
ఉపాధ్యాయుల సమయమంతా 'యాప్'లతోనే గడిచిపోతున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన 'ముఖచిత్ర అటెండెన్స్ యాప్'ను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజన పనులతో ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. టెక్నాలజీ వినియోగించాలంటే ఇంటర్నెట్‌తో సహా సౌకర్యాలు అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో 670 మండలాలలో దాదాపు 400 మండలాల్లో ఇంటర్నెెట్ సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఉపాధ్యా యులను బోధనేతర పనుల నుంచి విముక్తులను చేయాలి.
ప్రముఖ తత్వవేత్త ఎపిక్యూరస్ ''విద్య మనిషి నుండి వేరు చేయలేని సంపద'' అని పేర్కొన్నాడు. ''విద్య అనే వృక్షం యొక్క వేళ్లు చేదుగాను, ఫలాలు తియ్యగాను ఉంటాయని'' గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు. మనిషి తన మనుగడ కోసం ప్రకృతి శక్తులతో పోరాడే క్రమంలో పొందిన అనుభవ పూర్వకమైన జ్ఞానమే విద్య. మానవ సమాజం ఆవిర్భవించిన నాటి నుండి మానవుడు తాను తెలుసుకున్న జ్ఞానాన్ని, సాధించిన నైపుణ్యాలను తరువాత తరాలకు అందించటానికి విద్య ద్వారా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మానవ సమాజం సామూహికంగా సంపాదించిన జ్ఞాన, అనుభవాలసారాన్ని అందించటమే విద్యగా నిర్వచించవచ్చు.
అటువంటి విద్య ప్రజలందరికి అందుబాటులో ఉండాలి. భారత రాజ్యాంగంలో 45వ నిబంధన ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలందరికి ఉచిత, నిర్బంధ విద్య అందించాలి. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులలో 21-ఎ నిబంధన చేర్చి, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. 2010లో అమలులోకి వచ్చిన జాతీయ విద్యా హక్కు చట్టం కూడా 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలో ఉండాలని చెప్పింది.
కానీ, ప్రజలందరికి అందుబాటులో ఉండవలసిన విద్య భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చెందింది. ముఖ్యంగా 1991లో ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ- సరళీకరణ-ప్రపంచీకరణ విధానాల ప్రభావం విద్యారంగంపై పడి రెండు సమాంతర వ్యవస్థలు ఏర్పడ్డాయి. పేద విద్యార్థులు, అణచివేతకు గురైన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉండగా, ఆర్థిక సామాజిక స్తోమత కలిగిన వారి పిల్లలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో సంస్థలలో చదువుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో 73 లక్షల మంది పిల్లలు చదువుతుండగా వారిలో 40 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 33 లక్షలమంది ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో 1,90,000 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తుండగా, 1,20,000 మంది ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. విద్యారంగంలో వచ్చిన మార్పులకు ఉపాధ్యాయులు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.
ఉపాధ్యాయుడు -సృజనాత్మకత
ప్రాచీన కాలం నుండి ఇప్పటిదాకా విద్య నేర్పటంలో ఉపాధ్యాయుడు ప్రాధాన్యతగల సృజనాత్మక పాత్ర పోషిస్తు న్నాడు. విద్యార్థి సామాజికీకరణ చెందటంలో సామాజిక విలువ లు పెంపొందటంలో ఉపాధ్యాయుడే ముఖ్య పాత్ర కలిగి ఉంటా డు. ఉపాధ్యాయుడు 'విద్యార్థి కేంద్రీకృత' బోధన చేయడంతో పాటు విద్యార్థిలో ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించాలి. తరగతి గదిలోని ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుడికి అవగాహన ఉండాలి. విద్యార్థులలో స్ఫూర్తిని కలిగిస్తూ విద్యార్థులకు లక్ష్యాలను నిర్దేశించాలి. ఉపాధ్యాయులు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచు కుంటూ, బోధన పరికరాలు, అవసరమైన టెక్నాలజీ వినియోగిం చుకోవాలి. విద్యార్థు లలో శాస్త్రీయ దృక్పథం, లౌకిక భావనలు, ప్రజాస్వామ్య ఆలోచనలు పెంపొందించటానికి కృషి జరగాలి.
టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదు
వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ, వర్చువల్ క్లాస్‌రూం విధానం ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయంగా మారుతుందని కొంతమంది భావించారు.
కాని టెక్నాలజీ ఉపాధ్యాయుడిగా సహాయకారిగా ఉపయోగపడుతుందిగాని, ప్రత్యామ్నాయం కాదని ఆచరణలో రుజువైంది. కరోనా వలన గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఉపయోగించిన 'ఆన్‌లైన్' టీచింగ్ విధానంతో విద్యార్థులలో విపరీతమైన 'ప్రవర్తనా పరమైన' ఇబ్బందులు తలెత్తాయి. తల్లిదండ్రులు ముక్తకంఠంతో ఆన్‌లైన్ విధానం కంటే ఉపాధ్యాయుల బోధనే అవసరమని అంగీకరిస్తున్నారు. ఇటీవల జరిగిన అనేక అధ్యయనాలు కూడా ఈ విషయాలను ధృవీకరించాయి. అనేక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 'స్మార్ట్ క్లాస్‌రూం'లు కూడా ఉపాధ్యాయుడు ఉపయోగిం చిన చోటే విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రపంచబ్యాంక్ నివేదికలో విద్యారంగంలో మానవ వనరుల కంటే టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నది. దీని అర్థం ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటమే. ప్రభుత్వాలు ప్రపంచబ్యాంక్ విధానాలను అమలు చేస్తూ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటానికి భిన్నమైన పద్ధతులలో ప్రయత్నిస్తున్నాయి.
తీవ్ర ఒత్తిడి...
విద్యారంగంలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంస్కరణల వలన ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. బోధన కంటే బోధనేతర పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఉపాధ్యాయులు 14 రకాల యాప్‌లు ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల సమయమంతా 'యాప్'లతోనే గడిచిపోతున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన 'ముఖచిత్ర అటెండెన్స్ యాప్'ను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజన పనులతో ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. టెక్నాలజీ వినియోగించాలంటే ఇంటర్నెట్‌తో సహా సౌకర్యాలు అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో 670 మండలాలలో దాదాపు 400 మండలాల్లో ఇంటర్నెట్ సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తులను చేయాలి.
3,4,5 తరగతుల తరలింపు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను దగ్గరలోగల హైస్కూళ్లకు తరలించాలనే నిర్ణయం వివాదాస్పదమైనది. నిర్ణయాన్ని పేద తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాఠశాల విద్యా పరిరక్షణ కమిటీ శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి అనంతపురం జిల్లా పెనుగొండ వరకు నిర్వహించిన బడి కోసం బస్సు యాత్ర కూడా ఈ ఆందోళనను గమనించింది. 3,4,5 తరగతుల తరలింపు జాతీయ విద్యా హక్కు చట్టానికి పూర్తిగా విరుద్ధమైనది. దీని వలన బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, బాలికలు డ్రాపౌట్లుగా మారే ప్రమాదమున్నది. తరగతులు తరలించకుండా ప్రాథమిక పాఠశాలలను పటిష్టపరచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ సంస్కరణల ద్వారా పాఠశాలల సంఖ్యను 45 వేల నుంచి 15 వేలకు తగ్గించటానికి, 50 వేల ఉపాధ్యాయ పోస్టులు తగ్గించటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.
ప్రైవేట్ ఉపాధ్యాయులు
రాష్ట్రంలో దాదాపు 16 వేల ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 1,20,000 వేల మంది ప్రైవేట్‌రంగ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అతి తక్కువ వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా, సామాజిక భద్రత లేకుండా పనిచేస్తున్నారు. కరోనా కాలంలో దాదాపు 15 నెలలపాటు వీరికి వేతనాలు లేక కూలీలుగా మారవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేట్ ఉపాధ్యాయుల రక్షణ కోసం చట్టం చేసి, గుర్తింపు కార్డులు ఇవ్వని వారికి వేతన భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ సహాయం అందించాలి.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు
రాష్ట్రంలో 352 కస్తూరిబా విద్యాలయాలలో దాదాపు 4 వేల మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు, ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలలో 2 వేల మంది కాంట్రాక్టు, గెస్ట్ ఉపాధ్యాయులు గా, సాంఘిక సంక్షేమ-గిరిజన సంక్షేమ-బి.సి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో దాదాపు 3 వేల మందికి పైగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేదు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో 1000కి పైగా కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాల యాలలో 5 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉపాధ్యాయులను, అధ్యాపకులను క్రమబద్ధీకరించవలసిన అవస రమున్నది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వాగ్దానం చేసిన విధంగా కాంట్రాక్టు ఉపాధ్యాయులకు, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం, గెస్ట్ ఉపాధ్యాయులకు కూడా న్యాయం చేయాలి.
రాజ్యాంగ లక్ష్యాలు -విద్య
విద్యా రంగంలో మార్పులు, సంస్కరణలు రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చేవిగా అందరికీ విద్య అందించేవిగా ఉండాలి. కాని ఆంధ్రప్రదేశ్‌లో సంస్కరణలు విద్యా రంగాన్ని 'మార్కెట్' దిశగా తీసుకువెళుతున్నాయి. విద్య ద్వారా 'సామాజిక మనుషులను' కాకుండా 'మార్కెట్ మనుషులను' తయారుచేస్తున్నారు. మార్కెట్‌కు అవసరమైన కోర్సులు మాత్రమే ప్రవేశ పెడుతున్నారు. పాఠశాల స్థాయిలో కూడా మార్పులు, గ్రేడ్‌పాయింట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేసి, వారి చేత సృజనాత్మకంగా బోధన చేయించే వాతావరణం నెలకొల్పాలి. పౌర సమాజం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
/ వ్యాసకర్త: ఎమ్మెల్సీ, సెల్ : 9440262072 /
/సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం/
కె.ఎస్. లక్ష్మణరావు