Sep 04,2022 10:50

భస్వ ద్వీపంలో ప్రజలు వ్యవసాయం, చేతి వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు రాతితో చిన్న చిన్న శిల్పాలు మలచి అమ్మేవారు.
భస్వ ద్వీపానికి కొంత దూరంలో ఉన్న మరుధ్వతీ దేశానికి చెందిన సూత్రవర్మ అనే రసాయనిక శాస్త్రజ్ఞుడికి పుట్టినరోజున ఒక శిల్పాన్ని బహూకరించి, అది భస్వదీవి కళాకారులు చేసిందని తెలిపారు. సూత్రవర్మ ఆ శిల్పాన్ని నిశితంగా పరిశీలిస్తే ఏదో ప్రత్యేకత కనబడింది! వెంటనే తన ప్రయోగశాలకు తీసుకెళ్లి పరీక్షలు చేశాడు. ఆ శిల్పపు రాయిలో కొంతమేర భాస్వరం అనే ఖనిజం ఉన్నట్టు గ్రహించాడు.
వెంటనే సూత్రవర్మ భస్వ ద్వీపానికి వెళ్లి అక్కడి అధికారుల అనుమతితో కొండల్ని, నేలను పరీక్షించాడు. అక్కడ ప్రపంచంలో అరుదుగా దొరికే భాస్వరం ఉన్నట్టు కనుగొన్నాడు.
ఈ విషయాన్ని భస్వదీవి రాజు ఆనందముఖునికి చెప్పాడు. 'మహారాజా, నేను మరుధ్వతి రాజ్యంలో సూత్రవర్మ అనే రసాయన శాస్త్రజ్ఞుణ్ణి, మీ దీవిలో అపారమైన భాస్వర నిక్షేపాలున్నాయి! దీన్ని తవ్వి, భాస్వరాన్ని ఎగుమతి చేస్తే, మీకు అపారమైన విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది. మీ ద్వీపం ధనిక ద్వీపం అయిపోతుంది' అని చెప్పాడు.
'మంచి విషయం చెప్పావు సూత్రవర్మా, నీవు మా ఆతిథ్యంలో ఉండి ఆ భాస్వరాన్ని వెలికి తీయించి, ఇతర దేశాలకు పంపే ఏర్పాటు చూడు. నీకు తగిన పరిహారం చెల్లిస్తాను' అని చెప్పాడు.
రాజు సూచనల మేరకు గనుల తవ్వకం, నిల్వ చేయడం మొదలైన మెళకువలు అక్కడి వారికి నేర్పాడు. దానికి అవసరమైన పరిశ్రమలు పెట్టించి, తన వంతు సహాయం చేశాడు.
దీంతో అక్కడి ప్రజలకు ధనరాశులు వచ్చి పడ్డాయి. వ్యవసాయం చేసేవారు, చేతి వృత్తుల వారు పనులు మానేశారు. ఎప్పుడూ విందులు, వినోదాల్లో గడపసాగారు. భవిష్యత్తు అవసరాల కోసం జాగ్రత్త చేసుకోమని సూత్రవర్మ ఎంత చెప్పినా రాజు, ప్రజలూ పెడచెవిన పెట్టారు. పనిమానేసి విందులు, వినోదాల్లో తేలియాడటం వల్ల అందరూ ఊబకాయులు అయిపోయారు. దీంతో గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు రాసాగాయి.
అతిగా తవ్వడం వల్ల భూమిలో భాస్వర నిల్వలు తరిగిపోయాయి. దీంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. చేసేది లేక వ్యవసాయం, చేతివృత్తులు మొదలుపెట్టారు.
రాజు ఆనంద ముఖుని వద్దకు వెళ్లిన సూత్రవర్మ 'రాజా, నేను అప్పుడే చెప్పాను కదా! డబ్బు పుష్కలంగా ఉన్నప్పుడు భవిష్యత్తు కోసం దాచుకోవాలని, మీ ప్రజలు నా విన్నపాన్ని పెడచెవిన పెట్టారు. ఇప్పుడు ఎన్ని బాధలు పడుతున్నారో చూడండి!' అని చెప్పాడు.
రాజు బాధతో 'చేసేదేముంది, తప్పును గ్రహించేలోపే అంతా అయిపోయింది!' అన్నాడు. దీనికి సూత్రవర్మ 'భస్వ ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మరో ద్వీపపు కొండల్ని గురించి మీకు చెప్పలేదు, అక్కడా పుష్కలంగా భాస్వర నిల్వలు ఉన్నాయి. ఇప్పటికైనా తగిన జాగ్రత్తులు తీసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం నిధులు నిల్వ చేయండి!' అని చెప్పాడు.
వెంటనే ఆనందముఖుడు 'నీ వంటి ఉత్తమ ఆలోచనాపరుడు ఈ దీవిలో ఉండాలి, నీ మేలు మరచిపోలేను' అని మెడలో హారాన్ని సూత్రవర్మ మెడలో వేశాడు.
కంచనపల్లి వేంకట కృష్ణారావు
93486 11445