ఒక కొంగ అడవి యాత్రలు అంటూ బయలుదేరి చాలా అడవులు దర్శించింది. ప్రయాణంలో ఒకరోజు ఉదయాన్నే దానకొండ అడవిలోకి ప్రవేశించి, ఒక చెట్టు మీద ఆగింది. ఆ చెట్టు మీద పక్షులన్నీ శోకంతో ఉండటం గమనించింది. సింహాలు, పులులతో సహా ఒక చనిపోయిన చిన్ని ఏనుగు చుట్టూ కూర్చొని, ఏడుస్తూ దాని మాంసాన్ని తినడం, పక్షులు కన్నీటితో ఏనుగు మాంసాన్ని నోటిలో ఉంచుకొని చెట్టుపైకి వచ్చి కూర్చొని తింటూ ఏడవడం చూసింది. కొద్ది దూరంలో పెద్ద ఏనుగు ఏడుస్తూ కూర్చుంది. అక్కడి వాతావరణం కొంగకు వింతగానూ, అర్థం కాకుండా ఉంది.
పక్కనే వున్న కాకికి తనను తాను పరిచయం చేసుకుని, అక్కడ జరుగుతున్న వింత పరిస్థితి గురించి అడిగింది కొంగ. అప్పుడు 'తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు రెండూ సర్కస్‌లో పని చేసేవి. జనంలో సర్కస్‌కు ఆదరణ తగ్గడంతో జంతువులను పోషించలేక అడవిలో వదలి వెళ్లారు. ఆ ఏనుగుల తెలివితేటలు గమనించి మా సింహం రాజు గారు ఎంతో ఆశ్చర్యపడ్డారు.
తల్లి ఏనుగును తన సలహాదారునిగా నియమించిన తరువాత, ఏనుగు సలహాను అనుసరించి పాలన చేయడం వలన రాజ్యంలో కలిగిన మార్పులు చూసి అడవి జంతువులన్నీ సంతోషించాయి. ఆ చిన్ని ఏనుగుకు అడవిలోని పిల్ల జంతువుల బాగోగులు చూసే పని ఇచ్చాడు సింహం రాజు. ఆ పిల్ల ఏనుగు తనకు తెలిసిన సర్కస్ విద్యలతో పాటు కొత్త రకమైన అట పాటలు నేర్పిస్తూ, నీతి కథలు చెప్పేది. నిన్నటిరోజు ఆ చిన్ని ఏనుగు అనుకోని వింత జబ్బుతో మరణించింది. దానిని రాజ మర్యాదలతో తీసుకెళ్లి, పాతిపెట్టాలని నిర్ణయించుకున్నాం. అయితే ఆ తల్లి ఏనుగు అంగీకరించలేదు. మాంసాన్ని తినే జంతువులూ, పక్షులూ ఆ ఏనుగు మాంసాన్ని తినాలని తల్లి ఏనుగు మొండి పట్టుపట్టింది. ఎందుకు అని మేమడి గితే ''కారణం తరువాత చెబుతాను అంది'' అంటూ చెప్పుకొచ్చింది కాకి.
'అదేంటి! తల్లి ఏనుగు ఆ చిన్ని ఏనుగును కన్నతల్లేనా..? రాజు గారికి సలహాదారునన్న గర్వంతో కళ్ళు మూసుకు పోయాయా?' అని ఆలోచిస్తోంది కొంగ. అంతలో మృగరాజు తల్లి ఏనుగు దగ్గరకెళ్ళి 'ఇప్పటికైనా అసలు విషయం చెప్పు.. ఏదో బలమైన కారణం లేకుండా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని నేననుకోవడం లేదు' అన్నాడు.
'అవును. మీరన్నది నిజం. నేనింతకముందు పనిచేసిన సర్కస్ యజమాని కొడుకు ప్రమాదానికి గురై చనిపోయాడు. అప్పుడు అతని అవయవాలు దానం చేసి ఎనిమిది మందిని బతికించాడని వాళ్ళంతా మాట్లాడుకుంటుంటే విన్నాం. అది విన్న నా బిడ్డ ''అమ్మా! మనమూ ప్రమాదవశాత్తూ చనిపోతే మన మాంసాన్ని ఇతర జంతువులు ఆహారంగా తీసుకుంటే, వాటి ఆకలి తీరుతుంది. మట్టిలో పూడ్చిపెడితే ఎవరికి ఉపయోగం?'' అని అడిగింది. నాకూ నిజమే ననిపించింది. నా కన్నబిడ్డ కోరిక తీర్చాలనే ఇలా!' అంటూ బోరుమంది తల్లి ఏనుగు.
వెంటనే కొంగ ఏనుగును క్షమించమ న్నట్టు తలవంచి, అంత ఉన్నతంగా ఆలోచిం చినందుకు అభినందించింది. తన ప్రయాణంలో అనేకచోట్ల ఈ గొప్ప విషయాన్ని ప్రచారం చేసింది.
ఓట్ర ప్రకాశరావు
09787446026