Jan 01,2023 08:04

తలకిందులైన మానవీయతలు
పెచ్చరిల్లుతున్న స్వాహాకారాలు
నేల, గాలి, నీరు నాదే అంటూ..
మింగేస్తున్న బడా బకాసురులు
సాగర గర్భాన లవణ జలాలు
సమాజమంతా కుళ్లిన మనుసులే !

గాలి నిండా గరళ కాలుష్యాలు
మనసు గదుల్లో పాకురు గోడలు
జనాల్లో జారుతున్న గుణగణాలు
ఒళ్ళు కప్పిన మురికి బట్టలు
దేహంలో అవినీతి రక్త ప్రసరణలు
మాటలు తేనె పూసిన కత్తులు
చేతల్లో పరుల విధ్వంస రచనలే !

సంబంధాలు వ్యాపార వాణిజ్యాలే
బంధాల చుట్టు షరతుల కంచెలు
సైబరాసురుల ఆన్‌లైన్‌ మోసాలు
అంగాంగాలు అంగట్లో ఆరబోతలు
డిజిటల్‌ వేదికల గూట్లో డర్టీ పిక్చర్లు
ఒంటి తానానికి ఖరీదైన సబ్బులు
మనసు శుభ్రతకు మరేవి సాధనాలు?

బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037