
ఉలిక్కిపడి లేచింది అర్చన. వెంటనే కళ్లు తెరవలేకపోయింది. తలంతా డిమ్ముగా ఉంది. ఫ్యాన్ తిరుగుతున్నా మొహమంతా చెమటలు. కొంగుతో తుడుచుకుంది. వచ్చిన పీడకల బుర్రలో గిర్రున తిరిగింది. మంచంపైనున్న భర్తను చూసింది. అతని నుదుటిపై చేయిపెట్టి తడిమింది. 'హమ్మయ్య' అనుకుంది.
మరలా ఆ పీడకల గుర్తుకొచ్చింది. వెంటనే పెరట్లోకెళ్లింది. నిన్న సాయంత్రం పెట్టిన నీటికి మొక్కలు కొత్త ఊపిరి పోసుకున్నట్లున్నాయి. ఆమె ఊపిరి పీల్చుకుంది. ప్రేమగా వాటిని స్పృశించింది. రెండు కన్నీటి బొట్లు ఆకులపై రాలాయి.
'అత్తయ్యా.. ఏమైంది? ఇంత పొద్దున్నే పెరట్లోకొచ్చారు. లైటు కూడా వేసుకోలేదు..' బాత్రూం నుంచి వస్తూ అడిగింది కోడలు.
'అర్చనా.. ఏమోరు..' లైటు వేసి, కళ్లజోడు పెట్టుకుంటూ పెరటివైపు వచ్చాడు గోవింద్.
మొక్కల మొదట్లో కూర్చొని వాటిని రెండు చేతుల్తో గట్టిగా హత్తుకుంది. ఆమె ఎందుకిలా చేస్తుందోనని ఆశ్చర్యపోతూ చూసింది కోడలు.
'ఏమైందోరు..' నెత్తిమీద చేయి పెట్టి నిమురుతూ లాలనగా అర్చనను అడిగాడు.
'తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయి కదా..' అంది అర్చన. 'ఏం కలొచ్చింది?' అడిగాడు.
'మీరు ఉగ్రుడై ఈ మొక్కలన్నింటినీ పీకేస్తున్నట్లు, వాటికీ కోపమొచ్చి మిమ్మల్ని ముందుకు తోసినట్లు, వెళ్లి మెట్లకు తగిలినట్లు, తల పగిలి, రక్తం కారుతున్నట్లు.. పీడ కల..' ఆమెలో దాని ప్రభావం కనిపించింది.
'ఇప్పుడంతా బాగానే ఉందిగా.. రా, లోపలికెళ్దాం..' లేవదీయబోయాడు.
'ఏవండీ.. మరోసారి ఆలోచించండి. మీ నిర్ణయం మార్చుకోండి. మీరు ఆ మాట చెప్పిన దగ్గర్నుంచి నా మనసు మనసులా లేదు. ఎన్నిసార్లు చెప్తున్నా మీరు వినిపించుకోవడం లేదు. కలలో జరిగినట్లు ఏదన్నా జరిగితే..' ఆమెలో బాధ పొంగుకొచ్చింది.
'మావయ్యగారికి మీకన్నా ఎవరూ ఎక్కువ కాదు.. రండత్తయ్యా..' కోడలు కూడా లేవదీయబోయింది.
'ఆ మాట ఆయన్ని చెప్పమను..' భర్తవైపు దీనంగా చూసింది అర్చన.
'అవన్నీ నేను చూసుకుంటా కదా.. ఎందుకిలా మంకుపట్టు పడతావ్..' అసహనం ప్రదర్శించాడు గోవింద్.
'ఆ ఊరొదిలేసి ముప్పై ఏళ్లవుతుంది. ఇప్పుడెళ్లి అక్కడ ఇమడటమంటే ఎంత కష్టమో.. ప్లీజ్..' ఆమె మాట పెగలడం లేదు.
అర్చన ఇంకేదో చెప్తున్నా పట్టించుకోకుండా, ఆమె రెండు చేతుల్ని పట్టుకుని బలవంతంగా లేవదీశాడు. సరాసరి గదిలోకి తీసుకెళ్లాడు. మనశ్శాంతిగా పడుకోమని దుప్పటి ఇచ్చాడు. కోడలు తమ గదిలోకి వెళ్లిపోయింది.
అర్చనకు నిద్ర పట్టడం లేదు. ఆమె మనసంతా పీడకలపైనే ఉంది. గుండెను పిండేసినట్లు అనిపిస్తోంది. ఆలోచిస్తూ, ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది.
మనవడి అరుపులకు మెలకువ వచ్చింది. లేచి గదిలోంచి బయటకొచ్చింది. తాపీగా కాఫీ తాగుతూ, పేపర్ చదువుతూ కనిపించాడు గోవింద్. క్యారేజీ కట్టే హడావుడిలో ఉంది కోడలు. గబగబా రెడీ అవుతున్నాడు ప్రణవ్. చెక్క గుర్రంపై ఊగుతున్న రెండున్నర్రేళ్ల మనవడు పరిగెత్తుకొచ్చి ఆమెను చుట్టేశాడు.
'అత్తయ్యగారూ, బ్రష్ చేయండి.. టిఫిన్ పెడతాను..' కోడలు చెప్పింది.
'చిన్నూ, వెళ్లి నాన్నను రమ్మను..' కొడుక్కి పురమాయించింది. 'ఏమోరు, నీరసం తగ్గిందా?' అడిగాడు గోవింద్.
ఆమె సమాధానమివ్వలేదు. పెరట్లోకి అడుగు పెట్టింది. అన్నింటివైపు కలియజూసింది. ఆమె వెనుకనే వచ్చిన మనవడు చిన్న కర్రతో మొక్కల్ని కొడుతున్నాడు.
'చిన్నూ.. అలా కొట్టకూడదు. మొక్కలు ఏడుస్తాయి..' సున్నితంగా వారిస్తూ వాడి చేతిలోని కర్రను తీసుకుంది.
'ఇవి కూడా ఎడుత్తాయా?' ఆశ్చర్యంగా ప్రశ్నించింది బుజ్జి బుర్ర. 'అవును.. ఇదిగో చూడు.. ఇక్కడ నువ్వు కొట్టావ్ కదా.. ఆకులు రాలిపోయాయి.. కన్నీళ్లు వస్తున్నారు..' ఆకులు రాలినచోట కారుతున్న రసాన్ని చూపించింది. 'ఇంకోసారి అలా కొట్టమాకే..' చెప్పింది.
వాడు నవ్వి, మొక్క మొదట్లో పడిన ఆకుల్ని అతికించే ప్రయత్నం చేశాడు. సఫలం కాకపోవడంతో ఆకుల్ని వదిలేసి, మట్టిని వాటి మొదట్లో పోశాడు. అది చూడగానే ఆమె మనస్సు ముప్పై ఏళ్ల వెనక్కి బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా పరిగెత్తింది.
పెళ్లైన కొత్తలో తాటాకుల ఇంట్లో ఉండేవాళ్లు. ప్రణవ్ కడుపున పడినప్పుడు ఎంతో కంగారుపడింది. ఇంటి తాటాకులు గాలికి ఎగిరిపోతాయేమో, ఇంట్లో కర్రకు కట్టిన ఫ్యాన్ విరిగి మీద పడుతుందేమోనని భయపడింది.
ప్రణవ్ ఈ భూమ్మీదకు రాగానే గోవిందుకు మహానగరంలో పెద్ద ప్రైవేటు కంపనీలో ఉద్యోగమొచ్చింది. మూడేళ్లు దాచిన కొద్ది డబ్బులకు తోడుగా లోన్ తీసుకున్నాడు. సిటీ అవుట్ స్కర్ట్స్‌లో స్థలం కొన్నాడు. ఇల్లు కట్టడం ప్రారంభించాడు.
ఉదయం, సాయంత్రం బక్కెట్లో నీటితో గోడల్ని తడుపుతుంటే తనూ ఒక చిన్న లోటా తీసుకుని గోడ మీద పోసేవాడు ప్రణవ్. న్యూటన్ చర్యలాగా ఆ నీళ్లు మొహం మీద పడినప్పుడు కేరింతలు కొట్టేవాడు.
ఇల్లు కట్టడం పూర్తయ్యాక పెరట్లో మొక్కలు పెట్టాలని గోతులు తవ్వింది అర్చన. ఆ తడి మట్టిని తీసి రెండు చేతులతో పిసికేసేవాడు. ఆ మొక్కల్ని తనే గోతుల్లో పెట్టేవాడు. వాటి మొదట్లో మట్టి పేర్చేవాడు. ఇప్పుడు చిన్నూ అలాగే చేయడంతో ఆమె మురిసిపోయింది.
'రేపో మాపో చచ్చిపోయే వాటి గురించి ఎందుకంత ఆరాటం.. రారా, మీ అమ్మ పిలుస్తోంది..' పెరట్లోకొచ్చి మనవడిని ఎత్తుకున్నాడు గోవింద్. ఆమె చూపులు అతన్ని కాల్చేసేలా ఉన్నారు.
'కొత్తగా వచ్చినోళ్లు నీలాగా పట్టించుకుంటారని గ్యారెంటీ లేదుగా? అందుకే అన్నాను..' మనవడిని తీసుకుని వెళ్లిపోయాడు గోవింద్.
ఇల్లు, మొక్కలు అర్చనకు రెండు కళ్లు లెక్క.. వాటిల్లో దేనికి ఇబ్బంది కలిగినా తన ప్రాణమే పోయినట్లుగా భావిస్తుంది. అలాంటిదిప్పుడు వాటన్నింటినీ వదిలేసి వెళ్లిపోవడం అంటే, బిడ్డని కని చేజార్చుకున్న తల్లి లెక్కన అయినట్లనిపిస్తోంది. అక్కడే పెరట్లో కూర్చుండిపోయింది. తీవ్రంగా ఆలోచించింది. వేదాంత్ గుర్తుకొచ్చాడు.
మధ్యాహ్న భోజనం కానిచ్చి, రెండు చేతుల్ని వెనక్కి పెట్టుకుని వరండాలో పచార్లు చేస్తూ యాడ్ ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాడు గోవింద్. అప్పుడే వేదాంత్ వచ్చాడు. గేటు పక్కనున్న నేరేడు చెట్టుకింద బండిని పార్క్ చేసి, హెల్మెట్ హాండిల్‌కి తగిలించాడు.
'హఠాత్తుగా ఊడిపడ్డాడేమిటి? అర్చన ఫోన్ చేసుంటుందా?' అనుకుంటూ ఎదురెళ్లాడు గోవింద్.
'రారా! ఎలా ఉన్నావ్? మా చెల్లి ఎలా ఉంది?' కుశల ప్రశ్నలేశాడు.
'నీ పద్ధతేమన్నా బాగుందా..? అసలు బాగుందా..?' చూపుడువేలు చూపిస్తూ కోపంగా అడిగాడు వేదాంత్. 'ఏంట్రోరు.. నీక్కూడా కోపమొస్తుందా..?' కిసుక్కున నవ్వాడు గోవింద్.
'నువ్వు చేసే పనులకి అది కూడా దాపురించింది' వేదాంతులో కోపం తగ్గలేదు.
'ఎండన పడొచ్చావ్.. కాస్త నెమ్మదించు.. తర్వాత అరుద్దువులే.. ఏమోరు, మీ అన్నయ్య వచ్చాడు. కాస్త ఇటురా..' అంటూ సోఫాలో కూర్చోబెట్టి, అర్చనను పిలిచాడు.
'నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు మా చెల్లిని పిలుస్తావెందుకురా? ముందు ఈ విషయం చెప్పు.. ఇల్లు అమ్ముతానన్నావంట.. ఇల్లమ్మి ఎక్కడుంటారంటా? పిల్లల పరిస్థితి ఏంటట?' విరుచుకుపడ్డాడు వేదాంత్.
'నీకు తెలుసు కదా.. వాళ్లకి వీసా వచ్చేసింది. అక్కడే సెటిల్ అవుతారట! వాళ్లెవరూ లేకుండా ఇక్కడ మేమిద్దరం ఎందుకంటా? అందుకే స్వగ్రామం వెళ్దామని.. పూరిల్లు పడగొట్టి, డాబా కట్టిస్తాను. అక్కడే శేష జీవితం...' తడబాటు లేకుండా చెప్పాడు గోవింద్.
అలా మాట్లాడటంలో అతను దిట్ట. వేదాంతుకు మంచినీళ్లు ఇచ్చింది కోడలు. అర్చన లోపల్నుంచి వచ్చింది. గట్టిగా కడిగేయమన్నట్లు సైగ చేసింది.
'ఎప్పట్నుంచో ఇక్కడుంటున్నావ్. ఈ సౌకర్యాలన్నీ కాదని మరోచోటకెళ్తే ఇబ్బందులు పడతావురా..'
'రిటైరయ్యాక చాలా బోరింగా ఉంటుందిరా.. సిటీ కల్చర్ వచ్చాక ఇక్కడ ఉండబుద్ధి కావడంలేదు.'
'ఈ విశ్రాంత జీవనం శిక్ష కాదురా.. మనం సాధించలేకపోయిన వాటిల్లో ఎన్నో కొన్ని సాధించుకునే ఒక గొప్ప అవకాశమూ.. సమయమూ..'
'ఆసక్తి, ఉత్సాహం రెండూ ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలుగుతామురా.. వయసులో ఉన్నప్పుడు అందరిలాగే ''అది చేయాలి, ఇది చేయాలి'' అనుకుంటాం. కుటుంబ బాధ్యతలు వాటిని పక్కకు నెట్టేస్తాయి. ఇప్పుడు మనసు హుషారుగా ఉన్నా శరీరం సహకరించదు. నువ్వు చెప్పేవన్నీ ఫేస్బుక్‌లోనూ, వాట్సాప్‌లోనూ పెట్టుకోవడానికి బానే ఉంటుంది. ప్రాక్టికల్‌గా వర్కౌట్ కాదు. పులిసిపోతుంది..'
'ఈ ఇంటితో మీకెన్నో అనుభూతులు.. అనుబంధాలు.. వాటన్నింటినీ వదిలేసి వెళ్తావా?'
'కన్నుమూస్తే మాయమయ్యే జ్ఞాపకాల సంగతెందుకురా?' కరగలేదు గోవింద్.
'ఎన్ని జ్ఞాపకాలు మిగుల్చుకున్నామన్నదే ఈ వయస్సులో మనకు కావాల్సింది..' బుజ్జగింపు ధోరణికి దిగాడు వేదాంత్.
'అలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయిలే..'
'సొంతిల్లు కావాలని ఎంతగానో కోరుకున్నాం. ప్రకృతిలో మమేకమవ్వాలనుకున్నాం. అందుకే సిటీకి దూరంగా ఇక్కడ కొన్నాం. లీగల్ ప్రాబ్లెమ్స్ వస్తున్నాయని మేము అమ్మేసుకున్నాం. నువ్వు మాత్రం ఆఫీసుల చుట్టూ తిరిగి ఎల్.ఆర్.ఎస్. చేయించుకున్నావ్. లోన్ తీసుకున్నావ్. వెనకడుగు వేయకుండా కట్టావ్..'
'ఇప్పుడిది సిటీలో కలిసిపోయింది. కాలుష్యం పెరిగిపోయింది. నీలో చాదస్తం పెరిగిపోయింది..' విసుక్కున్నాడు వేదాంత్.
'నా నిర్ణయంలో మార్పు లేదురా..' నాలుకను పై పెదవిపైకి ఎక్కించి, పంటితో గట్టిగా కొరికాడు గోవింద్.
అతనికే సొంతమైన భావవ్యక్తీకరణ అది. అతనలా చెప్పాడంటే ప్రాణ స్నేహితుడైన వేదాంత్ మాట కూడా వినడని అర్థం. గోవింద్ నుంచి ఆ సంకేతం రాగానే టైటానియం లోహమంత గట్టిగా ఉన్న తమ నలభై ఏళ్ల స్నేహాన్ని తెంచుకోడానికి ఇష్టపడలేదు వేదాంత్.
'ఇప్పుడేం చేద్దాం?' అన్నట్లుగా అర్చనవైపు చూశాడు వేదాంత్. తన సమస్యను తీరుస్తాడనుకున్న దేవుడే చేతులెత్తేస్తే ఆమె మాత్రం ఏం చేస్తుంది. ఇద్దరూ మౌనం వహించడంతో విజయం సాధించానని సంతోషపడ్డాడు గోవింద్.
పత్రికలో ప్రకటన ఎలా ఇవ్వాలోనని ఆలోచిస్తున్న గోవిందుకు వేదాంత్ రూపంలో పరిష్కారం కనిపించింది.
'ఒరేరు, వేదా... నాకో హెల్ప్ కావాలిరా...' కదిలించాడు.
ఏమిటన్నట్లు చూశాడు వేదాంత్.
'పత్రికలో ప్రకటనివ్వాలి. ఏజెంటుకు చెప్తే వేస్తాడు. నువ్వుండగా వాళ్లెందుకు? పదిమందికి చెప్పి, వందమందికి చూపించే బాధలు లేకుండా త్వరగా సేల్ అవ్వాలి. నీ జర్నలిజం బుర్రతో అదిరిపోయే మేటర్ రాయి...' చెప్పాడు గోవింద్.
'నన్నడగటం దేనికి? యాప్‌లో యాడ్ ఇచ్చేరు..' అన్నాడు వేదాంత్.
'నీ రైటింగ్ స్టైల్ బాగుంటుంది. అది చదివితే ఎవరైనా ఇట్టే కనెక్ట్ అవుతారు' గోవింద్ అనడంతో అప్పటిదాకా స్నేహితుణ్ణి ఎలా ఒప్పించాలోనని ఆలోచిస్తున్న వేదాంత్‌కి ఓ ఆలోచనొచ్చింది. మాటలతో మారని మనసును అక్షరాలతో మార్చడానికి సిద్ధమయ్యాడు.
'నీకెలా రాస్తే నచ్చుతుంది?' ముందుగా స్నేహితుని దారిలోకి వెళ్లి, తర్వాత మెల్లగా తన దారిలోకి తెచ్చుకోవడానికి పథకం రచించాడు వేదాంత్.
'మన ఇంటి ఊహా చిత్రం వాళ్ల కళ్ల ముందు మెదలాలి. ఈ ఇంటిని మిస్ చేసుకోవద్దనిపించాలి. అవసరమైతే రూపాయి ఎక్కువైనా కొనెయ్యాలనిపించాలి' చెప్పాడు గోవింద్.
'ఇంటికెళ్లి రాసి వాట్సాప్ చేస్తాను.' అంటూ లేచాడు వేదాంత్. ఇప్పటికిప్పుడు రాసిస్తాడని ఆశించిన గోవిందుకు ఆశాభంగం కలిగింది. ఆలస్యమైతే ఆలోచనలు మారిపోతాయన్నది అతని భయం.
నిద్ర ఎరుగని చంద్రుడు, తన బాధ్యతను నెరవేర్చి వెళ్లిన సమయానికి గోవింద్ ఫోనుకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చదివాడు. అది చదివాక అతనిలో తెలియని అలజడి రేగింది. మళ్లీ చదివాడు. చదివేకొద్దీ బాధ పెరగసాగింది. జ్ఞాపకాలు దాడి చేస్తున్నాయి. దీర్ఘాలోచనలో పడిపోయాడు.. తేరుకోలేకపోయాడు.
'ఏమైందండీ... పిలుస్తున్నా పలకడం లేదు..' మంచం మీద కదలకుండా కూర్చున్నతన్ని అడిగింది.
నిస్తేజంగా భార్య వంక చూశాడు. ఆ చూపులో ఏదో కీడు... మాటిమాటికీ ఫోన్ వంక ఎందుకు చూస్తున్నాడో అర్చనకు పాలుపోలేదు. ఏం జరిగిందో తెలుసుకోవాలని అతని ఫోన్ తీసుకుంది.
'ఒక సంవత్సర కాలం మథనం... రెండు సంవత్సరాల ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన సమయం... మూడు సంవత్సరాల శ్రమ... నాలుగు సంవత్సరాలు నోరు కట్టుకుని కూడబెట్టుకున్న పైసల ధారబోత... ఐదు సంవత్సరాలు పడిన కష్టానికి అందిన ఫలితం... ముప్పయ్యేళ్ల అనుబంధం.. వెరసి సొబగులద్దుకున్న పొదరిల్లు ఇది.
లెక్కల్లో పది సెంట్లు ... లెక్కకు మించిన ఆనందం... నేటి అంకెల్లో లక్షల ఖర్చు... కోటి అనుభూతుల కమ్మని కూర్పు.. ఇక్కడుంటే జీవితకాలపు భద్రతా, భరోసా.. పెట్టుబడిలో కొట్టుకుపోయిన సంవత్సరాలను, రాబడిలో ఎదురొచ్చిన అనురాగాలను తనలో ఇముడ్చుకున్న బృందావనం ఇది.
రోజూ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పే పూల మొక్కలు.. ఊయల కట్టుకుని ప్రకృతి ఒడిలో కునుకు తీయమనే కొబ్బరి చెట్లు.. దాగుడుమూతలు ఆడుతూ ఉల్లాసాన్ని పొందమనే మామిడి చెట్టు.. అతిథులకు రసాయాన రహిత కూరగాయలతో వడ్డించమనే పెరడు.. చిన్న సైజు జామకాయలని చెప్పి ఎదుటివారిని బురిడీ కొట్టించమనే ఉసిరి చెట్టున్న తులసి వనం ఇది.
''మమతానురాగాల బంధాలు'' అనే పునాదులపై నిర్మించబడినది. మరపురాను జ్ఞాపకాలను ఇటుకలలో దాచుకున్నది. గరళ కంఠుడిలా చేదు సంఘటనల్ని నిక్షిప్తం చేసుకున్నది. విజయాలను ఎలుగెత్తి చాటుతూ చిరునామాలా మారింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతున్న స్వర్గసీమ ఇది.
ఈ ఇంట్లో ఉంటే అరటి ఆకుల్లో భోజనం చేయొచ్చు. పెరుగులోకి అరటిపండో, మామిడిపండో నంజుకోవచ్చు. ఎ.సి. అవసరం లేకుండా చల్లటి గాలినిచ్చే చెట్ల కింద మంచం వేసుకుని, సేద తీరొచ్చు. దీన్ని చూసి, ''ఇలాంటి ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది!'' అనుకుంటూ రోడ్డుమీద వెళ్తున్న వారిని చూసి గర్వపడేంత వాతావరణం.
ఇంటికి కుడివైపున కిరాణా షాపులున్నారు. ఎడమ వైపున మెడికల్ షాపులున్నారు. కూతవేటు దూరంలో క్లినిక్‌లున్నారు. మెకానిక్ షాపులున్నారు. బస్సులు, ఆటోలు, కార్ల కోసం గంటలతరబడి ఎదురు చూడనక్కరలేదు. ''ఆలోచించుకోండి... త్వరపడండి..!''' అంటూ వేదాంత్ పంపిన ప్రకటనను చదివింది.
అది చదవగానే ఆమె గుండె తరుక్కుపోయింది. మరపురాని జ్ఞాపకాలు ఆమె మదిని తడిమాయి.
'వీడు ప్రకటన రాయలేదు.. నా కళ్లు తెరిపించాడు. మనింటికిన్ని సంగతులున్న విషయం ఎప్పుడో మర్చిపోయా. అక్షరాల్తో వాడు గుర్తుచేశాడు..' పశ్చాత్తాపం చెందాడు గోవింద్.
'స్వర్గమంటే అదెక్కడో ఉండదు. నిర్మలమైన మనస్సుతో, మనకున్న సౌకర్యాలలో సంతృప్తిగా బతికే జీవితమే స్వర్గం! ఇల్లే కదా స్వర్గసీమ. మూర్ఖత్వంతో స్వర్గంలాంటి ఇంటిని వదులుకోవడానికి సిద్ధపడ్డాను. కావాలనుకుంటే నెలకోసారి సొంతూరెళ్లి, రెండు రోజులుండి రావొచ్చు. మన స్వర్గమిప్పుడు దూరమైతే మళ్లీ దక్కుతుందా? మన స్వర్గాన్ని వదులుకునేదే లేదు..' గోవింద్ మాట గద్గదమైంది.
'ఇప్పటికైనా గ్రహించారు. సంతోషం..' సంబరంతో అర్చన కళ్లు పెద్దవయ్యాయి. చేజారిపోయిందనుకున్నది తిరిగి దక్కబోతున్నందుకు ఆమె మనసు ఆనందభాష్పాలను ఆశ్రయించింది. వేదాంత్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంది.
ఆలస్యం చేయకుండా ఇల్లంతా మాప్‌తో తుడిచింది. తలారా స్నానం చేసింది. తడిసిన జుట్టుకు తెల్లటి టవల్ చుట్టుకుంది. పూలబుట్ట పట్టుకుని పెరట్లోకి అడుగు పెట్టింది.
'మనల్నెవరూ వేరు చేయలేరు' అంటూ ప్రేమగా వాటిని తాకింది. తనువంతా కదిలిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి మొక్కలు. వాటి భాషను అర్థంచేసుకున్న అర్చన పులకించిపోయింది. శ్లోకాలు ఉఛ్ఛరిస్తూ కనకాంబరాలు, మందారాలు కోసింది. మల్లెపూలను దండగా కట్టి, పటాలకు వేసింది. ఆమె పడుచు పిల్లలా హడావుడి చేస్తుంటే గృహప్రవేశం చేసిన రోజులు గుర్తుకొచ్చాయి గోవిందుకు.
దొండపాటి కృష్ణ
9052326864