తీపి పదా ర్థాలు అంటే పిల్లలు ఎంతో ఇష్టపడతారు. అలాగని స్వీట్ షాపులో చటుక్కున కొనేసి తెస్తే, రుచి ఏమోగానీ, ఆరోగ్యానికి హాని కూడా. అందుకే మనమే అలా స్వీట్లు తయారుచేసి పెడితే.. పిల్లలు ఆనందపడటమే కాకుండా. ఆరోగ్యంగా ఉంటారు. అయితే అవి ఎలా ఇంట్లోనే తేలికగా తయారుచేయాలో తెలుసుకుందాం..
స్వీట్ కట్‌లెట్
కావలసిన పదార్థాలు : బొంబాయి రవ్వ - అర కప్పు, పాలు - కప్పు, చిటికెడు, నీళ్లు- కప్పు, నూనె - తగినంత, నెయ్యి - తగినంత, జీడిపప్పులు, కిస్మిస్ - రెండేసి స్పూన్లు చొప్పున, పంచదార -కప్పు. పాలపొడి - రెండు స్పూన్లు, యాలకుల పొడి - అరస్పూన్, బేకింగ్ సోడా - చిటికెడు.
తయారీ విధానం :
స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి రవ్వ వేసి వేపుకోవాలి. మూడు నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు పాలను పోస్తూ ఉండలు చుట్టుకోకుండా కలుపుకోవాలి. దీనిలోనే రెండు స్పూన్ల నెయ్యి వేసి కలిపి, దించేసుకోవాలి. బాగా గట్టిగా అవ్వక్కర్లేదు, దగ్గరపడితే చాలు. మరో పాన్‌లో పంచదార, నీళ్లు పోసి కలపాలి. పంచదార కరిగి చిక్కబడేలా చేస్తే చాలు. చిక్కబడగానే యాలకుల పొడి వేసి, దింపేసుకోండి. ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమంలో రెండు స్పూన్ల పాలపొడి లేదా మైదా పిండి వేసి కలుపుకోవాలి. మెత్తగా ఉండేలా బాగా కలపాలి. దీనిలో బేకింగ్ సోడా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో చిన్న చిన్న ఉండల్లా చేసుకుని అప్పాల్లా వత్తుకోవాలి. కావాలంటే సిలిండర్ ఆకారంలోగానీ, గుండ్రంగా గానీ చేసుకోవచ్చు. మరో పాన్‌లో నూనె పోసి, వేడయ్యాక వీటిని మధ్యస్థ సెగ మీద బంగారువర్ణం వచ్చే వరకూ మెల్లగా వేపుకోవాలి. వేయగానే తిప్పవద్దు. రెండు నిమిషాలాగాక తిరగేయాలి. లేకపోతే విరిగిపోతాయి. వీటిని పాకంలో వేసి, గంట తర్వాత సర్వ్ చేసుకోవడమే.
బూందీ లడ్డు
కావలసిన పదార్థాలు :
శనగపిండి -కప్పు, బేకింగ్ సోడా - చిటికెడు, మిఠాయి రంగు - చిటికెడు, నీళ్లు- తగినంత, నూనె - తగినంత, నెయ్యి - తగినంత, జీడిపప్పులు, కిస్మిస్ - రెండేసి స్పూన్లు చొప్పున, పంచదార - ముప్పావు కప్పు. యాలకుల పొడి - అరస్పూన్
తయారీ విధానం :
ఒక బౌల్లోకి శనగపిండి తీసుకుని, అందులో మిఠాయిరంగు వేయండి. ఇది ఆప్షనల్.. ఇష్టమైతేనే వేసుకోవాలి. దీనిలోనే బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. దీనిలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. పిండి మరీ పలుచగా, చిక్కగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా కలుపుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె పోయాలి. నూనె వేడయ్యాక చిల్లుల గరిటె తీసుకుని కలిపిన పిండిని వేసి బూందీ చేసుకోవాలి. బూందీని ఎక్కువ వేపుకోకూడదు. లేకపోతే క్రిస్పీగా అయిపోతుంది. మరో గిన్నెను పొయ్యి మీద ఉంచి, నెయ్యి వెయ్యాలి. ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేపి తీసి ఉంచుకోవాలి. ఇందులో ముప్పావు కప్పు పంచదారకు అరకప్పు నీళ్లు పోసి తీగపాకం రానివ్వాలి. ఇందులోనే ఫుడ్ కలర్, యాలకులపొడి వేసి కలిపి, స్టౌ ఆపేయాలి. దీనిలో బూందీ, వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు లడ్డూ చుట్టుకోవాలి.
మైసూరు పాక్
కావలసిన పదార్థాలు :
శనగపిండి - ఒకటిన్నర కప్పు, నూనె -కప్పు, నెయ్యి - ఒకటిన్నర కప్పు, నీళ్లు - పావు కప్పు, పంచదార - రెండు కప్పులు, యాలకుల పొడి -
తయారీ విధానం :
స్టౌ ఆన్ చేసి ఒక బౌల్‌లోకి శనగపిండిని తీసుకోవాలి. దీనిలో నెయ్యినీ ఆయిల్ కలిపిన నాలుగు టీస్పూన్స్ వేసి, బాగా ఉండలు లేకుండా కలపాలి. ఒక పాన్‌ను వేరే పొయ్యి మీద పెట్టి మిగిన నూనె పోసి వేడి చేయాలి. ఇది ఇలా వేడి అవుతూనే ఉండాలి. మరో పాన్‌లో పంచదార తీసుకుని, అందులో నీళ్లు పోసి తీగపాకం రావాలి. పాకం వచ్చాక ఇందులోకి కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేయాలి. దీనిలోనే యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడి ఇష్టంలేకపోతే వేయక్కర్లేదు. ఇది ఉడుకుతూ బుడగలు వస్తున్నప్పుడు పక్కన కాగుతున్న నెయ్యిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపుకుంటూ, అలా పోస్తూ, కలపాలి. ఇలా చేయడం వల్ల మైసూర్ పాక్ గుల్లగా వస్తుంది. నూనె తేలుతున్నప్పుడు బాగా కలిపి, చివరిగా మిగిలిన నూనె అంతా పోసి ఒక్కసారి కలిపి వెంటనే స్టవ్ మీద నుంచి దించేయాలి. దీనిని బటర్ పేపరు వేసి లోతుగా ఉండే స్టీల్ గిన్నెలో తీసుకుని, చాకుతో గాట్లు పెట్టాలి. ఇది పూర్తిగా చల్లారక ట్రేలోకి గిన్నెను బోర్లా వేసి తీసుకోవాలి. గాట్లు పెట్టిన దగ్గర మరోసారి చాకుతో అని విడిపోయిన ముక్కలిని విడిగా తీసుకోవాలి.
పీనట్ బర్ఫీ
కావలసిన పదార్థాలు :
వేరుశనగలు -కప్పు, పచ్చి కొబ్బరి - అరకప్పు. పచ్చి పాలు - ముప్పావు కప్పు, బెల్లం / పంచదార - ముప్పావు కప్పు. యాలకుల పొడి - అరస్పూన్, నీళ్లు- తగినంత, నూనె - తగినంత, నెయ్యి - తగినంత, జీడిపప్పులు, కిస్మిస్ - రెండేసి స్పూన్లు చొప్పున,
తయారీ విధానం :
స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి, పల్లీలను సన్న సెగమీదే కలుపుతూ వేపుకోవాలి. వీటిని బాగా చల్లారనిచ్చి, పొట్టు తీసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చికొబ్బరి, పచ్చిపాలను పోసి ఫైన్ పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లోకి తీసుకుని స్టవ్‌పై పెట్టి, మీడియం సెగ మీదే ఉంచి కలుపుకోవాలి. దీనిలోనే బెల్లం / పంచదార వేసి బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ కలపాలి. చివరిలో జీడిపప్పులు, కిస్మిస్‌ను నెయ్యిలో వేయించి, కలపాలి. దీనిలోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. చుట్టూ నెయ్యి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ట్రేలో నెయ్యి రాసి తీసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారాక మీకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి. వీటిపై జీడిపప్పు, కిస్మిస్‌తో గార్నిష్ చేసుకోవాలి.