Jul 16,2023 12:51
  • నిందితుల ఇళ్లపై గ్రామస్తులు దాడి
  • గ్రామంలో పోలీస్‌ పికెటింగ్‌

ప్రజాశక్తి-బొబ్బిలి : విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం ఉద్దవోలులో ఉపాధ్యాయుడు కృష్ణ (58) మృతితో ఉద్రిక్తత నెలకొంది. శనివారం టీచర్‌ కృష్ణను ప్రత్యర్థులు వాహనంతో ఢకొీట్టి హత్య చేశారు. రాజకీయ కక్షతోనే కృష్ణను హత్య చేశారని ఆరోపిస్తూ.. నిందితుల ఇళ్లపై గ్రామస్తులు దాడికి దిగారు. గడ్డి కుప్పలను కాల్చివేయగా కారు, ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. దాడి విషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను అడ్డుకున్నారు. వారి నుంచి పెట్రోల్‌ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆందోళన చేస్తున్నవారికి పోలీసులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. మరోవైపు కృష్ణ మాస్టర్‌ పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు అధిక సంఖ్యలో గ్రామస్తులు, అభిమానులు, అధికారులు చేరుకున్నారు. అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, మండల నాయకులు హాజరయ్యారు. కృష్ణ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా పోలీసులు మోహరించారు. ఉద్దవోలులో పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

2

రాజకీయ కారణాలతో టీచర్‌ను చంపడం దారుణం: చంద్రబాబు

విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక టీచర్‌ను చంపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఉదాసీన వైఖరే కారణమని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలన్నారు.