
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కోటి ఆశలతో వచ్చిన విద్యార్థుల ఆకాంక్షలను తీర్చిదిద్దేలా పాఠశాల ఉండాలి. ఒత్తిడిని తగ్గించి మానసికోల్లాసాన్ని కల్పించేదిగా ఉండాలి. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సామర్ధ్యాలను పెంపొందించడానికి, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. విద్యార్థికి అక్షర జ్ఞానం అందించడం మాత్రమే కాదు...భావోద్వేగాల ఒత్తిడిని తగ్గించడం, భవిష్యత్ మీద ఆశ కల్పించడం, దానికి కావలసిన బాట ఏర్పరచడం వంటివి ముమ్మాటికి ఉపాధ్యాయులే చేయాలి.
వృత్తి కాదు బాధ్యత
మనల్ని చదివించడమే కాదు, మనకు ఉద్యోగాలు ఇచ్చి జీతభత్యాలు ఇస్తున్నది కూడా సమాజమే. వారి పిల్లల్ని మనం భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాం. ఈ భావన మన గుండెల్లోకి ఎక్కితే, మనసు పొరల్లో హత్తుకుంటే ... నేను నా వృత్తిని బాధ్యతతో ప్రేమిస్తాను...నేనైతే ఈ లోకాన్ని ఇంకాస్త మెరుగుపరచాలనే ఆశతోనే ఉంటాను-అని చెప్పిన న్యూయార్క్ సిటీ ఉపాధ్యాయుని మాటలను ఆచరణలో పెడితే ఉపాధ్యాయ బాధ్యతకు అంతకంటే ఆనందం ఏముంటుంది. ఉపాధ్యాయులు పాఠశాల నుంచి బదిలీపై వెళ్తుంటే పిల్లలతోబాటు గ్రామ గ్రామం భోరున విలపించిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఉపాధ్యాయుడు అడవిదారుల వెంట ప్రయాణం చేసి పాఠశాలకు వచ్చి చదువు చెబుతుంటే పేద తల్లిదండ్రులు డబ్బులు వేసుకుని గుర్రం కొనిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉపాధ్యాయ కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడితే ఆ కుటుంబాన్ని రక్షించి, ఆదరించి, తమలో ఒకరిగా ప్రేమించిన గ్రామాలున్నాయి. ఇలాంటి సందర్భాలు ఉపాధ్యాయులపై మరింత బాధ్యతను పెంచుతున్నాయి.
బడి బతకాలంటే..
ప్రాథమిక పాఠశాలల విలీనం, ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్, గిరిజన, మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు, ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం, బోధన కంటే బోధనేతర పనుల కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి రావటం, పాఠశాల సమయంలోనే యూ-ట్యూబ్ శిక్షణా తరగతులు... విద్యార్థికి-ఉపాధ్యాయుడుకి మధ్య సంబంధాన్ని మసకబారుస్తున్నాయి. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై నిరంతర ప్రాతినిధ్యం, అవసరమైన సందర్భంలో పోరాటం చేయాల్సి వస్తే తగ్గాల్సిన పనే లేదు, రాజీ పడేదే లేదు. ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించాల్సిన సమయాన్ని ఎవరు హరించినా అంగీకరించం-అని ఎలుగెత్తి చాటాలి. అదే సందర్భంలో ఒక్కొక్క విద్యార్థి ప్రభుత్వ బడిని వదిలేస్తుంటే మనసు విలవిలాడిపోతుంది. ప్రభుత్వ బడిని రక్షించుకోవడం కోసం తల్లిదండ్రులతో, సమాజంతో కలసి పోరాటం చేయాలి. బడి బతకాలంటే ఉపాధ్యాయులే చుట్టూ ఉన్న సమాజాన్ని సమీకరించాలి.
వాస్తవాలు చెప్పాలి
రాజ్యాంగం ఆర్టికల్ 51ఏ (హెచ్)లో ఈ దేశ ప్రజలందరికీ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి అనే మాట రాసుకున్నాము. శాస్త్రీయ దృక్పథాన్ని అందించటం అంటే నిరూపితమైన అంశాలు, పురావస్తు శాఖ ద్వారా తెలిసిన వాస్తవాలను విద్యార్థులకు అందించాలి.
అయితే 10,11,12 తరగతిలో డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని, 12వ తరగతి 9వ అధ్యాయంలో 'కింగ్ ఆఫ్ హిస్టరీ మొఘల్ దర్బార్' పాఠంలో 28 పేజీల చరిత్రని, 6వ అధ్యాయంలో భక్తి, సూఫీ సాంప్రదాయాలను, మతోన్మాదుల పట్ల గాంధీజీకి ఉన్న అయిష్టతను, నాధూరామ్ గాడ్సేకు సంబంధించిన వ్యాఖ్యలను, 11వ తరగతి సోషియాలజీ పుస్తకం నుండి 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అంశాలను, 9,10 తరగతులలో ఉన్న ఆవర్తన పట్టికలను పాఠ్యాంశాల నుంచి తొలగించారు.
2020-22 మధ్యకాలంలో కరోనా వల్ల పిల్లలకి బోధన చేయటం సాధ్యం కాలేదు కనుక, కరోనా అనంతరం పుస్తకాల బరువు తగ్గించడానికి పాఠ్యాంశాలను కుదించాం తప్ప మరింకే కారణం లేదని ప్రభుత్వం చెబుతున్నది. ఇది వాస్తవమా? పాఠాలను తొలగించడం ద్వారా వాస్తవ చరిత్రలను తెలియకుండా చేయడం ద్వారా, నాణ్యమైన విద్యార్థి తయారు కావడం సాధ్యం కాదు. ఏది తప్పో...ఏది ఓప్పో నిర్ణయించుకోవలసింది చదువుకునే విద్యార్థులు. కాని, రెండు కోణాలను చెప్పకుండా ఒకే కోణాన్ని విద్యార్థుల ముందుంచి ఇదే వాస్తమని చెప్పటం సరికాదు. వాస్తవ చరిత్రను రక్షించుకోవడం ఉపాధ్యాయుల బాధ్యత. రాజ్యాంగంలో నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంపొందించటం ఉపాధ్యాయుల కర్తవ్యంగా భావించాలి. ప్రతి సంఘటన వెనుక ఉన్న కారణాలను విశ్లేషించుకునే శక్తిని విద్యార్థికి ఇవ్వాలి.
ఉపాధ్యాయులు జీవ నది లాంటివారు
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని ఉపాధ్యాయులు అధ్యయనం చేయాలి. ఆ పరిణామం వెనుక ఎవరి ప్రయోజనం ఉందో స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. సంపద సృష్టించే వారు, ఆ సంపదను అనుభవించే వారిలో ఎవరి పక్కన ఎవరి ప్రయోజనం కోసం నిలబడాలో స్పష్టత ఉండాలి. ఆఫ్గన్ పరిణామాలను లోతుగా విశ్లేషించాలి. మతోన్మాదం పెరిగితే ప్రజలకు ఎలాంటి కష్టాలు వస్తాయో అర్ధం చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని, పర్యావరణాన్ని, మానవ హక్కులను ఖూనీ చేస్తూ ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యం లేదని గగ్గోలు పెడుతున్న సామ్రాజ్యవాదుల నిజస్వరూపాన్ని అర్ధం చేసుకోవాలి. సరిహద్దు దేశాల్లో ఏ దేశంతో ప్రమాదమో, ఏ దేశంతో సఖ్యతను ఏర్పరచుకోవాలో విశ్లేషించుకోవాలి. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, వాటి నిజ స్వరూపాలను అవగతం చేసుకోవాలి. ఆర్థిక సంక్షోభం, ఉక్రెయిన్, రష్యా యుద్ధం సందర్భంలో నాటో పాత్రను లోతుగా పరిశీలించాలి. మొత్తంగా ఉపాధ్యాయులు అన్ని అంశాల పట్ల ఒక స్పష్టమైన, సమగ్ర అవగాహన కలిగిన జీవనది లాగా సమాజానికి ఆదర్శంగా ఉండాలి.
/వ్యాసకర్త యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు /
ఎన్. వెంకటేశ్వర్లు