నువ్వెళ్లే దారుల్ని అల్లుకుని
నీ పాదాలకు అలసటలేని లేపనాన్ని పుయ్యాలనుకుంటానా...
నువ్వేమో ఎక్కడ నేనలసిపోతానో అల్లికల్లోనని
దారెటో చెప్పడమే మర్చిపోతావు..
కళ్లెంట కారడవుల్ని మోస్తూ
కనికరమంతా నాపై వేసేస్తూ
నువ్వెటో పయనమైపోతుంటావా..
చిట్టడవిని కూడా మొయ్యలేని నేను
కాస్తాశ్చర్యంగానే
నీకై ఆరాతీస్తుంటానా..
ముప్పేట దాడిలా
ముదుసలి మనసొకటి
అదిలిస్తుంటుంది..
అదంటుందిలా...
నువ్వు ఇంకా కూడా మనిషితనాన్ని భుజాలకెత్తుకుందామనేనా అని.
ఒకరికొకరం క్షేమసమాచారానికీ
నోచుకోనప్పుడు..
కక్ష్యల్లో తప్పిపోయినప్పుడు..
కలిసిలేని కాలానికి
కలిసే సంతకాల ఊసుల్నెందుకనంట
జతచెయ్యడం..
మనం మారదాం..
మౌనానికి మాటలు పోగొట్టి..
పాటై స్వేచ్ఛగా ఎగురుదాం..
విడివిడిగా...!!
- అనూరాధ
anuradhabandi2020@gmail.com