Sep 05,2023 06:52

  • నేడు ఉపాధ్యాయ దినోత్సవం

ప్రజాస్వామ్యంలో సంఘాలతో చర్చించటం ఒక సాధారణమైన అంశం. కానీ గత కొన్నేళ్లుగా ప్రభుత్వం గానీ, పాఠశాల విద్యాశాఖ కానీ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పాటించకుండా, ఏకపక్ష నిర్ణయాలు చేయటం ప్రస్తుత పరిస్థితులకు ఒక ప్రధానమైన కారణం. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను గుర్తించి నిర్ణయాలు చేయవలసిన అవసరం వున్నది.

          ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యారంగం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న వేళ, ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద మొదలైన పథకాల ద్వారా అద్భుతాలు చేస్తున్నామని, పెద్ద ఎత్తున ఖర్చు చేసి మార్పులు తెస్తున్నామని ఆడంబరంగా ప్రకటిస్తూ ఉండగా, మరోవైపు క్షేత్ర స్థాయిలో విద్యార్థులతో సన్నిహిత సంబంధాలు కలిగి, ప్రత్యక్షంగా ప్రతినిత్యం విద్యార్థులతో మెలిగే ఉపాధ్యాయులు అసంతృప్తితో, నిరాశతో, ఒత్తిడితో పనిచేస్తు న్నారు. సృజనాత్మకంగా పని చేయవలసిన ఉపాధ్యాయులు ఒత్తిడి వలన తీవ్ర ఆందోళనతో ఉంటు న్నారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న విధానాలే.
 

                                                                                 జీవో నెం.117

ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ పేరుతో జారీ చేసిన జీవో నెం.117 పాఠశాల విద్యకు ఉరితాడుగా మారింది. ప్రపంచ బ్యాంక్‌ 'సాల్ట్‌' ఒప్పందం ప్రకారం ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించటమే దీని లక్ష్యం. జీవో జారీ చేసే సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలతోగానీ, ఎమ్మెల్సీలతోగానీ ఎటువంటి చర్చలు జరపలేదు. జీవో ద్వారా ఉపాధ్యాయులపై పని భారాన్ని పెంచారు. జీవో నెం.117 యథాతథంగా అమలు చేస్తే 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు 'సర్‌ప్లస్‌'గా మారుతున్నాయి. గత ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరుతో వేలాది ప్రాథమిక పాఠశాలలను మూసివేసిందని, ఆ మేరకు బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేసిందని, తమ ప్రభుత్వం ఏ ప్రాథమిక పాఠశాలను మూసివేయబోదని ఉపాధ్యాయ కొరత లేకుండా చూస్తామని ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. కానీ జీవో నెం.117 ద్వారా ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేయడం ఆచరణలో ప్రభుత్వ పాఠశాలలకు శరాఘాతంగా మారింది. జీవో నెం.117ను వెంటనే ఉపసంహరించుకోవాలి.
 

                                                                ఉపాధ్యాయులపై ప్రవీణ్‌ ప్రకాష్‌ ఒత్తిడి

పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా సీనియర్‌ ఐ.ఏ.యస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాష్‌ పదవిని స్వీకరించిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. విద్యాశాఖ ఉన్నత అధికారిగా పాఠశాలలను సందర్శించే హక్కు ఆయనకు ఉన్నది. కాని పాఠశాలలు సందర్శించిన సమయంలో ఆయన ప్రవర్తిస్తున్న విధానం ఉపాధ్యాయులపై, విద్యాశాఖ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నది. అనేకమంది విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఆయన సందర్శించిన అనేక చోట్ల ఉపాధ్యాయులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయన పరిశీలించిన అంశాలను ఉపాధ్యాయు లకు సలహాల రూపంలో చెప్పకుండా, హెచ్చరికలు చేయటంతో ఆందోళన పడుతున్నారు. ప్రవీణ్‌ ప్రకాష్‌ ఒక ప్రాంతాన్ని లేక పాఠశాలను సందర్శిస్తారనే వార్త తెలియగానే ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ అంశాలను ఎమ్మెల్సీలు ఆయన దృష్టికి తీసుకువెళితే... తన పద్ధతి అంతేనని, మార్చుకునేది లేదని స్పష్టంగా చెప్పేశారు. ప్రభుత్వం ఆయనను పాఠశాల విద్యాశాఖ నుంచి తక్షణమే బదిలీ చేయవలసిన అవసరమున్నది.
 

                                                                         బోధనేతర పనుల ఒత్తిడి

విద్యారంగంలో ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంస్కరణల వలన ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. బోధన కంటే బోధనేతర పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. సమగ్రశిక్ష, ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి నిర్వహిస్తున్న ఉపాధ్యాయ శిక్షణలు సగానికిపైగా ఉపయోగం లేకపోగా, ఉపాధ్యాయులను బడిలో లేకుండా చేస్తున్నాయి. ఉపాధ్యాయులు 14 రకాల 'యాప్‌లు' ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యా యుల సమయమంతా 'యాప్‌'ల తోనే గడిచిపోతున్నది. నాడు-నేడు పనులు ప్రధానోపాధ్యాయులకు భారంగా మారాయి. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టలేకపోతు న్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 670 మండలాలలో 400 మండలాలలో 'ఇంటర్నెట్‌' సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయు లను బోధనేతర పనుల నుంచి విముక్తులను చేసినప్పుడే వారు బోధనపై దృష్టి పెట్టగలుగుతారు. 'యాప్‌'ల నిర్వహణ, నాడు-నేడు తదితర పనులను గ్రామ, వార్డు సచివాల యాలకు అప్పగించడం గురించి విద్యాశాఖ ఆలోచించాలి.
 

                                                                      టెక్నాలజీ - బైజూస్‌ కంటెంట్‌

వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ, వర్చువల్‌ క్లాస్‌రూం విధానం, ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదని ఇటీవల 'యునెస్కో' నివేదికలో పేర్కొన్నది. టెక్నాలజీ ఉపాధ్యాయుడికి బోధనలో సహాయకారిగా ఉంటుందిగానీ, ప్రత్యామ్నాయం కాదని ఆచరణలో రుజువైంది. కరోనా సమయంలో 'ఆన్‌లైన్‌ టీచింగ్‌' సమయంలో విద్యార్థుల ప్రవర్తనలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. తల్లిదండ్రులు ముక్తకంఠంతో 'ఆన్‌లైన్‌' విధానం కంటే ఉపాధ్యాయుల బోధన అవసరమని అంగీకరిస్తున్నారు. కాని ప్రభుత్వం ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటానికి ప్రయత్నం చేస్తున్నది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా టెక్నాలజీని ప్రవేశపెడుతున్నది. గత సంవత్సరం 8వ తరగతి విద్యార్థులకు టాబ్‌లు ఎంపిక చేశారు. ఇదీ మంచిదే. వాటిలో 'బైజూస్‌ కంటెంట్‌' పెట్టారు. వీటిపై ఉపాధ్యాయులకు శిక్షణ లేదు. పాఠ్యపుస్తకాలలో కంటెంట్‌కు, బైజూస్‌ కంటెంట్‌కు 'సింక్‌' కావటం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటికే సగం టాబ్‌లు మూలపడ్డాయి. టెక్నాలజీపై క్రమపద్ధతిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి.. ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇటీవల పాఠశాల విద్యాశాఖ హడావిడిగా ప్రవేశపెట్టిన 'టోఫెల్‌' పరీక్షా విధానం అమలు తీరు వైఫల్యం చెందినది.

                                                                   ఉపాధ్యాయ ఖాళీలు-డి.యస్‌.సి

2019లో ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఒక్క డి.యస్‌.సి నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. ఇప్పటికి 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఒక అంచనా. ప్రస్తుత బదిలీలు, ప్రమోషన్ల అనంతరం పరిశీలన చేస్తే అనేక వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ ఖాళీలు వేల సంఖ్యలో ఉన్నాయి. 5 లక్షల మందికిపైగా నిరుద్యోగ అభ్యర్థులు డి.యస్‌.సి నోటిఫికేషన్‌ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాలలో వేలాది ఖాళీలు ఉండగా, ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వందలాది మందిని అక్రమ బదిలీలకు తెర లేపింది. వెంటనే ప్రభుత్వం డి.యస్‌.సి నోటిఫికేషన్‌ ఇచ్చి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి.
 

                                                                      3,4,5 తరగతుల తరలింపు

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను దగ్గరలోని హైస్కూళ్లకు తరలించాలనే నిర్ణయం వివాదాలకు దారితీసింది. ఈ తరలింపు జాతీయ విద్యా హక్కు చట్టానికి విరుద్ధమైనది. దీని వలన ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమై వేల సంఖ్యలో మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈ విధానాల ద్వారా ప్రభుత్వం పాఠశాలల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నది. తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత దృష్ట్యా ప్రభుత్వం ఈ తరలింపు విధానాన్ని పునరాలోచన చేసి తరగతులను కొనసాగించవలసిన అవసరమున్నది.
 

                                                                        ఉపాధ్యాయుడు-సృజనాత్మకత

ప్రాచీనకాలం నుంచి ఇప్పటిదాకా విద్య నేర్పడంలో ఉపాధ్యాయుడు ప్రాధాన్యతకల సృజనాత్మక పాత్ర పోషిస్తున్నాడు. విద్యార్థి సామాజికీకరణ చెందడంలో, సామాజిక విలువలు పెంపొందించటంలో, ప్రశ్నించే తత్వాన్ని పెంచటంలో ఉపాధ్యాయుడు ముఖ్య పాత్ర పోషించాలి. విద్యార్థులలో స్ఫూర్తిని కలిగిస్తూ విద్యార్థులకు లక్ష్యాలను నిర్దేశించాలి. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, లౌకిక భావనలు, ప్రజాస్వామ్య ఆలోచనలు పెంపొందించటానికి కృషి చేయాలి. కానీ ప్రస్తుతం ఉపాధ్యాయులు సృజనాత్మకంగా బోధన చేయలేక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడిని తగ్గించవలసిన అవసరమున్నది.
 

                                                                             ప్రైవేటు ఉపాధ్యాయులు

రాష్ట్రంలో 16 వేల ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో లక్షా ఇరవై వేల మంది ప్రైవేట్‌ రంగ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరు ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే భిన్నమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వీరు అతి తక్కువ వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా, సామాజిక భద్రత లేకుండా పని చేస్తున్నారు. పని గంటలు ఎక్కువగా ఉండటం, సెలవు రోజులలో కూడా పాఠశాలలకు హాజరు కావటంలో తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల కోసం ఇంటింటికీ తిరగటం, కొంతమంది విద్యార్థులను చేరిస్తేనే ఇంక్రిమెంట్‌ ఇవ్వటం మొదలైన విషయాలు ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగంగా మారాయి. ప్రైవేట్‌ ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకై చట్టాలు చేయవలసిన అవసరమున్నది.
ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు గత 8 దశాబ్దాలుగా అనేక సంఘాలు ఆవిర్భవించి కృషి చేశాయి. ప్రజాస్వామ్యంలో సంఘాలతో చర్చించటం ఒక సాధారణమైన అంశం. కానీ గత కొన్నేళ్లుగా ప్రభుత్వం గానీ, పాఠశాల విద్యాశాఖ కానీ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పాటించకుండా, ఏకపక్ష నిర్ణయాలు చేయటం ప్రస్తుత పరిస్థితులకు ఒక ప్రధానమైన కారణం. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను గుర్తించి నిర్ణయాలు చేయవలసిన అవసరం వున్నది.

/ వ్యాసకర్త శాసనమండలి సభ్యులు,
సెల్‌ : 8309965083 /
కె.యస్‌. లక్ష్మణరావు

1