
ప్రభుత్వంలో విలీనమైతే కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి అందర్నీ రెగ్యులరైజ్ చేస్తుందని కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పైగా వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండదని పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి పదేపదే చెప్పారు. అది నిజమే అనుకున్నాం. తీరా అధికారంలోకి వచ్చాక కొన్ని డిపార్ట్‌మెంట్లలో పనిచేసే కార్మికులను ఎ.పి ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ సర్వీసెస్ (ఆప్కాస్) పెట్టి అందులో విలీనం చేశారు. ఆర్టీసీలో సైతం ''ఆప్కాస్''కు దరఖాస్తు చేసుకోండని చెప్పారు. ఇంతలో కోవిడ్ మహమ్మారి రావడంతో పెట్టుకున్న కాగితాలను చెత్తబుట్టలో వేశారు. ఆర్టీసీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్టు కార్మికులను కూడా ఆప్కాస్‌లో విలీనం చేయలేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు కాంట్రాక్టు కార్మికులను ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు ?
ఎపిఎస్ఆర్టీసీలో 18 రకాల పనులలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులుగా పదమూడు వేల మంది పని చేస్తున్నారు. వై.ఎస్.ఆర్.సి.పి అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి పిటిడి (పబ్లిక్ ట్రాన్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్)గా పేరు మార్చారు. పిటిడి కాకముందు 51,488 మంది కార్మికులు ఉంటే...విలీనం తర్వాత 64 వేల మందికి లాభం చేకూరుతుందని నివేదిక పేర్కొంది. అంటే ఇందులో పనిచేసే కాంట్రాక్టు కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారని అర్ధం.
ప్రభుత్వంలో విలీనమైతే కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి అందర్నీ రెగ్యులరైజ్ చేస్తుందని కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పైగా వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండదని పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి పదేపదే చెప్పారు. అది నిజమే అనుకున్నాం. తీరా అధికారంలోకి వచ్చాక కొన్ని డిపార్ట్‌మెంట్లలో పనిచేసే కార్మికులను ఎ.పి ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ సర్వీసెస్ (ఆప్కాస్) పెట్టి అందులో విలీనం చేశారు. ఆర్టీసీలో సైతం ''ఆప్కాస్''కు దరఖాస్తు చేసుకోండని చెప్పారు. ఇంతలో కోవిడ్ మహమ్మారి రావడంతో పెట్టుకున్న కాగితాలను చెత్తబుట్టలో వేశారు. ఆర్టీసీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్టు కార్మికులను కూడా ఆప్కాస్‌లో విలీనం చేయలేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు కాంట్రాక్టు కార్మికులను ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు? అన్నదే మన ముందున్న ప్రశ్న.
రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వం చేయాల్సిన సేవలు, అందించాల్సిన మౌలిక సదుపాయాలలో చాలా కీలకమైనవి విద్య, వైద్యం, రవాణా. నేడు ఈ మూడింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. వాస్తవానికి ఈ మూడు రంగాల్లో పనిచేసే కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ప్రజలకు మేలుజేస్తున్నదని చెప్పుకోవడం దురదృష్టకరం. హాస్పిటళ్లను మూడు ముక్కలు చేసి ముగ్గురు కాంట్రాక్టర్ల వ్యవస్థను పెట్టారు. కనీస వేతనం రూ.16,000 ఇస్తున్నట్లు జీవో ఇచ్చి కేవలం రూ.11,200 మాత్రమే అమలు చేస్తున్నారు. మిగిలిన డబ్బులు ఎవరు జేబులోకి వెళ్తున్నాయో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి.
రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసి యాజమాన్యం ఇంకో అడుగు ముందుకేసి ఏ డిపార్ట్‌మెంట్లలో లేనివిధంగా ఆర్టీసీ కార్మికులను ఐదుగురు, 10 మంది, 20 మంది, 50 మంది చొప్పున విడగొట్టి కాంట్రాక్టర్లకు అప్పగించాయి. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు ఆర్టీసి సొమ్ము కాంట్రాక్టర్ల పాల్జేస్తున్నారు. ఆర్టీసీలో అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, డిఇఓ, స్కిల్డ్ కార్మికులకు నెలకు రూ. 6,500 నుండి రూ.11 వేలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారు. 2006లో ఇచ్చిన జీవోలే ఇప్పటికీ అమలవుతున్నాయి. ధరలకు అనుగుణంగా అప్పటి జీతంపై ప్రతి ఆరు నెలలకొకసారి డీఏ పెంచుతూ సర్క్యులర్ వస్తున్నది. దాని ప్రకారం చూసినట్లయితే అన్‌స్కిల్డ్ కార్మికునికి నెలకు రూ.10,341, సెమీ స్కిల్డ్ కార్మికునికి రూ.12,213, స్కిల్డ్ కార్మికునికి రూ. 14,986, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.11,277, అటెండర్లకు రూ.10,341 ఇవ్వాలి. కానీ కాంట్రాక్టర్లు ఒక్కో కార్మికుడి నుండి రూ.1700 నుండి రూ.3000 వరకు మింగేస్తున్నారు. ఇఎస్‌ఐ, పి.ఎఫ్ గ్రాట్యుటి వంటివి సక్రమంగా అమలు కావడం లేదు. సఫాయి కార్మికులకు ఇచ్చే సర్క్యులర్ ప్రకారం జీతాలు ఇవ్వడం లేదు. కార్మికులకు పని ప్రదేశంలో ఎటువంటి ప్రమాదాలు జరిగినా కాంట్రాక్టర్లకు, యాజమాన్యాలకు సంబంధం లేదంటారు. ఆర్టీసీ సర్క్యులర్ ప్రకారం జీతాలు ఇవ్వడం లేదని డిపో స్థాయి అధికారి నుండి అమరావతిలో ఉండే పై అధికారి వరకు కార్మికులు మొరపెట్టుకున్నా మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టర్లను సర్క్యులర్ ప్రకారం జీతాలు ఇవ్వండని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు. బెదిరింపులకు లొంగకుండా కార్మికులు నిరసనలకు దిగితే అధికారుల్లో చలనం వచ్చి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం చూపరు. 2021లో చేసిన పోరాటాల వలన రూ.500 నుండి రూ.1000 వరకు కాంట్రాక్టర్లు జీతాలు పెంచక తప్పలేదు. కార్మికుల ఐక్యత వలనే ఆ మాత్రం జీతమైనా పెంచుకోగలిగాం. సర్క్యులర్‌లో ఉన్న మొత్తం జీతం ఇచ్చే వరకు పోరాటాన్ని ఐక్యంగా కొనసాగించాలి. ఆర్టీసిని ప్రైవేట్‌పరం చేసే దృష్టితో ప్రభుత్వం ఉంది గనుక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయదు. అలాగని ఆప్కాస్‌లో కూడా కలపదు. ఇది అసలు రహస్యం.
ఆర్టీసీలో హైర్ బస్సు డ్రైవర్లు (అద్దె బస్సు డ్రైవర్లు)కు యాజమాన్యాలు నెలకు రూ.12 వేలు మాత్రమే జీతం ఇస్తున్నాయి. 2019లో చేసుకున్న వేతన ఒప్పందాన్నే అమలు చేస్తున్నాయి. వీరికి ఇఎస్‌ఐ, పి.ఎఫ్ అమలు చేయాలని అగ్రిమెంట్లో పేర్కొన్నా కాంట్రాక్టర్లు, ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి లేదు. కోవిడ్‌లో ఉపాధి పోయినా ఆర్థికంగా ఎవరూ ఆదుకోలేదు. కార్మికులతో కొత్త వేతన అగ్రిమెంట్ చేసుకోవాల్సి వున్నా యాజమాన్యాలు చొరవ చూపటం లేదు. ఆర్టీసీ పర్మెనెంట్ డ్రైవర్లు కొరతగా ఉండటం వలన యాజమాన్యం 'ఆన్ కాల్ డ్రైవర్స్' పేరుతో అనేకమంది డ్రైవర్లను రిక్రూట్ చేసింది. వాస్తవానికి రిటైరైన వారితో పని చేయించుకోవాలనుకుంది. కానీ వారెవరూ రాకపోవడంతో హైర్ బస్ యాజమాన్యం ఇచ్చే వేతనం కంటే ఎక్కువని అనేక మంది సీనియర్ డ్రైవర్లంతా ఇందులో దరఖాస్తు చేసుకొని జాయిన్ అయ్యారు. వీరికి రోజుకు రూ. 800 జీతం. డిపార్ట్‌మెంట్ నుండి కాల్ వస్తేనే డ్యూటీ. లేదంటే ఆరోజు కూలి లేనట్టే. కాల్ కోసం ఎదురు చూడాలి. ఇంకో పనిలో చేరడానికి కూడా ఆస్కారంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు డైలీ వేజ్ కార్మికులే. వీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరిగినా వీరిదే బాధ్యత. బస్సు డేమేజీ అయినా, ఎదుటి బండికి, వ్యక్తులకు ఏం జరిగినా వీరే డబ్బులు పెట్టుకోవాలి. ఇచ్చిన కిలోమీటర్లు వరకూ తిరగాలి. మధ్యలో ఆగిపోతే రూ.800 జీతం రాదు. కాలేజీ బస్‌లకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ చేస్తే రూ. 600 మాత్రమే ఇస్తారు. వీరు స్కిల్డ్ కార్మికులు. బయట ఉద్యోగాలు లేక తప్పనిసరి పరిస్థితిలో ఇక్కడ పనిచేయాల్సి వస్తున్నది. వీరికిచ్చే కిలోమీటర్ల దాటి వెళితే ఒక నిమిషానికి రూ. 1.82 పైసలు ఓటీ చెల్లించాలి. కానీ అమలు కాదు. వీరికి ఉచిత బస్సు సౌకర్యం లేదు. వీరు సొంత డబ్బుతోనే ప్రయాణం చేయాలి, డ్యూటీకి రావాలి. ఆర్టీసి పిటిడిగా మారింది గానీ వీరికి ఉద్యోగ భద్రత, వేతనాల్లో ఏమాత్రం మార్పు లేదు.
ఆర్టీసీలో పని చేసే అన్ని డిపార్ట్‌మెంట్ల కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, లక్షల కోట్ల రూపాయల దిగమింగుతున్న కాంట్రాక్టర్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రమాదాలను అరికట్టాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అంతవరకు సర్క్యులర్ ప్రకారం జీతాలు చెల్లించాలని, 2018 నుండి ఇప్పటి వరకు పెరిగిన జీతం ఎరియర్ల రూపంలో కాంట్రాక్టర్లు చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్లు చెల్లించని పక్షంలో ఆర్.ఎం చొరవ చూపి...కాంట్రాక్టర్లు కట్టిన డిపాజిట్ల నుండి కార్మికులకు జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20వ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, ఆర్టీసి యాజమాన్యం వెంటనే జోక్యం చేసుకోవాలి. సంస్థ కోసం పని చేసే కార్మికుల సంక్షేమం చూడాలి.
/ వ్యాసకర్త: ఆర్టీసి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ ఫెడరేషన్
రాష్ట్ర నాయకులు, సెల్ : 9442821662/
వి. తులసీరాం