలం ప్రభుత్వం ఏది చెబితే అది చేసుకుపోవడమే అనే రీతిలో వీటి అధికారాలన్నిటీని ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం (డాట్‌) చలాయిస్తోంది. టెలికమ్యూనికేషన్స్‌ చట్టం ప్రకారం...ట్రారు కార్యకలాపాల్లో ఒక్కటైన టారిఫ్‌ల ఖరారు విషయంలో కూడా ఇప్పుడు ట్రారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోతోంది. డాట్‌ ఎలా చెబితే అలా నడుచుకునే సబార్డినేట్‌ స్థానంలోకి ట్రారుని నెట్టేశారు.
         గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని, ఒకవేళ గోప్యతకు భంగం కలిగించాలంటే అందుకు చట్టబద్ధతతో కూడిన నిర్దిష్ట లక్ష్యం (ఇదివరకే ఉన్న చట్టాలకు లోబడి) తప్పనిసరిగా ఉండాలని పుట్టుస్వామి కేసు తీర్పులో సుప్రీంకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. నిర్దేశిత లక్ష్యాలు, ఉద్దేశాలను చేరుకోవాలంటే వాటి మధ్య సహేతుక సంబంధాలు అవసరం. దురదృష్టవశాత్తూ ఐదేళ్ల పాటు రూపుదిద్దుకున్న డేటా ప్రొటెక్షన్‌ చట్టం మళ్లీ అగమ్యగోచర స్థితిలోకి పడిపోయింది. పౌరులపై సామూహిక నిఘా న్యాయసమ్మతం కాదని పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేస్తున్నా..డేటా ప్రొటెక్షన్‌ చట్టం లేకపోతే గోప్యత హక్కు పరిరక్షణ అవకాశాలు పౌరులకు చాలా పరిమితమైపోతాయి. ఇదే అసలు సమస్య. పౌరులపై నిఘా వుంచేందుకు ప్రభుత్వం నోటిఫై చేసిన 10 సంస్థల్లో ఏదైనా సరే. సరైన పరిశీలన చేయకుండా, సమతుల్యత పాటించకుండానే నిఘా చర్యలు చేపట్టే ప్రమాదముంది. ఇంటర్నెట్‌ ఉపయోగించి మనం పొందే సేవలన్నిటినీ ఈ బిల్లులో టెలికాం సేవలుగా నిర్వచించడం ద్వారా ప్రభుత్వ నిఘా అధికారాలు మరింత విస్తృతం అవుతాయి.
            బిల్లులో ఉపయోగించిన 'ఓవర్‌ ద టాప్‌ (ఒ.టి.టి) సేవలు' అనే పదం చాలా కీలకమైనది. టెలికాం, డేటా సేవలన్నిటినీ ఒకే గాటున కట్టి ఒటిటి సేవలుగా పేర్కొన్నారు. దీనిర్థమేమిటంటే.. నెట్‌ ఫ్లిక్స్‌, హాట్‌ స్టార్‌, అమెజాన్‌ మొదలుకొని ఇరుగు పొరుగు ప్రాంతాల్లో కిరాణా సరుకులు సరఫరా చేసేందుకు ఒక యాప్‌ వినియోగిస్తే...అలాంటి చిన్నచిన్న సేవలను కూడా 'ఒటిటి' సేవలుగానే పరిగణిస్తారు. ఇందుకోసం సంబంధిత అధీకృత ప్రభుత్వ సంస్థల వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం, లైసెన్సు పొందడం తప్పనిసరి అవుతుంది.
          ఇంటర్నెట్‌ను ఉపయోగించి అందించే సేవలన్నిటినీ 'ఒటిటి' సేవలుగా పరిగణించడంలో రెండు ప్రధాన అంశాలు ముడిపడి వున్నాయి. ఒకటి...సంభాషణలు (వాయిస్‌), డేటా సేవలను మాత్రమే మనం టెలికమ్యూనికేషన్ల సేవలుగా పరిగణిస్తాం. వైర్ల ద్వారా నేరుగా సంభాషణలు జరిపే వాయిస్‌ సేవలను, లేదా ఇంటర్నెట్‌ ద్వారా పంపే డేటా (వాయిస్‌, ఇమేజ్‌, డేటా..ప్రతిదీ డేటా పాకెట్లుగా విడిపోయి తిరిగి అదే ఫార్మాట్లలో రీ అసెంబుల్‌ అయ్యేటువంటి డేటా) సేవలనే పరిగణిస్తాం. 'ఓపెన్‌ ద టాప్‌' వంటి ఒకే పదాన్ని ఉపయోగించడం వల్ల ఈ సేవలన్నీ ఓమ్నీ బస్సు తరహాలో గంపగుత్తగా డేటా కార్యకలాపాలుగా మారిపోతాయి. టెలికమ్యూనికేషన్ల సేవలుగా ఉండవు. అందువల్ల డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్ల (డాట్‌) పాత్ర అంటూ ఏమీ ఉండదు. భౌతిక ప్రపంచంలో లభ్యమవుతున్న ఇలాంటి అనేకానేక సేవలపై వివిధ ప్రభుత్వ శాఖల నియంత్రణ ఉంది. ఉదాహరణకు, వైద్య సేవలను అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్ర స్థాయీల్లోనూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నియంత్రిస్తుంది. ఈ సేవలపై పురపాలక స్థాయిలోనూ నియంత్రణ ఉంటోంది. అలాగే విద్య, వాణిజ్య, తదితర అన్ని రంగాల సేవలపైనా సంబంధిత శాఖలు, సంస్థల నియంత్రణ ఉంది. అందువల్ల అలాంటి అన్ని సేవలనూ 'ఒ.టి.టి' సేవలుగా పిలవడం ద్వారా వాటన్నిటినీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఒకే ఛత్రం కిందకు తీసుకొచ్చి కేంద్రం, టెలికాం డిపార్ట్‌మెంటూ రెండూ మితిమీరిన అధికారం చెలాయించేందుకు దారితీస్తుంది.
         టెలికాం దృష్ట్యా మనం ఈ సేవలను పరిశీలన లోకి తీసుకుంటే అప్పుడు రెండే ప్రధాన సేవలుంటాయి. అవి టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు. భౌతికంగా వీటికవసరం అయ్యే రాగి తీగలు, ఫైబర్‌ ఆప్టిక్‌, వైర్‌లెస్‌ ఉపకరణాలు వంటి మౌలిక సదుపాయాల వ్యవస్థను ఒక డేటా లేదా ఒక వాయిస్‌ సర్వీస్‌గానూ పరిగణించలేం. టెలిఫోన్‌ కాల్‌, ఇంటర్నెట్‌ కాల్‌ రెండూ కూడా సంభాషణల కోసమే వినియోగిస్తున్నప్పుడు రెండింటి మధ్య మనమెందుకు తేడా చూడాలి? సంభాషణ ప్రసారం ఇలా ఉంటుంది..ఒకటి నేరుగా వైర్‌లెస్‌గా లేదా ఒక వైర్‌ కనెక్షన్‌ ద్వారా లేదంటే వాయిస్‌ నుంచి డేటాగా మారి అది తిరిగి వాయిస్‌గా మారడం. టెలికాం సర్వీసు ప్రొవైడర్లు అందజేసేది ఈ రెండు సేవలు మాత్రమే. డేటా పాకెట్ల లోపల (ట్రాన్స్‌ఫాం క్రమంలో) ఏం జరుగుతుందనేది టెలికాం రంగ పరిధిలో ఉండదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం : ఒక వైద్యుడు ఇంటర్నెట్‌ ద్వారా ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ ఆఫర్‌ చేయవచ్చు. ఒక చిన్న కిరాణా దుకాణం లేదా ఒక రెస్టారెంట్‌ ఒ.టి.టి సేవల ప్రొవైడర్‌గా రిజిస్టర్‌ చేయించుకోవాలా? లేదా ఏదైనా గుత్తాధిపత్య సర్వీసు ప్రొవైడర్‌లో చేరి తమకు వచ్చే ఆదాయాలను అప్పనంగా సదరు మోనోపాలి సంస్థలకు కట్టబెట్టేయాలా? ఇదే ఈ బిల్లులో ప్రధానాంశం.
        ఇక రెండో ప్రధానాంశం...ఒ.టి.టి సేవలుగా అనుమతి తప్పనిసరిగా పొందాలనే నిబంధనల వల్ల ఇంటర్నెట్‌ ఆధారిత కొత్త సేవల ఆవిష్కరణలకు అవకాశం కల్పించకుండా తలుపులు మూసుకుపోతాయి. దానివల్ల ఇప్పటికే ఈ రంగంలో గుత్తాధిప్యం సాధించిన పెట్టుబడిదారీ సంస్థలు మరింత బలపడతాయి.
           టెలికాం సర్వీసు ప్రొవైడర్లు వాయిస్‌, డేటా సేవలకు మాత్రమే పరిమితం కావడానికి ఒక కారణం ఉంది. ఒకవేళ ఈ పరిమితి లేకుండా పోతే, సదరు టెలికాం కంపెనీలు ఇంటర్నెట్‌ ఆధారిత సేవలన్నిటిపైనా దోపిడి సాగించే వీలుంది. డేటా ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌పై టెలికాం గుత్తాధిపత్య కంపెనీలకు పట్టు ఉన్నందున ఇంటర్నెట్‌ ఆధారిత ఇ-మెయిల్‌, సమాచారం తెలిపే బులిటెన్‌ బోర్డులు, అలాగే వార్తా సంస్థలు లేదా ఈ తరహా సేవలను పొందే ఇతర రంగాలు కచ్చితంగా నిర్వీర్యమవుతాయి. అందుకనే ఆ సంస్థలను వాయిస్‌, డేటా సేవలకు మాత్రమే పరిమితం చేసింది. ఇంటర్నెట్‌ తటస్థత (నెట్‌ న్యూట్రాలిటీ) నిబంధనలు తెరపైకి వచ్చింది ఈ పర్యావసనాల నేపథ్యంలోనే. ఫేస్‌బుక్‌ పైన, అది తీసుకొచ్చిన 'ఫ్రీ బేసిక్స్‌' పైన సాగిన పోరాటం గుర్తుంది కదా. కొన్ని టెలికాం ఆపరేటర్లతో చేతులు కలిపి ఒక చిన్న ప్రయివేటు ఇంటర్నెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి అదే ఇంటర్నెట్‌ సమస్తం అనే ఒక కుట్రపూరిత చర్యకు అప్పట్లో ఫేస్‌బుక్‌ తెరలేపింది. ఇంటర్నెట్‌ వినియోగదారులు భారత్‌లో పోరాటం లేవదీసింది ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగానే. నెట్‌ న్యూట్రాలిటీ మార్గదర్శకాల ఆధారంగా ట్రారు కూడా 'ఫ్రీ బేసిక్స్‌'ను తిరస్కరించింది. ఫేస్‌బుక్‌ (ఇప్పుడు మెటా)కు ఇది అతి పెద్ద ఓటమి.
            డేటా ఆధారిత సేవలన్నిటినీ 'ఒ.టి.టి' సేవలుగా నిర్వచించడం వల్ల కేంద్ర ప్రభుత్వ నియంత్రణాధికారం పెరిగిపోవడంతో పాటు ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్లు తమ గుత్తాధిపత్య అజమాయిషీతో ఇతర సర్వీసు ప్రొవైడర్లు ఉనికి లోకి రాకుండానే చిదిమేస్తాయి. 2015 లోనే ట్రారు 'ఒ.టి.టి సేవల'పై ఒక ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది. అప్పట్లో ఢిల్లీ సైన్స్‌ ఫోరం, నాలెడ్జ్‌ కామన్స్‌ (ఈ వ్యాస రచయిత ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ) సహా అనేక సంస్థలు ట్రారు చర్యను వ్యతిరేకిస్తూ సహేతుకమైన కారణాలతో వివరణాత్మక పత్రాన్ని సమర్పించాయి. డేటా సర్వీసులన్నిటినీ 'ఒ.టి.టి సేవలు'గా పరిగణించేటువంటి ప్రయత్నం చిన్న, నూతన సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని... అంతిమంగా ఆవిష్కరణల అణిచివేతకు దారితీస్తుందని హెచ్చరించాయి. ఈ తరహా విమర్శలు వెల్లువెత్తడంతో ట్రారు తన ప్రతిపాదనను అక్కడితో విరమించుకుంది. అయితే ఏడేళ్ల తర్వాత అదే తరహాలో 'ఒ.టి.టి సూత్రీకరణలను చట్టం రూపంలోనే తెచ్చేందుకు మోడీ సర్కార్‌ తెగించడం గమనార్హం. ఏ ప్రభుత్వమైనా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపడుతోందంటే వెంటనే దానివల్ల ప్రయోజనం ఎవరికి? అనే ప్రశ్న ఉదయిస్తుంది. లేదా దానివల్ల ఎవరికి ప్రమాదం అనే అంశం ముందుకొస్తుంది.
         పౌరులపై నిఘా వ్యవస్థను విస్తరింపజేయాలని, లైసెన్సింగ్‌ను కేంద్రీకృతం చేయాలని తహతహలాడుతున్నందున అందుకు దోహదం చేసే ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి కచ్చితంగా గొప్ప ప్రయోజనకారి. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ప్రయోజనాలు పొందే ఇతర లబ్ధిదారులు...దేశంలో ఇప్పటికే ప్రధాన ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్లుగా ఉన్న రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా వంటి బడా టెలికాం ఆపరేటర్లే. తమ గుత్తాధి పత్యానికి ఆటంకమయ్యే ప్రత్యేకించి వాయిస్‌, మేసేజింగ్‌ యాప్‌ల విషయంలో పోటీని ఈ బడా కంపెనీలు మొగ్గలోనే చిదిమేస్తాయి. కొత్త చట్టం కింద ఒ.టి.టి ప్రొవైడర్లగా మారే సంస్థలను బేరసారాలతో లోబర్చుకొని బడా టెలికాం సర్వీసు ప్రొవైడర్లు నెట్‌ న్యూట్రాలిటినీ గంగలో విసిరేయకుండా ఉంటాయా? ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఒకటైన టెలికాం రంగాన్ని ఈ తప్పుడు దారిలో నడిపించేందుకు ఎవరు ప్రయత్నించినా అది ఆ రంగానికి అశనిపాతమే అవుతుంది. భారత వినియోగదారులు, నియంత్రణ సంస్థలు రూపొందించుకున్న నెట్‌ న్యూట్రాలిటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న ప్రస్తుత స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌కు ఇది పెద్ద వెనుకడుగు అవుతుంది. ఇలాంటి తిరోగమన విధానాలను మళ్లీ ప్రవేశ పెట్టడం ద్వారా నెట్‌ న్యూట్రాలిటి నుంచి భారత్‌ను దూరం చేయడానికి కారణమేంటి ?
కేవలం నిఘాపై ఉన్న వ్యామోహం. ప్రయివేటు గుత్తా ధిపత్య కంపెనీలపై ఉన్న అలవిమాలిన ప్రేమే కారణం.

ప్రబీర్‌ పురకాయస్థ

ప్రబీర్‌ పురకాయస్థ