- స్థానిక పోరాటాలు పెంపు : సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు
- కేరళ గవర్నర్ చర్యలకు ఖండన
ప్రజలపై అసాధారణ రీతిలో మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యాచరణను బలోపేతం చేయాలని సిపిఎం పిలుపిచ్చింది. మోర్బీలో జరిగిన విషాద ఘటనపై ఉన్నత స్థాయి న్యాయ దర్యాప్తు చేపట్టాలని కోరింది. కేరళ గవర్నర్ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) కేంద్ర కమిటీ అక్టోబరు 29, 30, 31 తేదీల్లో న్యూఢిల్లీలో సమావేశమై పలు అంశాలపై చర్చించిన అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది.
మోర్బీలో దిగ్భ్రాంతికర సంఘటన
గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో వంతెన కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన 140మందికి పైగా కుటుంబాలకు కేంద్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని తెలియచేసింది. ఈ ఘటనలో ఇంకా చాలామంది గాయపడ్డారు. గాయపడిన వారందరికీ తక్షణమే వైద్య సాయం, ఇతరత్రా అన్ని రకాల సాయం అందాలని కమిటీ కోరింది. మరమ్మత్తులు చేసిన అనంతరం సరైన భద్రతా ఆడిట్‌ను నిర్వహించకుండానే ఈ వంతెనను తిరిగి ప్రాంభించినట్లు తెలుస్తోంది. పైగా, ఏ సమయంలోనైనా వంతెనపైకి అనుమతించాల్సిన ప్రజల సంఖ్యను ఉల్లఘించి ఎక్కువమందిని అనుమతించినట్లు తెలుస్తోంది. అదీకాక, ఈ తరహా రంగంలో గతంలో ఎలాంటి అనుభవం లేని కంపెనీకి ఈ మరమ్మత్తుల పనుల కాంట్రాక్టును అప్పచెప్పారు. ఈ అంశాలన్నీ గమనంలోకి తీసుకుంటే, దీనిపై ఉన్నత స్థాయి జ్యుడీషియల్ దర్యాప్తు చేయాల్సిన అవసరం వుంది. ఈ విషాదానికి బాధ్యులెవరో నిర్ధారించాల్సి వుంది.
గవర్నర్ విరుద్ధ చర్యలు
కేరళలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బిజెపి రాజకీయ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు కేరళ గవర్నర్ తీసుకుంటున్న చర్యలను కేంద్ర కమిటీ తీవ్రంగా నిరసించింది. కేరళలోని వివిధ యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేసిన తీరు, ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేయాలని కోరిన తీరు భారత రాజ్యాంగంలో అనుమతించనివి, పూర్తి విరుద్ధమైనవి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌కు ఇటువంటి చర్యలను చేపట్టడానికి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన విశ్వవిద్యాలయాల చట్టాలు ఎలాంటి అధికారాన్ని ఇవ్వడం లేదు.
గవర్నర్ తీసుకుంటున్న ఈ చర్యలు హిందూత్వ సైద్ధాంతిక ఎజెండాను పెంచి పోషించడానికి వీలు కల్పించేందుకై కేరళ రాష్ట్ర లౌకిక, ప్రజాస్వామ్య, శాస్త్రీయ ఉన్నత విద్యా వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇటువంటి లక్ష్యంతోనే జెఎన్‌యు, హైదరాబాద్ వంటి కేంద్ర విశ్వవిద్యాలయాలతో సహా ఇంకా పలు విశ్వవిద్యాలయాలను బిజెపి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. గవర్నర్ చూపిస్తున్న దారుణమైన ఈ పక్షపాతాన్ని కేరళ ప్రజలు సమైక్యంగా ప్రతిఘటిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరుగుతున్న అన్ని ప్రయత్నాలను ఓడిస్తారు.
తమిళనాడు : బిజెపి అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా గవర్నర్ వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అనవసరమైన వివాదాలను, గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పాలక డిఎంకె నేతృత్వంలోని సెక్యులర్ ఫ్రంట్ ప్రభుత్వ నేతలు ఆరోపించారు. గవర్నర్‌గా వున్న సమయంలో సాంప్రదాయవాద, విషపూరితమైన ఆలోచనలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే. ఇటువంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు వ్యతిరేకంగా, భారత రాజ్యాంగ పరిరక్షణలో సమైక్యంగా, కలిసికట్టుగా ఉద్యమించాలని అన్ని బిజెపియేతర లౌకిక ప్రజాస్వామ్య పార్టీలకు ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో నేతృత్వం వహించే ప్రభుత్వాలకు సిపిఎం కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.
ఫెడరలిజానికి విఘాతం : మన రాజ్యాంగంలోని ప్రాథమిక అంశమైన ఫెడలరిజాన్ని, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు పెరుగుతున్నాయి. శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశంగా వుంది. పోలీసులకు 'ఒక దేశం ఒక యూనిఫారం' అన్న మోడీ పిలుపు దీన్ని ఉల్లంఘిస్తోంది.
ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణాలో టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను తమ వైపునకు తిప్పుకునేందుకు పెద్ద మొత్తంలో డబ్బును ఇస్తామంటూ బిజెపి చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.
పొలిట్‌బ్యూరోకి ఎన్నికైన ఎం.వి.గోవిందన్
సిపిఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్‌ను పొలిట్‌బ్యూరోకి కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
పదును తేరుతున్న మత పోకడలు
ప్రజల ఇబ్బందులు, ఆర్థిక వినాశనం కారణంగా తలెత్తుతున్న వారి కష్టాలను నిర్లక్ష్యం చేస్తూ, ప్రజల మధ్య మతపరమైన విభజనలు మరింత పెరిగేలా చేస్తున్న ప్రచారాలకు మోడీ వ్యక్తిగతంగా నాయకత్వం వహిస్తున్నారు. బదరీనాధ్, అయోధ్యల్లో మోడీ పాల్గొంటున్న మతపరమైన కార్యక్రమాలకు మీడియాలో విపరీతమైన స్థానం దక్కుతోంది. ఎప్పటి మాదిరిగానే ఏదో ఒక సాకుతో ముస్లింలు లక్ష్యంగా మారుతున్నారు. ముస్లింలపై చాలా దారుణమైన రీతిలో భౌతిక దాడులు పెరుగుతున్నాయి. విషపూరితమైన విద్వేష వ్యాప్తి, హింసా ప్రచారాలు పెరుగుతున్నాయి. గుజరాత్‌లోని ఖెడాలో ముస్లిం యువతను సాదా దుస్తుల్లో వున్న పోలీసులు బహిరంగంగా కొరడాలతో కొట్టడం తీవ్ర దిగ్భ్రాంతికరమైన అంశంగా వుంది. ఇటువంటి మతపరమైన పోకడలకు వ్యతిరేకంగా విస్తృత రీతిలో లౌకికవాద శక్తులను సమీకరించాలన్న పార్టీ పిలుపును కేంద్ర కమిటీ పునరుద్ఘాటించింది.
జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హౌదాలు రద్దు చేసి మూడేళ్లకు పైగా అవుతోంది. ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై, వారి జీవనోపాధులపై ఆంక్షలు విధించే పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ పరిస్థితిపై ఇతర లౌకికవాద పార్టీలతో కలిసి సంప్రదింపుల క్రమాన్ని ప్రారంభించే చొరవను ఇతర వామపక్షాలతో కలిసి సిపిఎం చేపట్టనుంది.
బ్రెజిల్‌లో వామపక్ష విజయం
పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా డసిల్వా విజయం సాధించడాన్ని కేంద్ర కమిటీ ప్రశంసించింది. స్వయం ప్రకటిత ఫాసిస్ట్ మితవాదానికి చెందిన జేర్ బోల్సనారో ఓటమి, లాటిన్ అమెరికాలో మరింతగా వామపక్షాల పురోగతిని సూచిస్తుంది. సోషలిస్టు క్యూబాతో పాటు చిలీ, బొలీవియా, కొలంబియా, పెరూ, హౌండూరస్‌ల్లో వామపక్ష దృక్పథం కలిగిన అధ్యక్షులు ఎన్నికయ్యారు.
తీవ్ర సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ
మోడీ ప్రభుత్వ విధానాలు పెరుగుతున్న మాంద్యం ధోరణులతో ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరానికి తొలుత నిర్దేశించిన 8.7శాతం అభివృద్ది అంచనాలను వరుసగా మూడోసారి 6.5శాతానికి ప్రపంచ బ్యాంక్ కుదించింది. అలాగే, ఆర్‌బిఐ 7.8శాతం నుండి 7శాతానికి కుదించింది. గత 18మాసాల్లోనే అత్యంత తక్కువ స్థాయికి పారిశ్రామికాభివృద్ది నమోదైంది. కీలకమైన 8 రంగాలు గతేడాది 19.4శాతం అభివృద్ధిని నమోదు చేయగా ఈసారి 9.8శాతమే నమోదు చేశాయని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ (అక్టోబరు 12) పేర్కొంది. రూపాయి పతనమైంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో పెరుగుతోంది.
ప్రజలపై భరించలేని భారాలు
ముదురుతున్న ఈ ఆర్థిక సంక్షోభం ప్రజల జీవనోపాధులపై తీవ్ర కష్టాలను మోపుతోంది. పండుగ సీజనులో కూడా నిరుద్యోగం రేటు 7.8శాతానికి పెరిగింది. ఇంత జరుగుతున్నా కూడా, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులను విడుదల చేయడానికి మోడీ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఏప్రిల్ 1, అక్టోబరు 21 మధ్య కాలంలో దరఖాస్తు చేసుకున్న దాదాపు కోటీ 50లక్షల మంది దరఖాస్తుదారులకు పనులు ఇవ్వడానికి తిరస్కరిస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కోటీ 73లక్షలమందికి పనులు నిరాకరించబడగా, 2021లో 2.1కోట్ల మందికి పనులు తిరస్కరించారు. దారిద్య్రం పెరుగుతోంది. ప్రపంచ ఆహార సూచీలో 121 దేశాల్లో భారత్ ర్యాంక్ 107గా వుంది. అంటే పరిస్థితి చాలా తీవ్రంగా వుందని అర్ధమవుతోంది. ఈ కష్టాలన్నింటికి తోడు, వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ విధించిన గరిష్ట పరిమితి ఆరు శాతాన్ని వరుసగా 9మాసాలుగా పెరుగుతుండడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం గతంలో ఎన్నడూ లేని రీతిలో అధికంగా వుంది. ప్రాధమిక మనుగడకు అవసరమైన ఆహారమైన పప్పు, గోధుమలు, బియ్యం కూడా మెజారిటీ ప్రజలకు చేరడం లేదు. కేంద్ర గోదాముల్లో ఆహార నిల్వలు గత ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేని స్థాయికి దిగజారాయి. ఆహార కొరత ప్రమాదాలు పెరుగుతున్నాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల షెడ్యూళ్ల ప్రకటనను ఎన్నికల కమిషన్ డీ లింక్ చేయడంతో గుజరాత్‌లో ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రావడానికి బిజెపికి మరింత సమయం దొరుకుతోంది. కేంద్ర కోశాగారాన్ని పణంగా పెట్టి మరీ ప్రజలకు కొత్త పథకాలు, ప్రయోజనాలు ప్రకటించడంపై, మతపరమైన పోకడలకు మరింత పదును పెట్టడంపై దృష్టి కేంద్రీకరిస్తున్న బిజెపి ఎన్నికల ప్రచారాలకు మోడీ వ్యక్తిగతంగా నాయకత్వం వహిస్తున్నారు. ఈ ప్రభుత్వ పథకాల్లో కొన్నింటిని మోడీ ప్రజలకు ఇస్తున్న 'వ్యక్తిగత దివాళీ బహుమతులు'గా కూడా అభివర్ణిస్తున్నారు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలన్న తన ఉద్దేశ్యాన్ని గుజరాత్ బిజెపి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో సిపిఎం 11మంది అభ్యర్ధులను నిలబెట్టింది. ఒక స్థానంలో పోటీ చేస్తున్న సిపిఐకి మద్దతిస్తోంది. మిగిలిన స్థానాల్లో బిజెపి అభ్యర్ధులను ఓడించాలని సిపిఎం పిలుపిచ్చింది. గుజరాత్‌లో, ఇంకా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనందున, బిజెపి ఓటమి ధ్యేయంగా ఇతర లౌకికవాద శక్తులతో కలిసి సిపిఎం చర్చలు జరుపుతోంది.
కేంద్ర కమిటీ పిలుపు
ప్రజలపై మోపుతున్న భారాలపై కార్మిక సంఘాలు, కిసాన్ సభ, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపిచ్చిన మేరకు దేశవ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యాచరణకు, 14 డిమాండ్లతో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమానికి కేంద్ర కమిటీ మద్దతు ప్రకటించింది. ప్రజల జీవనోపాధులపై పెరుగుతున్న భారాలకు, దళితులు, మహిళలు, సమాజంలో వెనుకబాటుకు గురైన వారిపై పెరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, ప్రజాతంత్ర హక్కులు, పౌర స్వేచ్ఛలపై జరిగే దాడులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, స్థానికంగా జరిగే పోరాటాలను, నిరసన కార్యాచరణలను బలోపేతం చేయాలని అన్ని పార్టీ శాఖలకు కేంద్ర కమిటీ పిలుపిచ్చింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాలు సక్రమంగా అమలయ్యేలా హామీ కల్పించడంపై ఈ స్థానిక పోరాటాలు దృష్టి పెట్టాలని, వేతనాలు సకాలంలో చెల్లించేలా చూడాలని, డిమాండ్‌కు తగినట్లుగా పనులు కల్పించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చేలా చూడాలని కోరింది.










