Sep 04,2022 11:41

కుక్కర్‌ అదేపనిగా పిలుస్తూంది
నిస్తేజంగా అడుగులు వంటింటిని చేరారు
ఉడికే అన్నం, పప్పు వాసనని
పట్టించుకున్న ముక్కు
పేగులకి కబురు పంపినట్లుంది

అప్పుడు మొదలయ్యింది -
కడుపు నుండీ దేహానికి
అనామక ఆకలి పాటొకటి
పీలికలైన మనసు, చింపిరి
నైరాశ్యంలో మునకలేసేటప్పుడు
ఏదీ క్రమంలో జరుగదు కదా!

ఎవరైతే మాత్రమేం?
కొన్నిటికి ప్రతీకలుగా మిగిలి
నమూనాల చిట్టా రాయవలసినవారే

హృదయం కడుపేదదయి పోతుందొక్కోసారి
దుఃఖం పగిలి పారుతుంది
చిట్టచివరి దుఃఖ బిందువు కూడా
మాయమయ్యాక
నిస్తేజాన్ని కప్పుకుని మాత్రమే
కొంత ప్రయాణం చెయ్యాలి

ఆలోచనల్ని ఆపాలనుకోవచ్చు
మెదడుని నిలపాలనుకోవచ్చు
ఏది ఎప్పుడు చేతుల్లో సాధ్యమో
ఎలా చేతలు దారితప్పుతాయో
ఎవరికీ తెలియని స్థితి

అనామధేయ స్వరాలే అన్నీ అని అన్నావా?
ఇక నీపని అంతే!
యాంత్రిక మాటలూ
తాంత్రిక మర్మాలూ
మాంత్రిక మాయలూ
ఇవి రావా చెప్పు?
సందు చివరో సమాజముంటుంది
ఇంటిమధ్య నుండీ దారొకటి చీలుతుంది
నువ్వు ప్రకటించబడతావ్‌, ఇలా అలా అని

అంటరానితనంతో కునారిల్లుతున్న
సమాజానికి
నిన్ను నువ్వు అంటుకట్టుకోకపోతే
ఇలా కూడా బతకలేవు కదా..

ఇప్పటికి ఇంతే!
మిగిలిన కథకి కాగితం లేదు
కలం కులాన్ని నమిలేసింది
భావం మతాన్ని వంటబట్టించుకుంది
నేనూ, నువ్వూ, మనలాంటివారం, దేశీయతని
నాటకీయంగా నరాలకెక్కించుకున్నాం.

 

- బండి అనురాధ
anuradhabandi2020@gmail.com