Aug 14,2022 13:35

పుప్పొడి రేణువుల్ని పంచే..
అందమైన కీటకమవుతా
చెట్టు వేరు నోటికి నీరందించే..
సెలయేటి ధారనవుతా
ధరిణి దాహం తీర్చే..
చల్లని నల్లని మబ్బునవుతా !

పుస్తక విలువను పెంచే..
అక్షర భావ సంపదనవుతా
పరిగెత్తే వాహనానికి..
జ్వలన ఇంధనమవుతా
నరుడి విలువను పెంచే..
మేధో సంపదనవుతా !

హరితానికి ఆయువు పోసే..
ప్రభాకరుడి కిరణమవుతా
పెన్ను పాళీకి ప్రాణం పోసే..
ఇంకు ధారనవుతా
మట్టి సత్తువను పెంచే..
వానపామునవుతా !

ప్రగతి రథ చక్రాలకు..
మృదు గమన కందెననవుతా
వెలుగులు పంచే దీపానికి..
పత్తి నూలు ఒత్తినై మండుతా
సమసమాజ ఆనందానికి..
పరహిత మానవ లేపనమవుతా !

టైరులో నిండిన గాలిలా..
సమాజాభివృద్ధికి ఆక్సిజనవుతా
జాతీయ గీతాలాపనకు..
సుస్వర సంగీత రాగమవుతా
భరతమాత పాదాల సురక్షకు..
సుతిమెత్తని పాదరక్షనవుతా !

ఆకాశాన పతాక రెపరెపలకు..
శీతల పవనమవుతా
అమృతభారతి కంఠాన..
వాడని సుగంధ మాలనవుతా
వజ్రోత్సవ భరత భూమికి..
ప్రాణాధారమైన మట్టినవుతా !

మధుపాళీ
99497 00037