Jan 01,2023 07:38

కొత్త సంవత్సరం వచ్చేసింది. మరి నోరు తీపి చేసుకుందాం. అయితే మార్కెట్‌లో దొరికే వాటితో అనారోగ్యాలు కొనితెచ్చుకోవడమే. మనమే స్వయంగా ఇంట్లో తయారుచేసుకుంటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బులూ ఆదా అవుతాయి. అయితే మనింట్లోనే అందుబాటులో ఉండేవాటితో కమ్మని తీపి పదార్థాలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.. కొత్త సంవత్సరం మన తయారుచేసిన స్వీటు తిని, తీపిగా స్వాగతం పలుకుదాం..
బాదం హల్వా

1


కావలసినవి : బాదం - కప్పు, నెయ్యి - 3/4 కప్పు, బొంబాయి రవ్వ - రెండు స్పూన్లు, మామూలు పాలు - 2 కప్పులు, పచ్చిపాలు - 2 స్పూన్స్‌, కుంకుమపువ్వు - రెండు చిటికెళ్లు, బాదం పలుకులు - రెండు స్పూన్లు.
తయారీ : మరిగేనీళ్లలో 10 నిమిషాలు బాదంపప్పు ఉడికించాలి. వీటిని చల్లటినీటిలోకి మార్చుకుని, ఐదు నిమిషాల తర్వాత గింజను వేళ్లతో నెమ్మదిగా నొక్కితే, పుచక్‌మంటూ పొట్టు మొత్తం పోతుంది. ఇలా పొట్టు తీసిన బాదం గింజలను మిక్సీలో వేసి, కప్పు పాలు పోసి, మెత్తగా మిక్సీపట్టాలి. ఇప్పుడు స్టప్‌పై మందపాటి గిన్నె పెట్టి దానిలో పావుకప్పు నెయ్యి వేసి, బొంబాయిరవ్వ వేసి వేయించి, తర్వాత బాదం పేస్ట్‌ వేసి, పచ్చివాసన పోయే వరకూ కలుపుతూ ఉండాలి. తర్వాత కప్పు పాలు పోసి బాగా కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు కుంకుమపువ్వు కలిపిన పచ్చిపాలు పోసి, మళ్లీ కలుపుకోవాలి. నెయ్యిని రెండేసి స్పూన్లు ప్రతి ఐదు నిమిషాలకు వేస్తూ బాగా కలపండి. నెయ్యి పైకి తేలాక, చివరిలో బాదం పలుకులతో గార్నిష్‌ చేయండి. స్వీట్‌ కొందరికి వెగటుగా అనిపిస్తుంది. కావాలంటే దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. తప్పనిసరి కాదు.

గోధుమ స్వీట్‌

2


కావలసినవి : గోధుమలు - కప్పు, నీళ్లు - తగినన్ని, పచ్చికొబ్బరి తురుము - కప్పు, బెల్లం - కప్పు, నెయ్యి - రెండు స్పూన్లు, బొంబాయి రవ్వ - రెండు స్పూన్లు, యాలకుల పొడి - కొద్దిగా.
తయారీ : గోధుమలను 3, 4 సార్లు కడిగిన తర్వాత, నీళ్లలో రాత్రంతా నాననివ్వాలి. తెల్లారి వీటిని మరలా కడిగి, మిక్సీలో వేసి, నీళ్లు పోసి వెన్నలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాటన్‌ క్లాత్‌ తీసుకుని రెండుపొరలుగా వేసి, వడకట్టుకోవాలి. ఈ వడకట్టిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని మళ్లీ మిక్సీలో వేసి, పచ్చికొబ్బరి తురుము, కొద్దిగా నీళ్లు పోసి, మళ్లీ మెత్తగా మిక్సీ పట్టాలి. దీన్ని కూడా అందులోకే క్లాత్‌తో వడపోసుకోవాలి. ఒక గిన్నెను స్టవ్‌పై పెట్టి, బెల్లం వేసి, కొద్దిగా నీళ్లు పోసి, ఒక పొంగు రానిచ్చి, కట్టేసి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టప్‌పై మరో మందపాటి గిన్నె పెట్టి దానిలో తయారుచేసి పెట్టుకున్న గోధుమపాలను పోసి, మీడియం ఫ్లేమ్‌ మీద కలుపుతూనే ఉండాలి. ఉండలు కడుతూ ఉంటే కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇది గరిటెతో పైకి లేపితే తెరతెరలుగా పడాలి. ఇప్పుడు బెల్లం పాకాన్ని వడపోసి కలపాలి. దీన్ని బాగా కలుపుతూ, కొద్దిగా కొద్దిగా నెయ్యి వేస్తూ బాగా కలపాలి. యాలకుల పొడి కూడా వేసి, మరికొంతసేపు కలపాలి. ఇది కూడా గరిటెతో పైకి లేపితే తెరతెరలుగా పడాలి. దీన్ని ఒక ట్రేలో నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని సమానంగా సర్ది, రెండు గంటలసేపు వదిలేయండి. తర్వాత ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. జున్నులా, నోటిలో కరిగిపోయేలా గోధుమహల్వారు రెడీ. దీనిలో ఎలాంటి డ్రైఫ్రూట్స్‌ వేసుకోరు. కావాలంటే మీరు వేసుకోండి.

బేసన్‌ లడ్డూ

3


కావలసినవి : బూరా - 250 గ్రాములు, నెయ్యి - 250 గ్రాములు, శనగపిండి - 250 గ్రాములు, యాలకులపొడి - కొద్దిగా, బాదం పలుకులు - రెండు స్పూన్లు, జీడిపప్పు, కిస్మిస్‌ నేతిలో వేపినవి - కొద్దిగా.
బూరా : పంచదార -250 గ్రాములు, నీళు- అరకప్పు.
తయారీ : స్టవ్‌పై మందపాటి పాన్‌ పెట్టి, పంచదార, నీళ్లు పోసి కలుపుతూ ఉండాలి. హల్వాలా దగ్గరపడ్డాక దింపేయాలి. దింపేశాక కూడా బాగా కలుపుతూ ఉండాలి. అలా చల్లారేంత వరకూ కలుపుతూనే ఉండాలి. దీన్ని మిక్సీలో వేసుకోవాలి. దీన్ని జల్లెడపడితే రవ్వ మాదిరి వస్తుంది. ఇది సిటీల్లో కొన్నిచోట్ల అమ్ముతారు. కానీ ఇలా తయారుచేసుకుంటే బాగుంటుంది.

4


తయారీ : స్టవ్‌పై మందపాటి పాన్‌ పెట్టి, నెయ్యి పోసి, కరిగించాలి. శనగపిండి వేసి మీడియం ఫ్లేమ్‌ మీద బాగా కలుపుకోవాలి. నెయ్యిలో పిండికలిసి, నీళ్లులా మారుతుంది. బాగా కలుపుతూ వేపుతూ ఉంటే, జీడిపప్పు వేగిన వాసన వస్తుంది. అప్పుడు దాన్ని దించి, చల్లార్చుకోవాలి. అంటే తాకగలిగే వేడి ఉంటే సరిపోతుంది. దీనిలో బూరా పొడి వేసి కలపాలి. దీనిలోనే యాలకులపొడి కూడా వేసుకోవాలి. బాదం పలుకులనూ వేసి కలపండి. దీన్ని గట్టిగా లడ్డూలు చుట్టుకోవాలి. కావాలంటే లడ్డూలపై జీడిపప్పు, కిస్మిస్‌ నేతిలో వేయించినవాటితో గార్నిష్‌ చేసుకోవచ్చు.