
మహిళలంటే సూర్యకు ఎంతో గౌరవం, దానిని ఆయనలో చూసే తాను వివాహం చేసుకున్నానని హీరోయిన్ జ్యోతిక చెప్పారు. బుధవారంనాడు జ్యోతిక తన 45వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. కోలీవుడ్‌లో హీరోహీరోయిన్లుగా ఉన్న సూర్య- జ్యోతికల ప్రేమ వివాహం 2006లో చేసుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ మధ్య ప్రేమ, పెళ్లి అన్నీ కూడా నెల రోజుల్లోనే జరిగిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చారు. తనకు సూర్య ఇచ్చే గౌరవం వల్లే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పూవెల్లమ్ కెట్టుప్పర్ అనే సినిమాలో తాము కలిసి నటించిన సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలిపారు. అలా తామిద్దరం కలిసి ఏడు సినిమాల్లో కలిసి నటించామన్నారు. 'సినిమాలో భాగంగా రొమాంటిక్ సీన్ ఉన్న సమయంలో డైరెక్టర్ సూచన మేరకు మాత్రమే పరిమితమై సూర్య నటిస్తాడు. దానిని అదునుగా ఏ మాత్రం తీసుకోడు. భర్తగా సిన్సియర్‌గా ఉండటమే కాకుండా నాకు సరైన గౌరవం ఇస్తాడు. అతన్ని చూసి నేర్చుకోమని చాలామంది మహిళలు వారి భర్తలకు చెప్పడం ప్రత్యక్షంగా నేను చూశాను. సూర్య ప్రతి ఆనంద క్షణాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఇలా ప్రతి విషయంలో సూర్య ఎంతో స్పెషల్. నా జీవితంలోకి సూర్య రావడం నా అదృష్టం.' అని జ్యోతిక తెలిపారు.