
రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కేటాయించలేదు. ప్రత్యేక హోదా, వెనుకబడ్డ జిల్లాల ప్యాకేజీల ప్రస్తావనే లేదు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లయినా రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి పేర్కొన్న అనేక హామీలను ఈ బడ్జెట్‌లో కూడా పేర్కొనలేదు. పైపెచ్చు కేంద్ర విద్యాసంస్థలకు గతేడాది కేటాయించిన నిధుల్లో కూడా తెగ్గోశారు. మరో వైపు ఆర్థిక సంఘం నిర్దేశించిన ప్రకారం రాష్ట్రానికి నిధులు బదిలీ చేయకుండా భారీ కోతకు పాల్పడింది. రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా అనేక ఆంక్షలు పెట్టింది. అప్పులపై కూడా షరతులు విధించింది. మొత్తంగా ఈ బడ్జెట్‌లో
ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.45.03 లక్షల కోట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర ద్రోహం చేసింది. రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కేటాయించలేదు. ప్రత్యేక హోదా, వెనుకబడ్డ జిల్లాల ప్యాకేజీల ప్రస్తావనే లేదు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లయినా రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి పేర్కొన్న అనేక హామీలను ఈ బడ్జెట్‌లో కూడా పేర్కొనలేదు. పైపెచ్చు కేంద్ర విద్యాసంస్థలకు గతేడాది కేటాయించిన నిధుల్లో కూడా తెగ్గోశారు. మరో వైపు ఆర్థిక సంఘం నిర్దేశించిన ప్రకారం రాష్ట్రానికి నిధులు బదిలీ చేయకుండా భారీ కోతకు పాల్పడింది. రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా అనేక ఆంక్షలు పెట్టింది. అప్పులపై కూడా షరతులు విధించింది. మొత్తంగా ఈ బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రం ఎడల ఇంత వివక్షత, ద్రోహం జరిగినా ముఖ్యమంత్రి కనీసం నోరు విప్పలేదు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం కొన్ని సన్నాయి నొక్కులతో బడ్జెట్ అందరికి ఉపయోగపడేలా ఉందని కితాబునిచ్చారు. గత నాలుగేళ్ళ నుండి రాష్ట్ర వైసిపి ప్రభుత్వం బిజెపితో స్నేహం చేస్తూ విభజన హామీలను నీరుగార్చేస్తున్నది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా వైసిపి ధోరణి లోనే స్పందించారు. బడ్జెట్‌లో మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రాజెక్టులకు ఆశించిన కేటాయింపులు జరగలేదని పేర్కొంటూనే మొత్తం బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని కొనియాడారు. ఇది బిజెపి ఎడల పూర్తిగా అవకాశవాద లొంగుబాటు ధోరణి. 2014లో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా తెలుగుదేశం కేంద్ర బిజెపి ఎడల మెతక వైఖరితో అవకాశవాద రాజకీయాలు నడుపుతున్నది. అందువల్లే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా హాని చేస్తున్నా కేంద్రాన్ని కనీస స్థాయిలో కూడా తెలుగుదేశం నిలెయ్యలేకపోతున్నది. ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కేంద్ర బడ్జెట్‌కు పూర్తిగా సాగిలపడిపోయారు.
బడ్జెట్‌లో ఉన్న అంశాలను పరిశీలిస్తే బడ్జెట్‌లో పోలవరం ఊసే ఎత్తలేదు. రాష్ట్రానికి ఇది చాలా కీలకమైన భారీ నీటి ప్రాజెక్టు. జాతీయ ప్రాజెక్టు. నత్తనడకన సాగుతున్నది. కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు పూర్తిచేయడానికి నిధులు భరించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 4785 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2023-24 బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రాష్ట్రం ఇప్పటి వరకు చేసిన వ్యయంలో రూ. 2873 కోట్లు కేంద్రం తిరిగి చెల్లించాలి. దీనికి కూడా అతీగతీ లేదు. ముఖ్యమంత్రి ప్రతి ఢిల్లీ పర్యటనలోను ఈ ప్రాజెక్టుకు రూ. 10 వేల కోట్ల తాత్కాలిక నిధులు మంజూరు చేయమని ప్రధానిని వేడుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డ్ నుండి రుణాలు ఇప్పిస్తామని కేంద్రం చెబుతున్నది. ఈ భారం రాష్ట్రం మోయలేనిది. ప్రాజెక్టు పూర్తికావాలంటే ఇంకా రూ. 25 వేల కోట్లు అవసరమని నిపుణులు అంటున్నారు. ఇంకోవైపు ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు నేటికి పునరావాస ప్యాకేజి ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ వివక్షత వల్ల ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో అంతులేని కథలా కొనసాగుతున్నది.
ఇప్పుడు మరో వివాదాన్ని మోడీ తీసుకొచ్చారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందటానికి కర్ణాటక లోని 'అప్పర్ భద్ర' నీటి ప్రాజెక్టుకు బడ్జెట్‌లో ఏకంగా రూ.5300 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తుంగభద్ర దిగువ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతానికి ప్రమాదం ఏర్పడుతుందని అంటున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు 'కెన్ బెత్వా' కు రూ.3500 కోట్లు కేటాయించారు. ఇంత అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి పెదవి విప్పకపోవడం దారుణం.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుపై ఈ బడ్జెట్‌లో కూడా ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కనీసం నిధులు కూడా కేటాయించలేదు. జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రెండేళ్ళ క్రితమే రూపొందించారు. దీనికోసం గతంలో రూ.170 కోట్లు ప్రకటించారు. అదీ ఇవ్వలేదు. గత నవంబర్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి అట్టహాసంగా భారీ బహిరంగ సభను నరేంద్ర మోడీతో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని హడావుడి చేసి ఆ తరువాత లేదని చావుకబురు చల్లగా చెప్పారు. ఈ మధ్య జరిగిందేంటి? ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను కేంద్ర బిజెపి సర్కార్ రద్దు చేసింది. కొత్త జోన్ రాకపోగా ఉన్న డివిజన్ కోల్పోయాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరంకుశ నిర్ణయంపై స్పందించలేదు.
దేశవ్యాప్తంగా మెట్రోరైళ్ల ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో రూ.19,518 కోట్లు కేటాయించారు. కానీ మన రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ మెట్రోరైళ్ల నిర్మాణానికి ఎలాంటి కేటాయింపులు లేవు. గత ఐదేళ్ల నుండి ఇదే తంతు కొనసాగుతున్నది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ, విజయవాడ మెట్రోరైళ్ల నిర్మాణం కేంద్రం దయాదాక్షిణ్యమేమీ కాదు. రాష్ట్రం హక్కు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన చట్టబద్ధ హామీలు. దశాబ్దకాలం అవుతున్నా ఇవి ఆచరణకు నోచుకోవడంలేదు. ఈ బడ్జెట్‌లో కూడా వీటి గురించి ఒక్క మాట కూడా లేదు. రైల్వేలైన్లు అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొత్త రైల్వే మార్గాల ప్రతిపాదనలు లేవు.
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి భారీగా ఈ బడ్జెట్‌లో కోత పెట్టారు. ప్రస్తుత 2022-23 సంవత్సరంలో సవరించిన బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.89400 కోట్లు ఖర్చు చేస్తున్నది. 2023-24 బడ్జెట్‌లో 33 శాతం తగ్గించి రూ.60 వేల కోట్లకు కుదించింది. దీంతో మన రాష్ట్రం సుమారు వెయ్యి కోట్లు పైబడి నష్టపోతున్నది. గత కొంత కాలంగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం, కూలీలకు వేల కోట్ల రూపాయిల బకాయిపడ్డ వేతనాలు చెల్లించకపోవడం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కోతతో ఈ పథకం రాష్ట్రంలో మరింత బలహీనపడే ప్రమాదం ముంచుకొచ్చింది.
గత బడ్జెట్‌లో రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల అనుసంధానానికి, పట్టణ నీటి సరఫరాకు, ఆరోగ్య రక్షణకు, విశాఖ, చెన్నై కారిడార్ వంటి పథకాలకు 2022-23లో రూ.6345 కోట్లు కేటాయించి రూ. 2553 కోట్లుకు కుదించారు. సవరించిన బడ్జెట్‌లో ఏకంగా రూ. 3792 కోట్లు కోత పెట్టారు. 2023-24లో కేవలం రూ.2206 కోట్లు మాత్రమే కేటాయించి అన్యాయం చేశారు.
ఆహార భద్రతకు, ఎరువులు, పెట్రో (ముఖ్యంగా వంట గ్యాస్) సబ్సిడీలపై ఎన్నడూ లేని విధంగా దారుణంగా కోత పెట్టారు. ఏకంగా రూ.5.21 లక్షల కోట్ల నుండి రూ.3.74 లక్షల కోట్లకు తగ్గించారు. ఆహార భద్రతకు 2022-23లో రూ.2,87,19 కోట్లు ఖర్చు చేస్తుండగా 2023-24లో రూ.1,97,350 కోట్లకు, ఎరువులకు రూ.2,25,220 కోట్ల నుండి రూ.1,75,100 కోట్లకు, వంటగ్యాస్‌పై రూ.9,171 కోట్ల నుండి 2,257 కోట్లకు కుదించారు. మొత్తంగా 28 శాతానికి పైగా కోత విధించారు.
ఆహార సబ్సిడీపై కోత వల్ల రాష్ట్రాలపై భారం పెరుగుతుంది. రాష్ట్రాలకు సబ్సిడీ కింద సరఫరా చేసే ఆహార ధాన్యాల కోటా తగ్గిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కోటి 45 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికి ఆహార భద్రత చట్టం కింద ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలేదు. కేవలం కేంద్రం పేదరిక గీతగా నిర్ణయించిన ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 75 శాతం, పట్టణ ప్రాంతంలో 50 శాతానికి మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఒకే దేశం-ఒకే కార్డు కింద నగదు బదిలీ పథకం అమలుకు కేంద్రం ఒత్తిడి తెస్తున్నది. ఇవన్నీ మన రాష్ట్రంలోని ప్రజా పంపిణి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆహార ధాన్యాల సేకరణ, రైతుల పంటల మద్దతు ధరపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడనున్నది.
ఎరువుల సబ్సిడీ కోత వల్ల ఎరువుల ధరలు భారీగా పెరిగి రైతులపై భారం పెరగనున్నది. వంటగ్యాస్ సబ్సిడి పూర్తిగా ఎత్తివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పయనించటంతో గ్యాస్ ధరలు ఇంకా పెరగనున్నాయి. వీటిని రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం చూడకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
గత తొమ్మిదేళ్ళుగా ఎదురు చూస్తున్న కడప స్టీల్‌ప్లాంట్, దుగ్గరాజుపట్నం పోర్టుల నిర్మాణాలకు ఈ బడ్జెట్‌లో కూడా మొండి చెయ్యి చూపారు. నిధుల కేటాయింపు సరే, కనీస ప్రస్తావన కూడా లేదు. వీటికి పూర్తిగా తిలోదకాలిచ్చినట్లే కనిపిస్తున్నది.
ఇక విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేసే దిశగానే పావులు కదుపుతున్నారు. ఈ బడ్జెట్‌లో కూడా దీనిని పేర్కొన్నారు. రెండేళ్ళకు పైగా ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకే నడుస్తున్నది. ఈ బరితెగింపుకు బిజెపికి ఊతం ఇస్తున్నది రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీల లొంగుబాటు వైఖరే. ఇప్పుడు ఏకంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తిని సగానికి సగం తగ్గించేసి భారీ నష్టాలకు గురిచేసే చర్యలకు బిజెపి వొడిగట్టింది. అయినా నరేంద్ర మోడీని ఈ మూడు పార్టీలు ప్రశ్నించలేకపోతున్నాయి.
చివరికి రాష్ట్ర హక్కులపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నా, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కోతపెడుతున్నా, అప్పులపై షరతులు విధిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మోడీతోటే అంటకాగుతున్నది. ఉదాహరణకు 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన కేంద్ర పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి 42 శాతం నిధులు బదిలీ కావాలి. కానీ ఈ బడ్జెట్‌లో 31.25 శాతం మాత్రమే అంటే రూ.41,338 కోట్లే ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాల ఎడల కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్ల నుండి ఇదే వైఖరి వ్యవహరిస్తున్నది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రెవిన్యూ లోటును నేటికి కేంద్రం భర్తీ చేయలేదు. ద్రవ్య బాధ్యత-ఆర్థిక నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) పేర ఈ బడ్జెట్‌లో కూడా రాష్ట్రాల ద్రవ్యలోటు 3.5 శాతం దాటకూడదని షరతు విధించింది. రాష్ట్రాల బడ్జెటేతర రుణాలను కూడా రాష్ట్ర అప్పుల్లో కలిపి రుణ సామర్థ్యాన్ని లెక్కిస్తామని కేంద్రం బెదిరిస్తున్నది. అదనపు అప్పులు కావాలంటే విద్యుత్, పట్టణ, కార్మిక తదితర రంగాల్లో సంస్కరణలు అమలు చేయాలని నిబంధనలు విధిస్తున్నది. అయినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటికి తలూపుతూ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నది.
మొత్తంగా బిజెపి ఎడల ఈ మూడు పార్టీల అవకాశవాద లొంగుబాటు వల్ల ప్రతి బడ్జెట్ లోను ఆంధ్ర రాష్ట్రానికి వివక్షత కొనసాగుతున్నది. విభజన హామీలు అమలు కాకుండా నీరుగారి పోతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో పడింది.
(వ్యాసకర్త సెల్ : 9490098792)
డా|| బి. గంగారావు