Jul 02,2023 11:48

ఎర్రటి ఆ పండు రంగుకు టెంప్ట్‌ అయిపోతారు ఎవ్వరైనా. ఏ పండు అంటున్నారా.. అదేనండీ స్ట్రాబెర్రీ. ఈ స్వీట్‌హార్ట్‌లో 'ఆంథోసైనిన్‌' ఎక్కువగా ఉండటం వలన అంతటి ఎరుపు రంగును సంతరించుకుంది. పులుపు, తీపి కలగలసిన రుచి.. దాని సువాసన, ప్రకాశవంతమైన రంగు, జ్యూసి నేచర్‌, ఆకారం, తియ్యదనం.. ఇవే కాదండోరు.. దీనిలో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. బెర్రీలన్నింటిలో విత్తనాలు పండ్ల లోపల ఉంటాయి. కానీ దీని విత్తనాలు గుండె ఆకారంలో ఉండే ఈ పండు చుట్టూ చుక్కల్లా బయటివైపే ఉంటాయి. స్ట్రాబెర్రీలో విటమిన్‌ సి, ఫోలేట్‌, ఫైబర్‌, పొటాషియం ఉంటాయి. అసలు దీని పుట్టిల్లు చిలీ. 1714 లో ఫ్రెంచ్‌ ఆర్మీ ఇంటెలిజెన్స్‌ కార్ప్స్‌కు చెందిన అమెడీ-ఫ్రాంకోయిస్‌ ఫ్రెజియర్‌ చిలీ నుండి దక్షిణ అమెరికాకు తెచ్చారు. ఆ తర్వాత కాలక్రమేణా ప్రపంచమంతా విస్తరించింది.

నదేశంలో.. 19వ శతాబ్దం ప్రారంభంలోనే.. 1836-42లో గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఆక్లాండ్‌ మొట్టమొదట స్ట్రాబెర్రీలను పండించినట్లు చరిత్ర చెబుతోంది. స్ట్రాబెర్రీ మహాబలేశ్వరం కొండల్లో పండుతుంది. మనదేశంలోని అత్యుత్తమ స్ట్రాబెర్రీలు మహాబలేశ్వరం నుండి వస్తాయి. మనదేశంలో 85 శాతం ఉత్పత్తి అక్కడే. ఇటీవల అరకులో కూడా వీటిని పండిస్తున్నారు. ఎక్కువగా శీతల ప్రాంతాల్లో పండించే స్ట్రాబెర్రీలు.. రవాణా, మార్కెంటింగ్‌ సదుపాయాలు పెరగడంతో అంతటా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సూపర్‌ మార్కెట్లలో, పట్టణాల్లో మాత్రమే లభించేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకీ వచ్చేశాయి.
 

                                                                  ఎందుకు ఖరీదైనవి..?

దీని సాగుకు మిగిలిన పంటల కంటే చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎరువులు, నీటి ఖర్చులు, పురుగుమందులు అన్నింటి విషయంలో నిరంతరం అప్రమత్తంగానే ఉండాలి. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా పూర్తిగా నష్టపోయేంత సున్నితమైన పంట ఇది. అంతేకాక మన భౌగోళిక ఉష్ణోగ్రత ఈ పంటకు అంత అనుకూలం కాదు. అందుకే ఇది మనదేశంలో తక్కువ ప్రదేశాలలోనే పండిస్తారు. తక్కువగా దొరికే పండు కావడంతో దీని ఖరీదూ ఎక్కువగానే ఉంటుంది.
 

                                                                    ఏఏ రకాలు.. ఎక్కడెక్కడ..

చాండ్లర్‌, టియోగా, టోరే, సెల్వా, బెల్రుబి, ఫెర్న్‌, పజారో, ప్రీమియర్‌, రెడ్‌ కాస్ట్‌, లోకల్‌ జియోలికోట్‌, దిల్పసంద్‌, బెంగళూరు, ఫ్లోరిడా 90, కాట్రెయిన్‌ స్వీట్‌, పూసా ఎర్లీ డ్వార్ప్‌, బ్లేక్‌మోర్‌ భారతదేశంలో పండించే ముఖ్యమైన స్ట్రాబెర్రీ రకాలు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, మనదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాగు చేస్తారు. ప్రపంచ వ్యాపితంగా చైనా, అమెరికా, టర్కీ, స్పెయిన్‌, ఈజిప్ట్‌, మెక్సికో, రష్యా, జపాన్‌, దక్షిణ కొరియా, పోలాండ్‌, జర్మనీ తదితర దేశాలలో పండిస్తున్నారు.

                                                                    ఆరోగ్య హేతువు..

'పండ్ల రాణి'గా పిలువబడే స్ట్రాబెర్రీ రంగు, రుచిలోనే కాదు పోషక విలువల్లోనూ ఘనాపాటే. చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్టాబెర్రీ ఉదయం పూట తీసుకోవడం వలనే ఎక్కువ లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి నారింజలో కంటే ఎక్కువ విటమిన్‌ సిని కలిగి ఉంటాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్‌లు అధికంగా ఉంటాయి. పాలీఫెనాల్స్‌ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లను అధిక స్థాయిలో కలిగి ఉంటుంది. స్ట్రాబెర్రీ చెడు కొలెస్ట్రాల్‌, సోడియం లేని పండు. వైద్యపరంగా అత్యంత ప్రభావవంతమైన పండు.
 

                                                                      ఔషధగుణాల్లో..

క్యాన్సర్‌, గుండె జబ్బులను నిరోధిస్తాయి. స్ట్రాబెర్రీలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తోంది. ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
కంటి ఆరోగ్యానికి స్ట్రాబెర్రీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్‌ కంటి శుక్లాలను నివారించడంతో, అంధత్వాన్ని దూరం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. నోటి సమస్యలను.. క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి సమస్యలను.. నోటి దుర్వాసన, దంత సమస్యలనే కాకుండా నోటి క్యాన్సర్‌ను నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
స్ట్రాబెర్రీల్లోని యాంటీఆక్సిడెంట్స్‌, ఫైటోకెమికల్స్‌ కీళ్లనొప్పులను తగ్గిస్తున్నాయట.
అంతేకాకుండా వీటిని నిత్యం తీసుకుంటే ముసలితనం నుంచి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

                                                                        మరికొన్ని..

  • చార్లెస్‌ లిన్నెయస్‌ స్ట్రాబెర్రీకి ఫ్రాగారియా అనే జాతికి చెందినదిగా నిర్ణయించి స్ట్రాబెర్రీ అని పేరు పెట్టారు.
  • మొదట దీనిని స్ట్రూబెర్రీ అని పిలిచేవారు.
  • స్ట్రాబెర్రీలను చూస్తే కొంత మంది భయపడతారట. ఆ భయాన్ని ఫ్రాగారియా ఫోబియా అంటారు.