చెరకు.. ఆ పేరు చెప్పగానే ఎవరికైనా సరే మధురమైన రుచి మస్తిష్కంలో మెదిలి, ఇట్టే నోరూరుతుంది. ఇంతవరకు వాణిజ్య సాగుగా పెరిగేది ఈ చెరకు. ఇప్పుడు ఇంటి పెరట్లో, కుండీలో,్ల ఆర్నమెంటల్ మొక్కగా పెంచుకునే సౌలభ్యం ఉంది. అనేక రంగుల్లో లభించే చెరకు రకాలు ఇళ్లలో పెంచుకోవటం సరికొత్త ట్రెండ్‌గా మారుతోంది. వెదురు మాదిరిగా కణుపులు కణుపులుగా ఉండే చెరకు గడ్డి జాతి మొక్క. ఫొయేసి కుటుంబానికి చెందిన మాగ్నోలియో ఫైటా మొక్క ఇది. సాధారణ చెరకు పది నెలల్లో పక్వానికి వస్తుంది. సరికొత్త హైబ్రిడ్ వంగడాలతో రూపొందుతున్న చెరకు 6,7 మాసాల్లో పంట అందుబాటులోకి వస్తోంది. బెల్లం, పంచదార పానకం, చెరకు రసం, జ్యూస్, పలు పదార్థాల తయారీలో వాడే చెరకు గురించి ఈ వారం మనం తెలుసుకుందాం!
- సచ్చరమ్ అఫిసినరమ్..
సన్నటి చెరుకుగడలు.. చింతపిక్క రంగులో ఉండి చిన్న చిన్న కణుపులుగా పెరిగే అందమైన మొక్క సచ్చరమ్ అఫిసినరమ్. మొక్క మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కుండీలో గుబురుగా పెరిగే గడ్డి జాతి మొక్క ఇది. చెరుకు గడలు, దానిపైన పొడవాటి ఆకులతో భలే అందంగా ఉంటుంది. దీన్ని ఇంటి పెరట్లో నేల మీద, కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాకుతో సన్నటి చెరుకు గడల ముక్కలను కోసుకుని, జ్యూస్ చేసుకోవచ్చు. రసాయనాల్లేని ఈ స్వచ్ఛమైన చెరకు రసాన్ని తీపికి బదులుగా వాడుకోవచ్చు. చూడ్డానికి ఆర్నమెంటల్ వెదురు మొక్కలా ఎంతో ఆకర్షణగా కనిపిస్తుంది.
- మలేషియన్ షుగర్ కేన్..
చెరకు మొక్కల్లో రారాజుగా మలేషియన్ చెరకుని చెప్తుంటారు. ముదురు చింతపిక్క, నలుపు రంగుల్లో ఉండే ఈ చెరకు చాలా తియ్యగా ఉంటుంది. చెరకు గడ కూడా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది. పత్రాలు ఆకుపచ్చగా, పొడవుగా ఉండి మరింత అందాన్ని అద్దుతాయి. తెల్లటి పింగాణీ కుండీల్లో ఈ మొక్కల్ని పెంచుకుంటే రమణీయతను చాటుతాయి. ఏడాది పాటు కళాకృతిగా అలరిస్తుంది. తర్వాత చెరకును మనం ఉపయోగించుకోవచ్చు. పూర్తిగా తయారైన తర్వాత చెరకు కణుపుల మీద తెల్లని బూడిద తయారవుతుంది.
- హవాయియన్ షుగర్ కేన్ స్ట్రైప్స్..
చెరకు కణుపులపై చారలుండే రకం హవాయియన్ షుగర్ కేన్ స్ట్రైప్స్. చిన్న చిన్న కణుపులు, మధ్యలో ఉబ్బెత్తుగా వాటి రెండు చివరల కాస్త నొక్కినట్టు ప్రత్యేకమైన నిర్మాణంలో, భలే ఆకర్షణగా ఉంటాయి. లేత ఆకుపచ్చ కణుపుల మీద.. లేత గులాబీ రంగు చారలు చూడ్డానికి అందంగా ఉంటాయి. ఈ చెరకు చూడ్డానికి ఆర్నమెంటల్ వెదురు పొదలా ఉంటుంది. దీన్ని కుండీల్లో, నేల మీద కూడా పెంచుకోవచ్చు. ఎరుపు, నల్లరేగడి నేలల్లో బాగా పెరుగుతుంది. వారానికి ఒకసారి నీటి వనరు అందిస్తే సరిపోతుంది.
- హవాయియన్ షుగర్ కేన్ బ్రౌన్..
మరో అందమైన రకం హవాయియన్ షుగర్ కేన్ బ్రౌన్. చెరకు గడంతా బ్రౌన్ రంగులో ఉండి, కణుపులన్నీ ఏకరీతిగా ఉంటాయి. ఇది పది నెలల కాలం పెరుగుతుంది. దీన్ని పింగాణీ తొట్టెలో, నేల మీద కూడా పెంచుకోవచ్చు. ముదురు ఆకుపచ్చని పొడవాటి ఆకులతో ప్రత్యేకంగా ఉంటుంది. మిరియాలు, నిమ్మరసం, పుదీనా, సబ్జా గింజలు యాడ్ చేసి, జ్యూస్ చేసుకుంటే మధురస భరితమే.
- లవ్ కోన చెరకు..
చూడ్డానికి వెదురులా కనిపిస్తుంది లవ్ కోన చెరకు. లేత పసుపు రంగు చెరకు గడల మీద.. ముదురు ఆకుపచ్చ చారలు దీని ప్రత్యేకత. కణుపు కణుపుకీ మీసాల్లాంటి వేరులు ఉంటాయి. ఈ చెరుకు తీపిదనం కాస్త తక్కువే. కుండీల్లోనూ, నేల మీద పెంచుకోవచ్చు.
- మహాయ్ ఉత..
పొదల మాదిరిగా, గెడలు గుబురుగా పెరిగే చెరకు మహాయ్ ఉత. ఈ చెరకును కుండీల్లో, నేల మీద పెంచుకోవచ్చు. వాణిజ్యపరంగానూ ఉపయోగపడే రకం. వెలుతురు ప్రాంతాల్లో ఈ మొక్కలు తేజస్సుగా కనిపిస్తాయి.
- ఇంటర్నొడ్..
నల్లటి చెరకు గెడలకు పై నుంచి కింద వరకు తెల్లని రింగులు ఉంటాయి. రసం బాగా ఉండే రకం ఇది. ఒక్కొక్క గడ విడిగా పెరగడం దీని ప్రత్యేకత. దీన్ని బుద్దాస్ చెల్లీస్ బ్యాంబో షుగర్ కేన్ అని కూడా అంటారు. ఆకులు జుట్టు విరబోసినట్లుగా కనిపిస్తాయి.
- గ్రీన్ షుగర్ కేన్..
చెరకు సన్నగా ఉండి, రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇది దేశవాళీ రకానికి దగ్గర జాతి. రసం ఎక్కువగా ఉంటుంది. పంచదార, బెల్లం ఉత్పత్తికి అంతగా పనికిరాదు. సన్నగా, నాజుగ్గా, అందంగా బాంబో స్టిక్స్‌లా ఉంటుంది.
- చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506