Feb 08,2023 07:23

ఏ దేశ గగన తలంలోనైనా అనుమతి లేకుండా ఇతర దేశాల విమానాలు ఎగరటం, అవీ నిఘా తరహా విమానాలైతే సదరు దేశాలపై దాడితో సమానమే. అయితే కంటికి కనిపించని వస్తువును కూడా పసిగట్టగల పరిజ్ఞానం అమెరికా వద్ద ఉందన్న సంగతి తెలిసి కూడా మూడు బస్సులంత పరిమాణం గల బెలూన్ను...అనుమతి లేకుండా అమెరికా గగనతలం మీద నిఘా కోసం చైనా పంపిందని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు.

          తమ మీద నిఘా కోసం చైనా పంపిన పెద్ద బెలూన్ను కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ ఉదంతాన్ని సాకుగా చూపుతూ నిరసనగా ఫిబ్రవరి ఆరున జరపాల్సిన చైనా సందర్శనను వాయిదా వేసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా అమెరికాలో పెద్ద డ్రామా నడిచింది. దాన్నొక పెద్ద ఉదంతంగా అమెరికా, ప్రపంచం ముందు ఉంచేందుకు నానా హడావుడి చేసి, ముందుగా ప్రచారదాడికి పాల్పడ్డారు. వాతావరణాన్ని విశ్లేషించేందుకు తాము పంపిన బెలూన్‌ గాలి తీవ్రత కారణంగా అదుపు తప్పి అమెరికా గగనతలం లోకి ప్రవేశించింది తప్ప కావాలని పంపిందో మరొకటో కాదని, దాన్ని కూల్చివేసి అమెరికా అతిగా స్పందించిందని చైనా విమర్శించింది. అది వాతావరణం కోసం కాదు తమ మీద నిఘా కోసమే పంపినందున కూల్చివేసినట్లు అమెరికా చెబుతోంది. ఏది నిజమో కాదో తరువాత ఎప్పుడో వెల్లడి అవుతుంది. నిజానికి ఈ ఉదంతం అమెరికా-చైనా మధ్య ఇప్పటికే ఉన్న వివాదాల పుస్తకంలో మరొక అధ్యాయానికి నాంది పలికింది.
       ఇతర దేశాలపై నిఘా అంకానికి తెరతీసింది, ప్రపంచానికి నేర్పింది అమెరికానే. నూటికి నూరు శాతం ఖ్యాతి దానికే దక్కాలి. దొంగ కళ్ల బెలూన్లను, విమానాలను పంపి వాటిని, ఎగిరే పళ్లాలు, గ్రహాంతర వాసులుగా ప్రపంచాన్ని నమ్మించటమే కాదు, పలు సినిమాలు తీసి జనం మీదకు వదిలింది కూడా అమెరికన్లే అన్నది దాచేస్తే దాగదు. పిల్లలు ఆడుకొనే బంతిని కూడా గగన తలం నుంచి స్పష్టమైన ఫొటోలను తీయగల ఉపగ్రహాలను నేడు అనేక దేశాలు తిప్పుతున్నది తెలిసిందే. అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని మన ప్రాంతంలో చైనా గ్రామాలను నిర్మిస్తున్నదంటూ అమెరికా పంపిన చిత్రాల సంగతి తెలిసిందే. ఆ గ్రామాలను తమ ప్రాంతంలోనే చైనా నిర్మించినప్పటికీ వక్రీకరించి మనలను ఎగదోసేందుకు అమెరికా చూసింది. దేశాల మధ్య పరస్పరం విశ్వాస లేమి, ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న స్థితిలో బెలూన్లతో సహా రకరకాల నిఘా అన్నది బహిరంగ రహస్యం. రెండవ ప్రపంచ పోరు తరువాత అనేక దేశాల మీదకు అమెరికన్లు బెలూన్లు వదిలారు. వాతావరణం కోసం వదిలినవి కూడా వాటిలో కొన్ని ఉండవచ్చు. దేన్ని ఎందుకోసం వదిలిందీ ఇదమిద్దంగా చెప్పలేము.
          ప్రపంచాన్ని తప్పుదారి పట్టించటంలో అమెరికాను మించింది లేదు. ఇరాక్‌లో లేని మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేసి దాని మీద దాడికి దిగి అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను హతమార్చింది. తరువాత ఎలాంటి మారణాయుధాలు లేవని ప్రకటించింది. తానే సృష్టించిన తాలిబాన్లనే మతోన్మాదులు ఏకుమేకుగా మారటం, తమ మీదకే ఎదురు తిరిగిందీ మన కళ్ల ముందే జరిగింది. అంతకు ముందు ఆప్ఘనిస్తాన్‌ విముక్తి వీరులుగా చిత్రించిందీ, ఆయుధాలు ఇచ్చిందీ, తరువాత ఉగ్రవాదులని ప్రచారం చేసి అణచివేసే పేరుతో రెండు దశాబ్దాల పాటు అక్కడ తిష్టవేసి, చివరికి వారితోనే రాజీ చేసుకొని పారిపోయింది అమెరికా అన్నది తెలిసిందే. అందువలన అమెరికా నందంటే నంది పందంటే పంది అని నమ్మాల్సిన పని లేదు. ప్రతి దేశమూ తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది.
           వాతావరణం గురించి పరిశోధించేందుకు పంపిన యు-2 అనే తమ విమానం టర్కీలో కనిపించకుండా పోయిందని పైలట్‌ మరణించినట్లు 1960లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ ప్రకటించాడు. అందరూ నిజమే అని నమ్మారు. కానీ కొద్ది రోజుల తరువాత సదరు విమాన పైలట్‌ ప్రాన్సిస్‌ గారీ పవర్స్‌ తమ వద్ద ప్రాణాలతో ఉన్నాడని నాటి సోవియట్‌ నేత కృశ్చేవ్‌ ప్రకటించి అమెరికా గాలితీశాడు. ఆ నిఘా విమానాన్ని ఆ ఏడాది మే ఒకటవ తేదీన సోవియట్‌ క్షిపణులు కూల్చి వేశాయి, పైలట్‌ బతికాడు. దాన్ని పంపింది నిజమే అని తరువాత ఐసెన్‌ హోవర్‌ అంగీకరించినా కనీసం విచారం కూడా ప్రకటించలేదు. తరువాత రెండు దేశాల మధ్య విబేధాలు మరింత ముదిరాయి. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం గురించి చూడాలి. అనేక రంగాల్లో ముందున్న అమెరికా తన దగ్గర ఎంత ప్రమాదకర అస్త్రం ఉందో ప్రపంచాన్ని బెదిరించేందుకు అవసరం లేకున్నా జపాన్‌పై అణుబాంబు వేసింది. దాన్ని సమర్ధించుకొనేందుకు తమ పెరల్‌ హార్బర్‌ మీద దాడి జరిపిందనే కట్టుకథను ప్రచారం చేసింది. నిజానికి ఆ బాంబును చూపి సోవియట్‌ మీద పైచేయి తమదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది.
           2001లో దక్షిణ చైనా సముద్రం మీద నిఘా కోసం వచ్చిన అమెరికా విమానాన్ని చైనా విమానాలు వెంటాడి, తమ స్థావరంలో దిగేట్లు చేశాయి. చైనా సత్తాను తక్కువ అంచనా వేసిన ఆ విమాన సిబ్బంది, దాన్ని నడిపించిన విభాగానికి ఆ ఉదంతం పెద్ద ఎదురుదెబ్బ. మనం చైనా గుట్టు తెలుసుకోవటం సంగతి అటుంచి విమానాన్ని దారి మళ్లించకుండా, పేల్చివేయకుండా వారి స్థావరానికి పంపి తమ ఆధునిక నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనాకు సమర్పించుకున్నామని అమెరికన్లు లోలోపల కుమిలిపోయారు.
          ఏ దేశ గగన తలంలోనైనా అనుమతి లేకుండా ఇతర దేశాల విమానాలు ఎగరటం, అవీ నిఘా తరహా విమానాలైతే సదరు దేశాలపై దాడితో సమానమే. అయితే కంటికి కనిపించని వస్తువును కూడా పసిగట్టగల పరిజ్ఞానం అమెరికా వద్ద ఉందన్న సంగతి తెలిసి కూడా మూడు బస్సులంత పరిమాణం గల బెలూన్ను...అనుమతి లేకుండా అమెరికా గగనతలం మీద నిఘా కోసం చైనా పంపిందని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు.
సూది కోసం సోదికి పోతే పాత గుట్టులన్నీ బయటపడినట్లుగా బెలూన్‌ ఉదంతం మీద అమెరికా చేసిన రచ్చ ఒక విధంగా దానికే ఎదురుతన్నింది. డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో కూడా అమెరికా గగన తలం మీద చైనా బెలూన్లు కనిపించినా కూల్చివేత వంటి పనులకు పాల్పడలేదని వెల్లడైంది. అప్పుడెందుకు ఉపేక్షించారు, ఇప్పుడెందుకు రచ్చ చేసి కూల్చివేశారు అంటే అంతర్గత రాజకీయాల ప్రభావంతో పాటు చైనాతో వైరాన్ని కొనసాగించేందుకు ఒక సాకుగా దీన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
         చైనా పంపిన బెలూన్‌ దారి తప్పి వచ్చింది కాదని, వారి నియంత్రణ మేరకు అమెరికా మీద తిరిగిందని అంటున్నారు. అదేగనుక నిజమైతే, దానిలో నిఘా పరికరాలే ఉండి ఉంటే అమెరికాలో రచ్చ మొదలు కాగానే చైనా వారే దాన్ని పేల్చి ఆధారాలు దొరకకుండా చేసి ఉండేవారు కదా? లేదూ నిజంగానే చైనా నిఘా పరికరాలను అమర్చిందని అనుకున్నా అలాంటి పని చేస్తున్నది చైనా ఒక్కటే కాదు కదా. అమెరికా సిఐఏ వద్ద కాంట్రాక్టరుగా పని చేసి దాని గుప్త పత్రాలను భారీ సంఖ్యలో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ వెల్లడి చేసిన వివరాల ప్రకారం నాసా ఇతర సంస్థలు నిరంతం చైనా మీద నిఘా పెడుతున్నాయి. చైనా టెలికమ్యూనికేషన్స్‌ సంస్థ హువాయిలో అమెరికా చొరబడి చైనా నేతలు, సైనికుల కదలికలు, అణ్వస్త్రాల సమాచారాన్ని తెలుసుకున్నదని స్నోడెన్‌ పత్రాల్లో ఉన్నది. అందువలన ప్రతి దేశం నిరంతరం తనను కాపాడుకోవటంతో పాటు ఎదుటి వారి బలం, బలహీనతలను పసిగట్టేందుకు నిరంతరం చూస్తూనే ఉంటాయి.

ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు