పల్లె అంతా చప్పుడు చేయక గూటిలో
రాత్రి దుప్పటి కప్పుకొని నిద్ర పోతుంటే..
మెలకువ రెక్కలు చుట్టుకొని మెల్లమెల్లగా
తొలిపొద్దై చెట్టుకొనపై వాలుతారు..
అతడు ముత్తాడు.. మోకుతో..
ఆకాశానికి కష్టాల నిచ్చెనలను వేసుకొని
ఆకాశపు గంగలో వున్న సురపానకపు దారాలను లొట్లతో నింపుకొస్తారు..
ప్రకృతి ప్రసాదించిన తాటిచెట్టే.!
వీళ్లకి జీవనాధారంలో పైసల చెట్టు
నీడలా తోడుండే నల్లటి తాటిచెట్టును
ఆశయం కోసం ఆశల వత్తులు
వెలిగించడానికి నిర్భయంగా పైకెక్కి
కత్తులతో తాటి గెలకు పదునెక్కిస్తారు
ఎన్ని గాయాలకు ఆనవాళ్లో వాళ్ల కాయం
అయినా పట్టువీడని విక్రమార్కులు..!
ఎంతైనా వీళ్లు ఆత్మవిశ్వాసం కలిగిన
నిజమైన శ్రమను నమ్మిన కష్టజీవులు
కలల్ని కాలంతోపాటు మోసుకెళ్తూ...
తరువులను తనువుతో ముద్దాడే గౌండ్లోల్లు
ఓర్పుతో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు
'కాళ్ల బంధం'తో గంపెడు ఆశల ప్రతిఫలాన్ని
ఆసాంతం తాటిచెట్టుతో పెనవేసుకుంటూ
తుమ్మెదై చెట్టుపై వాలి, గీతకత్తితో మెరేసి
తెల్లటి అమృతధారను తీసే సురవారధులు
అచ్చంగా కష్టాల పోరాటాలను చేస్తూ
నింగిని తాకిన తాటిచెట్టు చివరి కొనపైకి ఎక్కి
జాతీయ జెండాను నిత్యం ఎగరవేస్తున్న
సైనిక యోధుల్లా కనువిందు చేస్తారు..
సురపానకపు సహజ గుణాలను అందించి
కష్టజీవుల కష్టాలను మైమరిపించి
మరో జగత్తుకు తీసుకెళ్లే దివ్య ఔషధం కల్లు
ప్రతి మనిషికీ రసజగత్తును అందించి
భారాలను దూరం చేసి మరో లోకానికి
నూతన ఆలోచనలను రేకెత్తిస్తుంది
ఆత్మస్థైర్యం అనే చల్లటి కల్లు పోసి
ఎద లోతుల్లో మిగిలిపోయే వీరులు..!
ఆ మత్తులో తెలియని వింతలెన్నో...
ఎన్నో బాధలు చుట్టుముట్టినా
సంతోషాలలో విహరించే వింతలోకం
మనిషి మనిషినీ అల్లుకొని చుట్టేస్తుంది
అమృతం కోసం అసురులు
సురులతో యుద్ధం చేస్తే
తాటిచెట్టుతో కుస్తీ పడుతూ
కాళ్లకు 'బంధం' వేసుకొని
ఎన్నో ఆటుపోట్లను అధిగమించి
నింగికి నేలకు మధ్య గాలిపటమై
వేలాడే హనుమంతులు వీళ్లు..!
కొలిపాక శ్రీనివాస్
98665 15972