May 28,2023 12:23

ప్రజాశక్తి - మార్టూరు రూరల్‌ (బాపట్ల) : జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని టాటా ఏస్‌ వాహనం ఢీకొట్టడంతో పాస్టర్‌ తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మార్టూరు మండల పరిధిలోని బొల్లాపల్లి టోల్‌ ప్లాజా సమీపంలో ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో జరిగింది.

బల్లికురవ 108 సిబ్బంది సురేష్‌, మనోహర్‌ తెలిపిన వివరాల ప్రకారం ... గుంటూరు సమీపంలోని నల్లపాడు వెంగళాయపాలెంలో ప్రార్ధన మందిరం నడిపిస్తున్న ఆర్‌.ప్రసాదరావు నెల్లూరులో జరుగుతున్న ప్రార్ధన కూటాలకు తన సంఘ సభ్యులతో కలిసి మందిరానికి చెందిన టాటా ఏస్‌ వాహనంలో వెళ్లి హాజరయ్యారు. తిరిగి శనివారం అర్ధరాత్రి కూటాలు ముగిసిన అనంతరం తమ స్వగ్రామం వెంగళాయాపాలెం వెళుతుండగా... వీరు ప్రయాణిస్తున్న వాహనం బల్లాపల్లి టోల్‌ ప్లాజా దాటిన అనంతరం ఆగి ఉన్న లారీని గుర్తించక ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాస్టర్‌ ప్రసాదరావు కేబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. ముందు కూర్చున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. టోల్‌ ప్లాజా సిబ్బంది అప్రమత్తమై టాటా ఏస్‌ వాహనంలో ఇరుక్కుపోయిన పాస్టర్‌ ని అతి కష్టం మీద బయటకు తీశారు. సమాచారం అందుకున్న 108 బల్లికురవ సిబ్బంది క్షతాగాత్రులను ముందుగా మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో పాస్టర్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.