వేయి తలల పెత్తందారీ పాము
నాలికలు చాస్తున్న యీ కాలాన
కంటికింద ఇసుకరేణువుల్లా
కరకర తెగ్గోస్తున్న జాతీయోన్మాదపు విద్వేషం ధూళి
చూపుడు వేళ్ళతో తుడుచుకుంటూ
నిన్నే తలుచుకుంటున్నాము
నీ ప్రసంగ ప్రవాహాన్ని,
కొలిమి నుంచి తీసిన నిప్పుకణికల వంటి
నీ ఆలోచినల్ని మనసొగ్గి చదువుకుంటున్నాము
చే...
మా ప్రియవీరుడా.!
మా అంతరంగపు మైదానాల్లో
వెచ్చటి ఆశలపవనమై వీచే
స్వేచ్ఛా ప్రపంచపు సుందర స్వప్నకారుడా..!
మనసులు తిరిగే నేల
నేడు అంగటి సరుకుగా మారిపోయింది
ప్రేమలు పూయాల్సిన తావు
నేడు విషపురుగుల దండయాత్రల్లో చితికిపోతోంది.
ఎక్కడైనా
బతుకులు బతుకుల్లాన్నే కదా ఉండాలని తపించావు..
మనుషులు మనుషుల్లానే గదా జీవించాలని ఆశపడ్డావు..
ఇప్పుడు భూమి
డేగరెక్కల చప్పుడు విన్న పిల్లలకోడిలా కలతపడుతోంది
ప్రపంచపు ఆధిపత్యపు పోరులో
కుదేలవుతున్న దేశాలని చూస్తుంటే
ప్రపంచపు యువరక్తంలో
పెను ఉప్పెనవై నువ్ పోటెత్తితే ఎంత బావుండో అనిపిస్తోంది!
నా ప్రియ గువేరా..!
అభ్యుదయ ఆలోచనా విత్తులనేకం చల్లిపోయావు గదా..!
రేపో మాపో
జాత్యహంకారపు గంజాయి వనాలు నశించి
ప్రేమ తోటలు విరుస్తాయిలే..!
చే...
చే...
భూమి అచ్చం నీ అడుగుల చప్పుళ్లను
మనసు రిక్కించి వింటోంది
సామ్రాజ్యవాదవు చెవులు చిల్లులుపడి పోతాయి కదూ.!
-పల్లిపట్టు నాగరాజు.