తొంగి చూడు కిమ్మనక
చూడు చూస్తూ ఉండు చాలాసేపు
ఏదో తీగలా ఏ విశ్వాంతరాళంలోంచి
వచ్చి పడుతుంది మదిలో
అల్లుకుపోతుంది మెల్లిగా నరాల్లో
కాసేపు నాట్యం ఆడి ఒక రూపాన్ని
వెలుగులోకి తెస్తుంది
దాన్ని చేత్తో తాకకు
హదయానికి కిరీటంలా చుట్టు!
పాట పాడు బాటలో వెళ్తూ వెళ్తూ
మధ్యాహ్నాలు ఒకలా రాత్రులు ఒకలా
అన్ని గుమిగూడి వస్తుంటాయి
అవన్నీ నీ లోపలవే నీ లోలోపలివే
ఎవరెవరో నేర్పినవి నూరిపోసినవి!
ఇక ఆగి ఒక మేకపిల్లకు
కొమ్మల లేత ఆకులు తినిపించు
రాలిన పళ్ళను ఏరుకొని
నువ్వూ సేద తీరు
తల కింద కళ్ళు పెట్టుకుని...
మళ్లీ ఏదో తడుతుంది
ఏదో తగులుతుంది
టక్కున మెదలాడుతుంది
అప్పుడు లేచి సమకూర్చుకుంటావు!
ఆ అల్లికలను నిశితంగా
ఒక్కొక్కటిగా నెమరు వేసుకోవడం
మలచడం ఆకారంగా
వాటి నుంచి ఇంకోదాన్ని
తీసుకురావడం సృజించడం...
ఎన్నో చుట్టూ కనిపించవు
తిరుగాడుతున్నప్పుడు
కేవలం చక్షువులకు
గుడ్లు పొదగబెట్టినట్టు
పెట్టాలి వెచ్చగా వాటిని
అవి నారు కావాలి
వాటికి సూర్యుడు పూయాలి!
ఎన్ని గడపలు దాటిపోతావు
ఏ సముద్రాలు ఈదుతావో
కాలాన్ని పయ్యలా చేసుకుని తిరుగుతూ
స్థలాన్ని కప్పుకుని ఢకొీడుతూ
సౌరమండల వదనంపై.. కాంతి వేగంతో!!
- రఘు వగ్గు
96032 45215