'పాము విషపూరితమైనది. మనుషులు కనిపిస్తే కాటేస్తుంది. కాబట్టి పాములను బతకనీయకూడదు. చంపేయాలి' అన్న మాటలు వింటూ పెరిగిన వేదప్రియ.. అవన్నీ అపోహలని, విషం.. పాములకు ఆత్మరక్షణగా ఉపయోగపడే సాధనమని నిరూపించేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్నేక్ కాచర్‌గా విధులు నిర్వహిస్తోంది. పురుషులు మాత్రమే ఉండే ఈ రంగంలో మహిళలు రాణించడం చాలా అరుదు. అయినా వేదప్రియ లాంటి వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు తారసపడుతూనే ఉంటారు.
తమిళనాడుకు చెందిన వేదప్రియ గణేశన్, చిన్నతనం నుండే వన్యప్రాణుల రక్షణ కోసం పనిచేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా అత్యంత విషపూరిత పాములను రక్షించడంలో ఎప్పుడూ ముందుండేది. 'ఆ కోబ్రాని చంపకండి..' అంటూ బిగ్గరగా అరిచి, తన చుట్టూ కర్రలతో నుంచొన్న జనాలను తోసుకుంటూ ముందుకెళ్లింది వేదప్రియ. బళ్ల కింద కదలక మెదలక ఉన్న కోబ్రాను చేతితో తీసి దూరంగా పడేసింది. ఆ క్షణంలో చుట్టూ ఉన్నవాళ్లు ఆమె ధైర్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు. అప్పుడు ఆమె 11వ తరగతి చదువుతోంది. ఆ వయసు నుండే వన్యప్రాణులపై ఆమెకు వల్లమాలిన అభిమానం మొదలైంది.
వేల సంఖ్యలో ...
ఆ సంఘటన జరిగిన 8 ఏళ్ల తరువాత 'వెస్ట్రన్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ కన్సర్‌వేషన్' ట్రస్టు తరపున చీఫ్ కోఆర్డినేటర్‌గా, వన్యప్రాణి సంరక్షకురాలిగా ఆమె ఎన్నో మైలురాళ్లు అధిగమించింది. చెన్నరు, కోయంబత్తూర్, పొల్లాచి, మదురై వంటి తమిళనాడు అటవీ పరివాహక ప్రాంతాల్లో 8000 పైచిలుకు పాములను, మరెన్నో వన్యప్రాణులను రక్షించింది. తమిళనాడు ఫారెస్ట్ డిపార్టుమెంటు, తమిళనాడు ఫైర్ అండ్ సేప్టీ రెస్క్యూ డిపార్టెమెంట్ ప్రోత్సాహంతోనే ఈ అద్భుతాలు సాధించానని ఆమె చెబుతోంది.
పురుషులు మాత్రమే ఉండే ఈ రంగంలో వేదప్రియ ప్రొఫెషనల్ స్నేక్ క్యాచర్‌గా మారడం సాధారణ విషయం కాదు. 'ఈ రంగంలో ఎదిగేందుకు ముందుగా నన్ను నేను శక్తివంతురాలిగా సిద్ధం చేసుకున్నాను. ఒక మహిళ తన కాళ్ల మీద తాను నిలబడగలిగే ధైర్యం ఉన్నప్పుడే, ఆమె అందరి మహిళల తరపున నిలబడుతుంది' అని ఆమె చెబుతోంది. ఎవరైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా పాము ఉందని ఫోను చేస్తే - వెంటనే అక్కడికి చేరుకుంటుంది వేదప్రియ. పామును పట్టుకొని సురక్షితంగా ఫారెస్టు డిపార్టుమెంటుకు అప్పగించడమో.. దగ్గరలోని అడవిలో వదిలివేయడమో చేస్తుంది. పాములతో పాటు, బ్లాక్ కైట్స్, కోతులు, దుప్పిలు, ఏనుగులు, లేళ్లు వంటి అనేక వన్యప్రాణులు ఆమె సంరక్షించిన వాటిలో ఉన్నాయి.
పాములను, వన్యప్రాణులను రక్షించడంతోనే ఆగిపోకుండా.. పాము కాటుా ప్రథమ చికిత్స, వన్యప్రాణుల రక్షణ, అగ్నిమాపకా భద్రతా, రెస్క్యూ వంటి అంశాల్లో ఆమె శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఆమె చేస్తున్న విశేషకృషిని గుర్తించిన పొల్లాచ్చికి చెందిన 'రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఎస్‌ఐఐఎంఎస్', ఇటీవల ఆమెను 2023ా24కి గాను 'డాటర్ ఆఫ్ ఫారెస్ట్' అవార్డుతో సత్కరించింది.










