- బాలింతలు, గర్భిణులకు ఇళ్లకే సరుకులు
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : గర్భిణులు, బాలింతలకు ఇళ్లకే రేషన్ (టేక్ హోం రేషన్) అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆగస్టు రెండో తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు గర్భిణులు, బాలింతలకు బియ్యం తూకం వేసి ఇచ్చేవారు. ఇకపై మూడు కేజీలు చొప్పున ప్యాకెట్ల రూపంలో అందించనున్నారు. టేక్ హోం రేషన్ అమలుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు లబ్ధిదారులకు సంబంధించి ఫేస్ రికగేషన్ తీసుకోవాలని ఆదేశించడంతో ప్రస్తుతం సిబ్బంది ఆ పనిలో నిమగమయ్యారు. లబ్ధిదారులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా నమోదు చేయాలని ప్రభుత్వం సూచించడంతో ఆ వివరాలనూ నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 257 సమగ్ర శిశుసంక్షేమ అభివృద్ధి (ఐసిడిఎస్) ప్రాజెక్టుల పరిధిలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 48,770 ప్రధాన కేంద్రాలు కాగా, 6,837 మినీ సెంటర్లు. సుమారు 32.91 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారిలో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు 15.67 లక్షల మంది, మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్న చిన్నారులు 10.09 లక్షల మంది, గర్భిణులు, బాలింతలు కలిపి సుమారు 7.15 లక్షల మంది ఉన్నారు. ఇప్పటివరకు వీరందరికీ అంగన్‌వాడీ కేంద్రాల్లో తయారు చేసిన పదార్థాలనే ప్రస్తుతం పెడుతున్నారు. 'టేక్ హోం రేషన్'లో భాగంగా గర్భిణులు, బాలింతలకు ఇళ్లకే సరుకులను అందించనున్నారు. వారికి తొలి విడతలో మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, అర లీటరు నూనె, అటుకులు, రాగి పిండి, జొన్న పిండి, చెక్కీ, కర్జూరం, బెల్లం అరకేజీ, 13 గుడ్లు, రెండున్నర లీటర్ల పాలు ఇవ్వనున్నారు. రెండో విడతలో 12 గుడ్లు, రెండున్నర లీటర్ల పాలు అందిస్తారు.
మూడేళ్లలోపు పిల్లలకు తొలుత 13 గుడ్లు, లీటరన్నర పాలు, బాలామృతం, రెండో విడతలో 12 గుడ్లు, లీటరు పాలు అందజేస్తారు. ప్రతి రోజు ప్రీస్కూల్ పిల్లలకు 75 గ్రాముల అన్నం, 15 గ్రాముల పప్పు, ఐదు గ్రాముల నూనె, గుడ్డు, వంద మిల్లీలీటర్ల పాలు పంపిణీ చేస్తారు.










