Sep 10,2023 16:39

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : ప్రత్తిపాడు తహశీల్దార్‌ పీవీవీ గోపాలకృష్ణను చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) సస్పెండ్‌ చేశారు. ప్రత్తిపాడు మండలం గోకవరం గ్రామంలో సుమారు 25 ఎకరాల భూమిపై సుదీర్ఘ కాలంగా వివాదం జరుగుతోంది. ఈ భూమి శరభవరం గ్రామానికి చెందిన కూసుమంచి సీతయమ్మకు చెందినట్టుగా రికార్డుల్లో ఉంది. అయితే, పెద్దిపాలెం గ్రామానికి చెందిన చింతాకుల భాస్కరరావు కుటుంబీకులు సుమారు 40 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. ఈ భూమికి తాము హక్కుదారులమంటూ ఇరు వర్గీయులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. అయితే ఈ భూమిలో 10 ఎకరాలను సత్తి వినోద్‌ కుమార్‌ రెడ్డి అనే వ్యక్తికి సీతయమ్మ విక్రయించింది. వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ వినోద్‌ కుమార్‌ రెడ్డికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు మంజూరు చేయడంతో చింతాకుల భాస్కరరావు కుటుంబీకులు ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సీసీఎల్‌ఏ.. తహశీల్దార్‌ పీవీవీ గోపాలకృష్ణను సస్పెండ్‌ చేశారు. ఈ విషయాన్ని పెద్దాపురం ఆర్‌డీఓ జె.సీతారామారావు ధృవీకరించారు. ఏలేశ్వరం తహశృల్దార్‌ చిన్నారావును ప్రత్తిపాడు ఇన్‌చార్జి తహశీల్దార్‌గా నియమించారని ఆర్‌డీఓ తెలిపారు.